అర్హులను తొక్కేసి.. అడ్డగోలు డ్రామాలు! | Chandrababu Government Latest Conspiracy On DSC 2025: Andhra pradesh | Sakshi
Sakshi News home page

అర్హులను తొక్కేసి.. అడ్డగోలు డ్రామాలు!

Jun 2 2026 3:34 AM | Updated on Jun 2 2026 3:34 AM

Chandrababu Government Latest Conspiracy On DSC 2025: Andhra pradesh

అర్హులకు చేసిన అన్యాయాన్నికప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు 

పోస్టల్‌ శాఖ తిరస్కరించిన అభ్యర్థికి డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో పోస్టింగ్‌పై సొంత భాష్యాలు

సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ –2025లో అక్రమాలను కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పడరాని పాట్లు పడుతోంది! అడ్డదారిలో ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అవన్నీ సక్రమమే అంటూ అడ్డగోలుగా అబద్ధాలు చెబుతోంది. ఓ అభ్యర్థి గతంలో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో (రెండు వేర్వేరు పుట్టిన తేదీలు) సంపాదించిన క్రీడల సర్టిఫికెట్‌తో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టల్‌ శాఖ నిర్ద్వందంగా తిరస్కరించింది. అలాంటి అభ్యర్థికి ఈ డీఎస్సీలో ఏకంగా స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టు కట్టబెట్టేసి ఎలాంటి తప్పులేదంటూ రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకోవడం విస్తుగొలుపుతోంది.

సోమవారం సచివాలయంలో పర్యాటక, యుజవన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, శాప్‌ ఎండీ భరణిని ముందుపెట్టి ప్రభుత్వం తన తప్పులను ఒప్పులుగా చిత్రీకరించేందుకు యత్నించి భంగపడింది. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మభ్యపెట్టే యత్నం చేసింది. క్రీడా సర్టిఫికెట్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది, శాప్‌ అధికారులది కాదని.. క్రీడా సంఘాలు మాత్రమే ఇస్తాయంటూ అర్థంలేని వాదన వినిపించింది. డీఎస్సీ క్రీడా కోటాలో ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను వెబ్‌సైట్‌లో, బహిరంగంగా ప్రదర్శించకుండా దాచిపెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ‘క్రిడయ్‌’ యాప్‌లో పెట్టామంటూ సమర్థించుకోవడం దుర్నీతిని బట్టబయలు చేస్తోంది.

కోర్టు కేసులను ఎదుర్కొని పారదర్శకంగా నియామకాలు చేపట్టినట్లు స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్‌ గొప్పగా ప్రకటించారు. అయితే, అంతర్‌ జిల్లా స్థాయిలో సర్టిఫికెట్లు తెచ్చుకున్న క్రీడాకారులకు యథేచ్ఛగా టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చేసిన ప్రభుత్వం.. అంతర్జాతీయ క్రీడాకా­రులకు మాత్రం పోస్టులు ఇచ్చేందుకు ఎందుకు నిరాకరించిందో మాత్రం చెప్పడం లేదు. ఆయా అంతర్జాతీయ క్రీడాకారులు హైకోర్టును ఆశ్రయించగా అధికారుల తీరును తప్పుబట్టి అక్షింతలు వేసిన తరువాతే డీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారు.

మరి పారదర్శకత ఎక్కడ పాటించారు? హైకోర్టు ఆదేశాలతో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పుకొచ్చారు. మరి నియామకాల సమయంలోనే తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందుతున్న వారి వివరాలతో సహా అర్హులైన అభ్యర్థులు శాప్‌కు ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదో చెప్పలేక నీళ్లు నమిలారు. ఇక ఈ డీఎస్సీ తర్వాత క్రీడా కోటాలో రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ జీవోను సవరించడంపై అధికారులు వివరణ ఇస్తూ.. ప్రభుత్వ పాలసీ పర్మినెంట్‌గా ఉండదని సమర్థించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ప్రభుత్వానికి పాలసీ పర్మినెంట్‌గా ఉండదట!
మీడియా: డీఎస్సీ ముగిసిన తర్వాత స్పోర్ట్స్‌ కోటా 3 శాతం హారిజాంటల్‌ రిజర్వేషన్‌ జీవోను ఎందుకు సవరించారు? మళ్లీ రాత పరీక్షను ఎందుకు తప్పనిసరి చేశారు? క్రీడా సర్టిఫికెట్లు, డిగ్రీల జెన్యూనుటీని ఎలా పరిశీలించారు?

