‘కాకినాడ’లో.. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ | Bulk Drug Park In Kakinada Andhra Pradesh Central Govt Approval | Sakshi
Sakshi News home page

‘కాకినాడ’లో.. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌

Aug 31 2022 3:22 AM | Updated on Aug 31 2022 10:10 AM

Bulk Drug Park In Kakinada Andhra Pradesh Central Govt Approval - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో ఇది ఏర్పాటు కానుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఎస్‌ఎస్‌సీ (స్కీమ్‌ స్టీరింగ్‌ కమిటీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్‌) 90 రోజుల్లోగా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ అయిన ఐఎఫ్‌సీఐ(ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)కు పంపాలని కేంద్రం కోరింది.

ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ పరిధిలోని ఫార్మాసూటికల్స్‌ విభాగం సంయుక్త కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ మంగళవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌ల ప్రోత్సాహక పథకం ద్వారా దీన్ని చేపట్టేందుకు అంగీకరిస్తూ వారం రోజుల్లోగా తమకు లేఖ పంపాలని అందులో కోరారు. 

రూ.వేల కోట్ల పెట్టుబడులు..
బల్క్‌ డ్రగ్‌ పార్కుల ఏర్పాటును ప్రోత్సహించేందుకు 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద దేశంలో మూడు ప్రాంతాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌లను ఏర్పాటు చేస్తామని, అందుకోసం ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కాగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం 2020–23 ప్రకటించింది.

ఇందులో భాగంగా కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో రెండు వేల ఎకరాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రానున్న ఎనిమిదేళ్లలో పార్క్‌ ద్వారా రూ.46,400 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని, 10 వేల నుంచి 12 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. కేంద్రం ప్రకటించిన పథకం కింద బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు ప్రతిపాదన పంపాలని, ఒకవేళ ఆమోదించకుంటే సొంతంగా చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

తీవ్ర పోటీలో రాష్ట్రం విజయం..
కేంద్రం ప్రకటించిన పథకం కింద తొండంగి మండలం కేపీ పురం, కోదాడలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం 2020 అక్టోబర్‌ 15న ప్రతిపాదనలు పంపింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ను దక్కించుకునేందుకు మనతోపాటు తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు తీవ్రంగా పోటీ పడ్డాయి.

దేశంలో అత్యాధునిక ఫార్మా సిటీని విశాఖకు సమీపంలోని పరవాడ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఫార్మా వ్యర్థాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ అగ్రగామిగా నిలిపారు. ఈ రెండు అంశాలు రాష్ట్రంలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర వేయడంలో కీలక పాత్ర పోషించాయి.

ఫార్మాలో అగ్రగామిగా రాష్ట్రం..
కాకినాడ జిల్లాలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వం వేగంగా మౌలిక సదుపాయాలను కల్పించనుంది. తద్వారా భారీ పరిశ్రమలు ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. ఫార్మా రంగంలో పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేయడంతోపాటు చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట వద్ద ఎంఎస్‌ఎంఈ ఫార్మా పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అటు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌.. ఇటు ఎంఎస్‌ఎంఈ ఫార్మా పార్క్‌ల ద్వారా ఫార్మా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలుస్తుందని పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement