మెడికల్‌ కాలేజీపై ‘ముఖ్య’ నేత కన్ను! | Bigg Boss eyeing valuable properties in the state | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీపై ‘ముఖ్య’ నేత కన్ను!

Apr 4 2026 4:47 AM | Updated on Apr 4 2026 4:47 AM

Bigg Boss eyeing valuable properties in the state

రాజధాని ప్రాంతంలో రూ.2 వేల కోట్లకుపైగా విలువైన ఎన్‌ఆర్‌ఐ కాలేజీ, ఆస్పత్రిని కుటుంబపరం చేసేందుకు యత్నాలు  

అధికార బలంతో యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి, బెదిరింపులు 

ఈ నెల 5న జనరల్‌ బాడీ భేటీలో డైరెక్టర్ల ఎన్నికకు నోటీసులు 

తమకు అనుకూలమైన వారిని నియమించుకునేలా మంత్రాంగం 

ఆ వెంటనే కాలేజీని సొంతం చేసుకునేందుకు ఎత్తుగడ 

తొలుత రూ.250 కోట్ల కార్పస్‌ ఫండ్‌ను కొల్లగొట్టేందుకు ప్రణాళిక 

చక్రం తిప్పుతున్న ముఖ్య నేత బినామీ పారిశ్రామికవేత్త 

తోడుగా రాజధాని వ్యవహారాలు చూస్తున్న మంత్రి  

వారికి అన్ని విధాలుగా సహకరిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ  

రాష్ట్రంలో విలువైన ఆస్తులపై కన్నేసిన బిగ్‌బాస్‌   

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ముఖ్య’నేత కుటుంబ దోపిడీ పరంపర యథేచ్ఛగా కొనసాగుతోంది! అమరావతిని కామధేనువులా మార్చుకుని కేవలం రోడ్లు, మౌలిక సదుపాయాల కోసమే రూ.2 లక్షల కోట్లు ధారపోసి మొబిలైజేషన్‌ అడ్వాన్సుల రూపంలో తిరిగి వసూలు చేసుకుంటున్నా ఆశ తీరడం లేదు..! ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్‌ లాంటి ప్రకృతి వనరులను కొల్లగొడుతూ మైనింగ్‌ దోపిడీకి తెర తీశారు. 

మొన్న.. విశాఖ నడిబొడ్డున ముఖ్య నేత బంధువులకు రూ.5 వేల కోట్ల విలువైన భూముల పందేరం..! నిన్న.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ ముసుగులో కుటుంబ సంస్థకు రాయితీల రూపంలో దాదాపు రూ.వంద కోట్లు సంతర్పణ..! నేడు.. రాజధాని ప్రాంతంలో రూ.వేల కోట్ల విలువైన మెడికల్‌ కాలేజీపై కన్ను..! అధికారం అండతో కుటుంబం కోసం ముఖ్యనేత సాగిస్తున్న దోపిడీ పర్వం ఇలా ఉంది..!

రంగంలోకి ఆ ముగ్గురు..
పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించాలనే ఉదాత్త ఆశయంతో మూడు దశాబ్దాల క్రితం మంగళగిరిలో ఏర్పాటైన ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీపై ముఖ్య నేత కన్ను పడింది. రాజధాని ప్రాంతంలో ఉన్న అత్యంత విలువైన ఆ కాలేజీని ఎలాగైనా సరే సొంతం చేసుకునేందుకు తెర వెనుక విస్తుగొలిపే రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన బినామీలను రంగంలోకి దించి అధికార బలంతో వ్యవహారాలను చక్కబెట్టేందుకు చక్రం తిప్పుతున్నారు. 

మెడికల్‌ కాలేజీని ముఖ్య నేత పరం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో జాతీయ రహదారికి ఆనుకుని 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ కాలేజీకి చుట్టుపక్కల కూడా మరికొన్ని విలువైన భూములున్నాయి. అవన్నీ కలిపితే దాని ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విలువైన కాలేజీ ఆస్తులను చేజిక్కించుకునేందుకు ముఖ్య నేత స్కెచ్‌ వేశారు. 