స్పెషల్‌ సీఎస్, శాప్‌ ఎండీ: ప్రభుత్వానికి పాలసీలు పర్మినెంట్‌గా ఉండవు. క్రీడా పాలసీ కూడా అంతే. క్షేత్రస్థాయి ఫీడ్‌ బ్యాక్‌ను బట్టి పాలసీ మారిపోతుంది. అప్పటి పాలసీ ప్రకారం రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చాం. కొన్నిసార్లు చట్టాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. 

శాప్‌లో ప్రత్యేక స్రూ్కటినీ బృందాలను పెట్టి ఆ తర్వాత స్క్రీనింగ్‌ కమిటీ ద్వారా 1 : 5 నిష్పత్తిలో జాబితా తయారు చేశాం. వాటిని వారం రోజులు వెబ్‌సైట్‌లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించి తర్వాత తుది జాబితాను సిద్ధం చేశాం. 421 పోస్టులకుగాను 382 పోస్టులు భర్తీ చేశాం. క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి జెన్యూనుటీ సర్టిఫికెట్లు తీసుకొచ్చాం. స్రూ్కటినీ కమిటీలో ఆయా వర్సిటీల అధికారులు పరిశీలించి ఓకే చేశారు.

ఇదీ వాస్తవం: ప్రభుత్వం చెబుతున్నట్లుగా క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి క్రీడాకారుల జెన్యూనుటీ సర్టిఫికెట్లను తీసుకుంటే ఒక్కటి కూడా మీడియాకు చూపించలేదు. వాస్తవానికి ధ్రువపత్రాల పరిశీలన సమయంలో క్రీడా సంఘాల ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలి. జాతీయ స్థాయిలో అయితే ఫెడరేషన్‌ సభ్యులు ప్రభుత్వ నియామకాల్లో కచ్చితంగా పాల్గొంటారు. 

గత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాల భర్తీ సమయంలో తొలుత జిల్లా స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో వడపోత చేపట్టారు. పైగా అçప్పుడు రాత పరీక్షల్లో అర్హత సాధిస్తే ఉద్యోగం కల్పించారు. డీఎస్సీ మాదిరిగా క్రీడా సర్టిఫికెట్‌ చూసి ఉద్యోగం ఇవ్వలేదు. 1.34 లక్షల మందితో సచివాలయాల ఉద్యోగాల భర్తీ నిర్వహించినప్పుడు రాని ఆరోపణలు ఇప్పుడు 2025 డీఎస్సీలో మాత్రమే ఎందుకు వస్తున్నాయో ఈ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. పైగా ఇతర రాష్ట్రాల్లో చదివిన ఉద్యోగార్థుల వివరాలను ఆయా వర్సిటీల్లో పరిశీలించకుండానే చేసేసినట్టు చెబుతోంది.

శాప్‌.. పూటకో మాట!
డీఎస్సీ ఉద్యోగార్థుల క్రీడా సర్టిఫికెట్లను పారదర్శకంగా స్రూ్కటీని చేసినట్లు స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌ బల్లగుద్ది చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలనలో ‘శాప్‌’ పారదర్శకత ఏపాటిదో చెప్పేందుకు ఈ ఉదంతమే ఓ నిదర్శనం. 2024 సెప్టెంబర్‌లో న్యాయస్థానాల్లో ఉద్యోగాల భర్తీ సందర్భంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ క్రీడాకారుడు ‘ప్రాసెస్‌ సర్వర్‌ పోస్టు’ కోసం క్రీడా కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. 2021 డిసెంబర్‌ 24–28 వరకు అనంతపురంలో జరిగిన సాఫ్ట్‌బాల్‌ నేషనల్‌ మీట్‌లో పాల్గొని తన టీమ్‌ రజత పతకం సాధించినట్లు అతడు పేర్కొన్నారు.

ఈ క్రీడా సర్టిఫికెట్లు శాప్‌ పరిశీలనకు రావడంతో ‘మాస్టర్‌మైండ్‌’ తన వాటా కింద రూ.3 లక్షలు వసూలు చేసి అంతా సక్రమమేనంటూ అధికారులతో చెప్పించడంతో సదరు క్రీడాకారుడికి ఉద్యోగం వచ్చేసింది. అయితే దీనిపై ఓ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఉద్యోగానికి ఎంపికైన సదరు క్రీడాకారుడు ఆ సమయంలో సాఫ్ట్‌బాల్‌ నేషనల్‌ మీట్‌లో పాల్గొనలేదని, ఆ సమయంలో అతడు ఓ కళాశాలలో బీపీఈడీ కోర్సు చదువుతున్నట్లు ఆధారాలు సమర్పించారు.

