రీసర్వే వద్దు.. | Center prioritizes land resurvey project | Sakshi
Sakshi News home page

రీసర్వే వద్దు..

Nov 24 2024 5:34 AM | Updated on Nov 24 2024 5:34 AM

Center prioritizes land resurvey project

ప్రోత్సాహకాలే  ముద్దు

రీసర్వే ప్రాజెక్టుపై అడ్డగోలు అభాండాలు వేసిన చంద్రబాబు

ఇప్పుడు దానిపైనే రూ.500 కోట్ల ప్రోత్సాహకాలు తీసుకునేందుకు సిద్ధం

ప్రతిపాదనలు పంపాలని ఇటీవల రాష్ట్రాన్ని కోరిన కేంద్రం 

సాక్షి, అమరావతి: భూముల రీసర్వే గురించి అబద్ధాలే సిగ్గుపడేలా దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ రీసర్వే ద్వారానే కేంద్రం నుంచి నిధులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారనే అక్కసుతో రీసర్వేను నిలిపివేసినా.. దాని ఫలా­లు అందుకునేందుకు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భూముల రీసర్వే నిర్వహించాలని చెబుతున్న కేంద్రం... ఇప్పటికే వైఎస్‌ జగన్‌ హయాంలో సర్వే జరిగిన తీరును మెచ్చుకుని ఈ మోడల్‌ను అనుసరించాలని పలు రాష్ట్రాలకు సూచించింది. రీసర్వేను ప్రోత్సహించే క్రమంలో సర్వే చేసిన రాష్ట్రాలకు భారీగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏపీలో రీసర్వే విజయవంతంగా జరగడంతో ఆ ప్రోత్సాహకాలను మొదట మన రాష్ట్రమే అందుకోనుంది. 

వైఎస్‌ జగన్‌ ముందుచూపు.. 
రూ.500 కోట్ల ప్రోత్సాహకంవైఎస్‌ జగన్‌ హయాంలో ఏపీలో 6,800 గ్రామా­ల్లో రీసర్వే పూర్తయిన నేపథ్యంలో రూ.500 కోట్ల ఇన్సెంటివ్‌ పొందేందుకు అర్హత సాధించినట్టు కేంద్రం ఇటీవల రాష్ట్రానికి సమాచారం ఇచ్చింది. గత నెల 17న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రిసోర్సెస్‌ కార్యదర్శి మనోజ్‌ జోషి రాష్ట్రంలో పర్యటించి భూముల రీసర్వే జరిగిన తీరు గురించి తెలుసుకున్నారు. 

రెవెన్యూ శాఖ ఉన్నతా­ధికారులతో జరిగిన సమావేశంలో ప్రోత్సాహ­కాలు పొందేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. భూ రికార్డుల ఆధునికీ­కరణ, రీసర్వే చేసిన రాష్ట్రాలను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే ఆ పనిని చాలా­వరకూ పూర్తి చేసిన ఏపీకి ఇన్సెంటివ్‌ మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. భూముల సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. 

రీసర్వేపై తప్పుడు ప్రచారం చేసి...
రాష్ట్రంలో జరిగిన భూముల రీసర్వేపై తప్పుడు ముద్ర వేసి రద్దు చేయ­డానికి చంద్రబాబు ప్రయత్నించారు. గత ప్రభుత్వ హయాంలో దిగ్విజయంగా జరిగిన సర్వేను అధికారంలోకి రాగానే నిలుపు­దల చేశారు. రాజకీయ స్వార్థంతో ఎన్నికల సమయంలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని ఒక భూతంగా, భూముల రీసర్వేను దారుణమైనదిగా ప్రచారం చేసి చంద్ర­బాబు కూటమి లబ్ధి పొందింది. 

భూములు పోతాయని, లాగేసుకుంటారని భయపెట్టి ప్రజలకు, సమాజానికి ఎంతగానే మేలుచేసే కార్యక్రమంపై విషం కక్కారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం రద్దు చేస్తుండటమే కాకుండా నాలుగున్నరేళ్లు అత్యంత ప్రతి­ష్టాత్మకంగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా జరిగిన భూముల రీ సర్వేను నిలిపి­వేశారు. 

కానీ.. ఇప్పుడు అవే కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లో జరగాలనికేంద్రం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. రీసర్వే ప్రాజెక్టుకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తుండటంతో దాన్ని ఇప్పటికే చేసిన నేపథ్యంలో ఆ వివరాలు పంపి ప్రోత్సాహకాలు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement