బాలాజీ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన టీడీపీ నేతలు, ఉపాధ్యాయులు
దగా డీఎస్సీతో చంద్రబాబు ప్రభుత్వం డీలా
నష్ట నివారణకు ప్రభుత్వ పెద్దలు దిశానిర్దేశం
రంగంలోకి దిగిన శాప్ చైర్మన్ రవినాయుడు
తిరుపతి డీఈవోపై ఒత్తిడి తెచ్చి ఉపాధ్యాయులతో సమావేశానికి స్కెచ్
కొత్త టీచర్లందరికీ డీఈవో ఆఫీస్ నుంచి ఫోన్లు
హాజరు కాకపోతే చర్యలుంటాయని హెచ్చరికలు
అధికారిక మీటింగ్ అనుకుని హాజరై.. వారు చెప్పింది విని బిత్తరపోయిన టీచర్లు
వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా మాట్లాడాలని శాప్ చైర్మన్, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీల ఉపన్యాసాలు
తిరుపతి టాస్క్‌ఫోర్స్: డీఎస్సీ–2025లో అవకతవకలు బట్టబయలు కావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. దాన్నుంచి బయట పడేందుకు కొత్తగా ఉపాధ్యాయులైన వారిని పావులుగా వాడుకునేందుకు స్కెచ్ వేసింది. మెరిట్ కలిగి ఉండీ, ఉద్యోగం రాని బాధితుల తరఫున పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ పైకి వారిని ఉసిగొల్పేందుకు శక్తి వంచన లేకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో తిరుపతి వేదికగా బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ‘నిరుద్యోగులపై గొడ్డలి వేటు’ అంటూ సమావేశం నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది.
స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు ఈ సమావేశానికి వచ్చే పరిస్థితి ఉండదని భావించి డీఈవోను అడ్డం పెట్టుకుని మార్గ నిర్దేశం చేసింది. దీంతో డీఈవో కాస్తా టీడీపీ నేతగా పరకాయ ప్రవేశం చేశారు. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. శనివారం మీటింగ్ ఉందని డీఎస్సీ–2025లో పోస్టింగ్ పొందిన ప్రతి ఉపాధ్యాయుడు మీటింగ్‌కు హాజరు కావాలని డీఈవో కేవీఎన్ కుమార్ తన సిబ్బందితో ఫోన్‌లు చేయించారు. ఓ దశలో వచ్చి తీరాల్సిందేనని బెదిరించారు. తీరా ఆ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు.. అక్కడ టీడీపీ నేతలు ఉండటం చూసి బిత్తర పోయారు.
డీఎస్సీ కుంభకోణంపై గళమెత్తిన వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సమావేశానికి తమను మభ్యపెట్టి రప్పించడం తగదని అసహనం వ్యక్తం చేశారు. అధికారిక సమావేశం అని చెప్పి ప్రతిపక్ష పార్టీలను విమర్శించమని నిర్దేశించడం తగదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వారికి ఎదురు చెబితే దాడులు చేస్తారని జడిసి మిన్నకుండిపోయారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, టీడీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్‌రెడ్డి 2 గంటల పాటు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా, వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.
టీడీపీ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, పార్టీ సమావేశాన్ని తలపించేలా రాజకీయ నేతలు ఉపన్యాసాలు ఇవ్వడం ఏమిటని ఉపాధ్యాయులు తలలు పట్టుకున్నారు. తుదకు తమను పార్టీ కార్యకర్తలుగా చేశారని వాపోయారు. ‘ప్రభుత్వం ఇలా చేయడం తగదు. మమ్మల్ని ఇలా పిలిపించడం ఏమాత్రం సరికాదు. తప్పు జరిగింది కాబట్టే ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని అర్థమవుతోంది.
లేకుంటే ఇంత దొంగచాటుగా సమావేశం నిర్వహించడం ఏమిటి? పొరపాట్లు జరిగి ఉంటే హూందాగా ఒప్పుకుని సరిచేయాలి. అర్హత ఉన్న వారికి ఉద్యోగం రాకపోవడం నిజంగా నేరమే’ అని ఈ సమావేశానికి హాజరైన పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానించారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు డీఈవోను సంప్రదిస్తే.. ఆ సమావేశంతో తనకు సంబంధం లేదని విచిత్ర సమాధానం చెప్పడం కొసమెరుపు. అసలు ఏ అధికారంతో శాప్ చైర్మన్ రవి నాయుడు ఈ సమావేశం నిర్వహించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని బాధిత డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు.
సీన్ 1 : ‘డీఎస్సీ కుంభకోణంతో మన పరువుపోతోంది. మనమేమో గొప్పగా
నిర్వహించామని ఇన్నాళ్లూ చెప్పుకున్నాం.. ఇలాగే సైలెంట్‌గా ఉంటే మన గ్రాఫ్ తగ్గిపోతుంది.. ఏదో ఒకటి చేయాలి.. లేదంటే ప్రజల్లో పలుచనైపోతాం.. చేసేదేదో త్వరగా చేయండి’ అని ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆందోళనతో దిశా నిర్దేశం చేశారు.
సీన్ 2 : డీఎస్సీ కుంభకోణాన్ని అంతా తానై నడిపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శాప్ చైర్మన్ రవి నాయుడు రంగంలోకి దిగారు. తిరుపతి డీఈవోపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పరువు కాపాడటం కోసం తమకు సహకరించాలని, ఇది ‘పెద్దల’ నిర్ణయం అని చెప్పారు.