దీనిపై సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం ఆదేశాల మేరకు మరోసారి సర్టిఫికెట్లను పరిశీలించిన శాప్‌ అధికారులు అవి సరైనవి కాదని తేల్చారు. దీనిపై సదరు క్రీడాకారుడు డివిజనల్‌ బెంచ్‌ను ఆశ్రయించగా శాప్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. తాము ఆ క్రీడాకారుడికి నోటీసులు ఇచ్చినప్పటికీ ఫిజికల్‌ టెస్టుకు హాజరు కాలేదని, ఆటలో నైపుణ్యం లేదని పేర్కొంది. దీనిపై తాజాగా హైకోర్టు శాప్‌ అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో స్పెషల్‌ సీఎస్‌ చెబుతున్నట్లుగా శాప్‌ నిజంగానే అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుంటే కోర్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనపై పూటకో మాట ఎందుకు చెబుతోంది? ఏ రాజకీయ శక్తి చేతుల్లో శాప్‌ బందీగా మారిపోయింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

తొలుత సదరు సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారుడి సర్టిఫికెట్‌ సరైనదే అంటూ ధ్రువీకరించిన శాప్‌.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో మరోసారి ఆ సర్టిఫికెట్లు నిజమైనవి కావంటూ మాట మార్చినట్లు స్పష్టం చేస్తున్న హైకోర్టు ఆర్డర్‌  

సర్వీసు రూల్స్‌కు ముందు జీవో సవరణ?
కూటమి ప్రభుత్వం తన తప్పులను సమర్థించుకునే క్రమంలో అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. డీఎస్సీ 2025 ముగియడమే ఆలస్యం.. స్పోర్ట్స్‌ కోటాలో రాత పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వటాన్ని ఎత్తివేసింది. తొలుత డీఎస్సీకి ముందు ఏపీ స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీసు రూల్స్‌ను సవరిస్తూ 19–04–2025న అప్పటి సీఎస్‌ విజయానంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం డీఎస్సీలో పరీక్ష లేకుండా క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు.

డీఎస్సీ ముగిసిన తర్వాత ఈ ఏడాది మే 15న ఏపీ సబార్డినేట్‌ అండ్‌ సర్వీసు రూల్స్‌ను మళ్లీ సవరిస్తూ సీఎస్‌ సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కచ్చితంగా డిపార్ట్‌మెంట్‌ పెట్టే రాత పరీక్షలో అర్హత సాధించాలని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే.. ఈ ఏడాది మే 15న సబార్డినేట్‌ అండ్‌ సర్వీసు రూల్స్‌ సవరణ కంటే ముందే.. మే 14 క్రీడా శాఖలో జీవోను సవరిస్తూ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్‌ ఉత్తర్వులు ఇవ్వడం!

నేషనల్‌ గేమ్స్‌కు ప్రాధాన్యమా?
క్రీడా పాలసీ 2024–29 రూపకల్పనలో కూటమి ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించింది. ‘మాస్టర్‌మైండ్‌’ చెప్పినట్టే పాలసీ పురుడు పోసుకుంది. డీఎస్సీలో అక్రమాలకు మార్గం సుగమం అయింది. పాలసీ రూపకల్పన సమయంలోనే క్రీడా సంఘాలను ప్రభుత్వం సంప్రదించి ఉంటే.. సీనియర్‌ నేషనల్స్‌కు ప్రాధాన్యం దక్కాల్సిన చోట నేషనల్‌ గేమ్స్‌ పెట్టడంపై క్రీడా సంఘాలు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తాయి? పదేపదే జీవోలను సవరించామని ఎందుకు డిమాండ్‌ చేస్తాయి? వీటికి ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు.

గొప్పగా 65 క్రీడలకు అవకాశం కల్పించాలని చెబుతున్న ప్రభుత్వం.. ఏపీలో అంతగా ప్రాచుర్యంలో లేని క్రీడలను ఎందుకు చేర్చింది? ఫెడరేషన్లలో గుర్తింపు పొందిన ఏపీ క్రీడా సంఘాలకు కచ్చితంగా శాప్‌ గుర్తింపు ఇవ్వాల్సి ఉండగా వాటిని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తోంది? మాస్టర్‌మైండ్‌ మాట వింటేనే క్రీడా సంఘాలు మనుగడ సాగించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ పరిశీలిస్తుంటే అర్హులకు పోస్టులు ఇవ్వకుండా అన్యాయం చేసినట్లు స్పష్టమవుతోంది.

పోస్టల్‌ శాఖలో రిజెక్ట్‌.. డీఎస్సీలో పోస్టింగ్‌
మీడియా: విజయనగరం జిల్లాలో వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి ఒకరు తప్పుడు డేట్‌ ఆఫ్‌ బర్త్‌లతో ఉద్యోగం పొందారని ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఏం చేశారు? గతంలో పోస్టల్‌ శాఖ ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది కదా? పోలీసులు సైతం ఆమె తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో మోసం చేసినట్టు ధ్రువీకరించారు?

