ఏపీ లక్ష్యం 6.68 ఎంటీవోఈ చమురు ఆదా

Central Govt praise for energy efficiency measures in Jagananna colonies - Sakshi

2030 నాటికి బిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలన్నది కేంద్రం లక్ష్యం 

ఇందుకోసం రాష్ట్రానికి చమురు ఆదా లక్ష్యం 

రాష్ట్ర ఇంధన సామర్థ్య కార్యాచరణ ప్రణాళికపై వెబినార్‌  

జగనన్న కాలనీల్లో ఇంధన సామర్థ్య చర్యలకు కేంద్రం ప్రశంస

సాక్షి, అమరావతి: కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ఇంధనశాఖ రాష్ట్రాలకు కార్యాచరణ రూపొందించింది. దీనిలో భాగంగా రాష్ట్ర ఇంధన శాఖకు 6.68 మిలియన్‌ టన్నుల ఆయిల్‌ ఈక్వలెంట్‌ (ఎంటీవోఈ) చమురును ఆదా చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నాకి తగ్గించాలనే కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర విద్యుత్‌శాఖ, బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ద్వారా రాష్ట్ర ఇంధన సామర్థ్య కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వ ఇంధన కార్యదర్శులతో వెబినార్‌ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 2030 నాటికి 750 బిలియన్‌ యూనిట్లకు సమానమైన 887 మిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించే క్రమంలో రాష్ట్రాలన్నీ కలిసి 150 మిలియన్‌ టన్నుల చమురుకు సమానమైన ఇంధనాన్ని ఆదాచేయాలని కేంద్ర ఇంధనశాఖ సూచించింది. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్‌ సీఈవో చంద్రశేఖరరెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు.  

కేంద్ర మంత్రి ప్రశంసలు 
రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలపై ఇంధనశాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌ వివరించారు. ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఈసీబీసీ)–2017 ద్వారా బిల్డింగ్‌ బైలాస్‌లో సవరణలు చేసి, తప్పనిసరిచేసిన కొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటని ఆయన తెలిపారు. ఎకో నివాస్‌ సంహిత (ఈఎన్‌ఎస్‌)–2018 ద్వారా ఏపీలో నిరుపేదలకు జగనన్న కాలనీల పేరుతో నిర్మిస్తున్న 28.3 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.

వీధి దీపాల జాతీయ కార్యక్రమం (ఎస్‌ఎల్‌ఎన్‌పీ) అమలులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 6.02 లక్షలు,  గ్రామీణ ప్రాంతాల్లో 23.54 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఇంధన పొదుపు లక్ష్యాలను చేరుకోవడానికి కీలక శాఖలతో సమన్వయం చేసుకుని ఫాస్ట్‌ ట్రాక్‌ మోడ్‌లో అమలు చేయాలని, ఈఎన్‌ఎస్‌ని రాష్ట్ర బిల్డింగ్‌ బైలాస్‌లో చేర్చాలన్నారు. జగనన్న కాలనీలు, ఇతర విభాగాల్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్యక్రమాలను ఇంత పెద్ద ఎత్తున అమలు చేయడం ద్వారా ఏపీ గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గార తగ్గింపు చర్యలకు అత్యంత ఊతమిస్తోందని ప్రశంసించారు.

అన్నిచోట్లా ఈవీ స్టేషన్లు
ప్రధాన నగరాల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు చేయాలని బీఈఈ అధికారులు సూచించారు. ఇంధన రిటైల్‌ అవుట్‌లెట్లు, మునిసిపల్‌ పార్కింగ్, మెట్రో పార్కింగ్, రైల్వే స్టేషన్లు, ఏయిర్‌పోర్టులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు వంటి ఇతర ప్రదేశాలలో పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ వెబినార్‌లో కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆలోక్‌కుమార్, బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ భాక్రే, డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌కుమార్, సెక్రటరీ ఆర్కే రాయ్, డైరెక్టర్‌ మిలింద్‌ డియోర్,తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top