
దళిత కుటుంబంపై బ్రహ్మసముద్రం ఎస్‌ఐ దాష్టీకం
బ్రహ్మసముద్రం: న్యాయం చేయమని వచ్చిన తమను ఎస్‌ఐ నానా బూతులు తిట్టడమే కాకుండా పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టారని ఓ దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధితులు తెలిపిన మేరకు.. బ్రహ్మసముద్రం మండలం బొబ్బర్లపల్లికి చెందిన మారెన్న కుమార్తె పొలంలోని వేరుశనగ పంటను ఆదివారం కొందరు గొర్రెలతో మేపారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు బ్రహ్మ సముద్రం పోలీసుస్టేషన్‌కు వెళ్లగా.. ఎస్‌ఐ నరేంద్రకుమార్ న్యాయం చేస్తామని చెప్పి ఆమెను వెనక్కి పంపారు.
సోమవారం ఆమె మళ్లీ తన భర్తతో పాటు తండ్రి మారెన్నతో కలిసి పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే వారిపై ఎస్‌ఐ నరేంద్ర కుమార్ రెచ్చిపోయారు. తప్పుడు కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నానా బూతులు తిట్టారు. న్యాయం చేయాలని కోరితే ఇలా మాట్లాడడం తగదని మారెన్న అనగా.. ఎస్‌ఐ మరింత రెచ్చిపోయారు. నువ్వెవరు తప్పుడు నా కొ.. అంటూ దాష్టీకం ప్రదర్శించారు. మారెన్నతో పాటు ఆయన కుమార్తె, ఆమె భర్తను స్టేషన్‌లో కూర్చోబెట్టారు. పెద్ద మనిషిగా వచ్చిన తనను ఎందుకు కూర్చోమంటున్నారని మారెన్న అంటే..
అన్నీ నీకు చెప్పాలా అంటూ తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ సాయంత్రమైనా ఎస్‌ఐ తిరిగి రాకపోవడంతో బాధిత దళిత కుటుంబం పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపింది. దళితులమైన తమ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన ఎస్‌ఐపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మారెన్న కోరుతున్నారు.