స్పెషల్‌ సీఎస్, శాప్‌ ఎండీ: విజయనగరం జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణిపై ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు. ఆ జిల్లా ఎస్పీ సైతం దీన్ని ధ్రువీకరిస్తూ పత్రం ఇచ్చారు. సదరు క్రీడాకారిణి నేషనల్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించారు. ఆమె 20–5–1992 డేట్‌ ఆఫ్‌ బర్త్‌తో క్రీడల్లో పాల్గొంది. ఆమె స్కూల్‌లో డేట్‌ ఆఫ్‌ బర్త్‌ కూడా అదే. మేం క్రీడా సంఘాలు, ఫెడరేషన్‌ నుంచి సైతం జెన్యూనుటి తీసుకున్నాం.

ఇదీ వాస్తవం: విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి రెండు పుట్టిన తేదీలతో చలామణి అయినట్లు జిల్లా ఎస్పీకి 08–4–2016న స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ నివేదిక సమర్పించారు. ఎస్‌వీఆర్‌ మూర్తి అనే వ్యక్తి సదరు క్రీడాకారిణిపై విశాఖ రేంజ్‌ డీఐజీకి ఆధారాలతో సహా 19–02–2016లో ఫిర్యాదు చేశారు. దీనిపై డీఐజీ ఆదేశాలతో విజయనగరం ఎస్పీ విచారణ చేపట్టారు. విచారణ చేసిన స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు 08–04–2016న సదరు క్రీడాకారిణి 20–05–1992, 10–05–1993 డేట్‌ ఆఫ్‌ బర్త్‌లతో చలామణి అయినట్టు ధ్రువీకరిస్తూ నివేదిక సమర్పించారు.

తొలుత  10–05–1993 పుట్టిన తేదీతో (10–11–2010న) పాస్‌పోర్టు పొందగా, తర్వాత 06–08–2015న రూ.ఐదు వేలు జరిమానా చెల్లించి పుట్టిన తేదీ 20–05–1992తో కొత్త పాస్‌పోర్టు పొందినట్టు వెల్లడించారు. అయితే 10–05–1993 (తప్పుడు పుట్టిన తేదీ)తోనే ఆమె 2012లో కామన్‌వెల్త్‌ జూనియర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో 53 కిలోల మహిళల విభాగంలో ప్రాతినిధ్యం వహించింది. ఇలా అండర్‌ ఏజ్‌లో తప్పుడు డేట్‌ ఆఫ్‌ బర్త్‌తో జాతీయ పోటీల్లోనూ పాల్గొంది. ఇక 2015 సమయంలో 20–05–1992 పుట్టిన తేదీతో నేషనల్‌ గేమ్స్‌లో పాల్గొని పతకం సాధించింది.

డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందు సదరు క్రీడాకారిణి పోస్టల్‌ శాఖలో ‘పోస్టల్‌ అసిస్టెంట్‌’ (రిజిస్టర్‌ నం, ఎస్‌పీ3ఈ153ఏ149బీఈ5ఎఫ్‌) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలపై ఫిర్యాదులు అందడంతో పోస్టల్‌ శాఖ విచారించి ఆమెను ఉద్యోగానికి ఎంపిక చేయకుండా తిరస్కరించింది. అలా పోస్టల్‌ శాఖ సదరు అభ్యర్థి మోసాన్ని గుర్తించి ఎంపికకు నిరాకరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేషనల్‌ గేమ్స్‌లో 20–05–1992 తేదీతో ఆడారని, ఎటువంటి పోలీసు కేసులు లేవని చెబుతూ తన తప్పిదాన్ని సమర్థించుకుంటోంది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 24న ‘డీఎస్సీ డీల్స్‌’ కథనంలో సదరు క్రీడాకారిణి నియామకంపై ఆధారాలతో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. అప్పటి నుంచి ఆమె క్రీడా సర్టిఫికెట్‌ జెన్యూనుటీ నిజమైనదేనని చెప్పాలంటూ క్రీడా సంఘాలపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం కాదా? 2025 ఆగస్టు 11న ఓ క్రీడాకారుడు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే అప్పుడు పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు తప్పును దాచేందుకు మల్లగుల్లాలు పడుతోంది.

 2016లో విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి వేర్వేరు పుట్టిన తేదీలతో చలామణి అయినట్టు ధ్రువీకరించిన నివేదిక  

Advertisement
 
Advertisement
Advertisement