సీన్ 3 : ‘హలో.. మేము డీఈవో కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. 2025 డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శనివారం తిరుపతిలో డీఈవోతో సమావేశం ఉంది. ఉదయం 10 గంటలకు బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం వద్దకు కచ్చితంగా చేరుకోవాలి. ఎట్టిపరిస్థితిలో మిస్ కాకూడదు. మీటింగ్‌కు హాజరుకాని వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అని ఫోన్ ద్వారా హుకుం జారీ.
సీన్ 4 : అఫీషియల్ సమావేశం అని చెప్పడంతో కొత్త ఉపాధ్యాయులంతా పనులు మానుకుని శనివారం హుటాహుటిన తిరుపతి చేరుకున్నారు. సమావేశం ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలోకి వెళ్లగానే అక్కడి వాతావరణం చూసి భయపడ్డారు. ఏమైనా మాట్లాడితే స్టేజి పైనున్న టీడీపీ నేతల అనుచరులు తన్నేలా ఉన్నారని నోరు మూసుకుని కూర్చున్నారు. ఈ గోలంతా తనకెందుకని అనుకున్న డీఈవో గైర్హాజరయ్యారు.
సీన్ 5 : ‘మీరంతా కష్టపడి టీచర్ ఉద్యోగాలు సంపాదించారు. కానీ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కాదంటోంది. వారికి తగిన విధంగా మీరు సమాధానం ఇవ్వాలి. లేదంటే మీకు ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై మరక పడుతుంది’ అని శాప్ చైర్మన్ రవినాయుడు దిశానిర్దేశం చేశారు. ఇందుకు ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్‌రెడ్డి వంత పాడారు.
రాజకీయ సభకు ఉపాధ్యాయులా!?
విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన డీఈవో, అధికార పార్టీ రాజకీయ కార్యక్రమాలకు ఉపాధ్యాయులను సమీకరించే పనిలో నిమగ్నం కావడం దారుణం. డీఎస్సీలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు అధికార పార్టీ కొత్తగా నియమితులైన టీచర్లతో రాజకీయ సభ నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆ సభకు డీఈవో కార్యాలయం నుంచి టీచర్లకు ఫోన్లు చేసి రప్పించడం ఇంకా దారుణం. విద్యా కార్యక్రమమని భావించి హాజరైన ఉపాధ్యాయులకు రాజకీయ ఉపన్యాసం వినిపించడం ఏమాత్రం సబబు కాదు. ఈ అంశంపై కలెక్టర్ వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. – వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతి
టీడీపీ అడ్డాగా డీఈవో ఆఫీస్
జిల్లా విద్యా శాఖ అధికారి అధికార పార్టీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తూ తన పదవికి మచ్చ తెచ్చారు. ఈయన్ను తక్షణం విధుల నుంచి తొలగించాలి. జిల్లా విద్యా శాఖ కార్యాలయం అధికార పార్టీకి అడ్డాగా మారింది. అధికార పార్టీ ఏర్పాటు చేసే సభలకు కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులను సమీకరించే సాధనంగా డీఈఓ కార్యాలయాన్ని ఉపయోగించడం దారుణం. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ఉద్దేశంతో డీఈవో ఉపాధ్యాయులకు ఫోన్లు చేసి సభకు హాజరు కావాలని ఆదేశించడం దుర్మార్గం. ఆయన ఆ పదవికి అనర్హుడు. తక్షణం తొలగించాలి. లేని పక్షంలో ఉద్యమిస్తాం. – అక్బర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతి
డీఈఓను సస్పెండ్ చేయాలి
డీఈవో స్థాయి అధికారి ఓ పార్టీకి కొమ్ము కాయడం దారుణం. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం సహించరాని విషయం. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసనలకు భయపడి ఉపాధ్యాయులను ఉసిగొల్పాలనుకోవడం దారుణం. అధికారిక మీటింగ్ అని చెప్పి, ఉపాధ్యాయులను మభ్యపెట్టి పార్టీ మీటింగ్‌లకు హాజరు కావాలని హుకుం జారీ చేసిన డీఈఓను తక్షణం సస్పెండ్ చేయాలి. – డాక్టర్ ఓబుల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తిరుపతి
ఎవరు చెబితే ఇలా చేశారు?
డీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డీఈవో తీరు విమర్శలకు తావిస్తోంది. విద్యా వ్యవస్థను రాజకీయాలకు ముడిపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లా విద్యాశాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో, వాటిపై దృష్టి సారించకుండా పార్టీ మీటింగ్‌లకు ఉపాధ్యాయులను పంపే కార్యక్రమంలో ఉండటం దారుణం. ఇలాంటి వ్యక్తులు ఆ పదవికి అనర్హులు. ఇలాంటి వ్యవహారాలతోనే ‘పది’ ఫలితాలపై ప్రభావం పడుతోంది. ఇంతకూ ఎవరు చెబితే డీఈవో ఈ సమావేశం నిర్వహించారో వెల్లడించాలి. – సుందరరాజు, ఎన్‌ఎల్‌ఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు
అబ్బే.. మేం పిలవలేదు..
డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు తిరుపతిలో శనివారం మీటింగ్‌కు హాజరు కావాలని మేము ఎవరికీ చెప్పలేదు. డీఈవో ఆఫీస్ నుంచి తాను చెప్పినట్లు ఎవరూ కాల్స్ చేయలేదు. కొత్తగా ఎంపికైన టీచర్లను మీటింగ్ పేరుతో పిలిపించి.. టీడీపీ వాళ్లు నిర్వహించిన మీటింగ్‌కు హాజరు కావాలని మేము చెప్పలేదు. నాకు ఈ అంశంతో సంబంధం లేదు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం నేను పిచ్చాటూరు, సత్యవేడు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల పరిశీలనలో ఉన్నాను. నా పేరు చెప్పి, డీఈవో ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్లు చేసి ఉపాధ్యాయులను పిలిపించారేమో విచారిస్తాను. – కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి


