
అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు
రూ.5 వేలు వేస్తూ రూ.7 వేలు ఇచ్చానని అబద్ధం
కరోనాలో రైతులకు లాక్ డౌన్ లేకుండా చేశానని వెల్లడి
ఉచిత పంటల బీమా ఇవ్వకుండానే ఇచ్చానని చెప్పిన సీఎం
రైతులు, ప్రజలు లేక వెలవెలబోయిన సభా ప్రాంగణం
పసుపు కండువాలు తీసేసి ఆకుపచ్చ కండువాలు వేసుకున్న కార్యకర్తలు
వైఎస్ జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/దర్శి : ‘చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా లేదు.. ఉండదు.. ఉండబోదు.. ఇది నా ప్రామిస్..’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనసులో మాట బయట పెట్టారు. రైతులంటే తనకు ఎంత చిన్నచూపో మరోమారు స్పష్టం చేశారు. గతంలో ఉచిత విద్యుత్ ఇస్తానన్న వైఎస్ రాజశేఖరరెడ్డి మాటలను తప్పుపట్టి.. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు, వ్యవసాయం దండగ.. రైతులు మరో పని చూసుకోవాలని కూడా చెప్పిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెంలో శనివారం పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నగదు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ.. అన్నదాతల పట్ల తనకున్న చులకన భావాన్ని చాటుకున్నారు. ఈ పథకం కింద రూ.5 వేలు వేస్తూ రూ.7 వేలు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేశాను చూసుకోండి తమ్ముళ్లూ.. అనటంతో రైతులు అవాక్కయ్యారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 46.85 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.3,174 కోట్ల నగదు జమ చేశానని చెప్పారు.
కరోనా సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అయితే చంద్రబాబు మాత్రం తన ప్రసంగంలో ‘తుపాను వచ్చినా, నష్టపోయినా, ఏ రైతూ వ్యవసాయం మానలేదు. భయంకరమైన కరోనా వచ్చిన సమయంలో అన్ని రంగాలకు లాక్‌డౌన్ ఇచ్చాం. కానీ రైతులకు మాత్రం లాక్ డౌన్ లేకుండా చేశాను’ అని చెప్పడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. గత ఏడాది పంటలకు ఉచిత పంటల బీమాను ఇవ్వకపోయినా, ఇచ్చామని మరో అబద్ధం చెప్పారు. దేశంలో డ్రిప్ ఇరిగేషన్‌ను తానే ప్రవేశ పెట్టానని చెప్పుకొచ్చారు.
సీఎం ప్రసంగంలో ఎక్కువ భాగం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కార్యకర్తలను సైతం రెచ్చగొట్టారు. ఇచ్చిన హామీల గురించి మాట్లాడే ప్రయత్నమే చేయలేదు. తనను ఆశీర్వదించాలని పదే పదే అడిగారు. సాక్షి పేపర్‌లో నారాసుర రక్త చరిత్ర అని రాశారని మండిపడ్డారు. మీరు సాక్షి పేపర్ చూస్తారా? అని ప్రశి్నంచారు.
ముఖం చాటేసిన రైతులు
రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి వీరాయపాలెం గ్రామంలోని రైతులు కూడా పూర్తి స్థాయిలో రాలేదు. సభా ప్రాంగణంలో ఎటువంటి టెంట్లు వేయలేదు. నులక, నవారు మంచాలు వేయించి వచ్చిన కొద్దిమంది రైతులను పొలంలో ఎర్రటి ఎండలో వాటిపైనే కూర్చోబెట్టారు. ప్రాంగణంలోకి రైతులు మాత్రమే వెళ్లాలని నిబంధనలు పెట్టారు. సామాన్య రైతులు రాక పోవడంతో ప్రాంగణం వెలవెలబోయింది. దీంతో కార్యకర్తలు పసుపు కండువాలు తీసేసి ఆకు పచ్చ కండువాలు వేసుకుని మంచాలపై కూర్చున్నారు.
ఉదయం 10 గంటల నుంచి చంద్రబాబు సభ అయిపోయే వరకు ఎండ వేడిమి భరించలేక వచ్చిన వారిలో చాలా మంది మధ్యలోనే వెళ్లిపోయారు. చంద్రబాబు మాట్లాడుతుండగా కొందరు కార్యకర్తలు మంచాల పైకెక్కి వాటిని విరగ్గొట్టారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఎల్‌ఈడీ ద్వారా చాలా సేపు చూపించారు. ఎండ వేడిమికి తాళలేక చాలా మంది సొమ్మసిల్లి పోయే పరిస్థితిలో చంద్రబాబు మాట్లాడటం మొదలు పెట్టారు. సభను రక్తి కట్టించేందుకు ఆ ప్రాంగణం అంతా అధికారులు, టీడీపీ నాయకులు హంగామా చేశారు. చంద్రబాబు అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. సీఎం ప్రసంగం పూర్తి కాకముందే వెనుక భాగంలోని మంచాలు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. ఇంతటి అట్టర్ ఫ్లాప్ షో ఎప్పుడూ చూడలేదని టీడీపీ కార్యకర్తలే మాట్లాడుకోవడం కనిపించింది.
అసంతృప్తితో బాబు తిరుగు ప్రయాణం
చంద్రబాబు తన సభను రక్తి కట్టించాలని ఎంత ప్రయత్నించినా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో అసంతృప్తితో వెనుతిరిగారు. సభ పూర్తయిన తర్వాత ఏసీ బస్‌లోకి ఎక్కిన బాబు.. అరగంటకు పైగా లోపలే కూర్చుండిపోయారు. ‘సీఎం బస్సు దిగి కిందకు వస్తారు.. వరి నాట్లు వేస్తారు’ అని అధికారులు సభా ప్రాంగణం ముందు నాట్లు వేయించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే డ్రోన్ కెమెరాలు ప్రారంభించే కార్యక్రమంలోనూ సీఎం పాల్గొనలేదు. ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం కూడా రద్దు చేసుకుని వెళ్లిపోయారు.
కాగా, తూర్పు వీరాయపాలెం గ్రామంలోని ఇళ్లల్లో ఉన్న మంచాలన్నీ చంద్రబాబు కార్యక్రమానికి తరలించారు. ఈ కార్యక్రమానికి అరకొరగా హాజరైన వారిలో అధికారులు, ఉద్యోగులు 80 శాతం, రైతులు.. ప్రజలు 20 శాతం ఉన్నారు. వీరిలో చాలా మంది మధ్యలోనే వెళ్లిపోయారు. ‘నేను మీ కోసం ఇంతటి ఎండలో ఉన్నాను.. మరి మీరు ఉండరా..’ అని చంద్రబాబు అడిగినా ఎవరూ వినిపించుకోలేదు. కార్యక్రమం ముగిశాక విరిగిపోయిన మంచాలను చూసి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగున్న వాటిని ఎవరివి వాళ్లు తీసుకెళ్లారు.