సాక్షి, తాడేపల్లి: దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులలో దక్షిణ భారతావనిలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అగ్రగణ్యులని, అలాంటి మహానీయుడి జీవిత విశేషాలు భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందని బ్రహ్మణ సంఘాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశాయి.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైఎస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఆయన్ని కలిశారు.

ఆ మహానీయుడి జీవిత విశేషాలు భావితరాల వారికి తెలియజేసేలా రాజధానిలోఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట స్మృతివనం, అలాగే అసెంబ్లీ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయించేలా చూడాలని వైఎస్ జగన్‌కు బ్రహ్మణ సంఘం వినతిపత్రం అందజేసింది. ఆ విజ్ఞప్తిని తప్పక పరిశీలించి, అధికారంలోకి రాగానే తప్పనిసరిగా ఏర్పాటుచేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో బ్రహ్మణ సంఘం ధన్యవాదాలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జ్వాలాపురం శ్రీకాంత్, ద్రోణంరాజు శ్రీవాత్సవ, రాంపల్లి రవిచంద్ర, పురుషోత్తమ శర్మ, ఈ క్రిష్ణమాచారి, సీహెచ్ శ్రీనివాసరావు, కే వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