ఎన్‌ఆర్‌ఐ కాలేజీ యాజమాన్యంలోని రెండు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే నెపంతో రంగంలోకి దిగిన ముఖ్య నేత బినామీలు ఏకంగా కాలేజీనే బిగ్‌బాస్‌ పరం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గుడిని, గుడిలో ‘లింగా’న్ని కూడా మింగేసే ఓ పారిశ్రామికవేత్తతోపాటు ఎన్‌ఆర్‌ఐ కాలేజీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు దీని వెనుక ఉన్నట్లు తెలిసింది. రాజధాని వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరించే మంత్రి కూడా వారికి తోడైనట్లు సమాచారం. 

ఇటీవల ముఖ్య నేతతో సంబంధాలు సన్నగిల్లడంతో ఈ డీల్‌ కుదర్చడం ద్వారా ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఈ మంత్రి తాపత్రయపడుతున్నారు. ముఖ్య నేతకు రాజధానిలో అత్యంత విలువైన ఆస్తిని సమకూర్చిపెట్టడం ద్వారా తాము మరింత లబ్ధి పొందేందుకు ఈ ముగ్గురూ ఈ డీల్‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం యాజమాన్యంపై సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు.

త్వరలో ముఖ్య నేత ట్రస్టు చేతుల్లోకి.. 
త్వరలో దీనిపై ఒప్పందం చేసుకుని కోర్టు వ్యవహారాలను క్లియర్‌ చేసేందుకు మంతనాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ను అధికారికంగా ముఖ్య నేత పార్టీ ట్రస్టు పేరు మీదకు బదలాయించాలని యత్నిస్తున్నారు. లాంఛనాలు పూర్తయి సంస్థ మొత్తం పూర్తిగా తమ చేతుల్లోకి వచ్చాక హైదరాబాద్‌లోని ట్రస్టు ద్వారా నడిపిస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రి తరహాలో ఎన్‌ఆర్‌ఐ కాలేజీ, ఆస్పత్రిని నిర్వహించేందుకు ముఖ్య నేత పథకం సిద్ధం చేసినట్లు సమాచారం.

న్యాయ వివాదాలు..
2003లో కృష్ణా, గుంటూరుకు చెందిన పలువురు ఎన్‌ఆర్‌ఐ వైద్యులు తమ ప్రాంతంలో పేదలకు మంచి వైద్యం, వైద్య విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మంగళగిరి ప్రాంతంలో 50 ఎకరాలు కొనుగోలు చేసి ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ సైన్సెస్‌ను స్థాపించారు. మేనేజ్‌మెంట్‌ కమిటీని ఏర్పాటు చేసి ఛైర్మన్‌ ముక్కామల అప్పారావుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పారావుకు వ్యతిరేకంగా ఉన్న నిమ్మగడ్డ ఉపేంద్ర వర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న టీడీపీ నేత ఒకరు మద్దతు పలికి కాలేజీ వ్యవహారాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు యత్నించారు. 

ఈ క్రమంలో 2021లో ముక్కామల అప్పారావు కాలేజీని మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీకి విక్రయించారు. దీనిపై రెండు గ్రూపులు పరస్పరం కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కాయి. దీంతో మేనేజ్‌మెంట్‌ కమిటీ స్థానంలో ఒక రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారికి కోర్టు తాత్కాలికంగా కాలేజీ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఆర్బిట్రేషన్‌కు పంపగా నిజమైన సభ్యులు ఎవరో ఏప్రిల్‌ 30వ తేదీలోగా తేల్చాలని ఆర్బిట్రేషన్‌ జడ్జి తీర్పు ఇచ్చారు.

5న జనరల్‌బాడీ సమావేశం.. 
రూ.250 కోట్ల కార్పస్‌ ఫండ్‌పై ముఖ్యనేత కన్ను
ఈ నెల 5వ తేదీన ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీ మేనేజ్‌మెంట్‌ జనరల్‌బాడీ సమావేశం జరగనుంది. అందులో 30 మంది ఉండగా సగం మంది ముఖ్య నేత బినామీలకు అనుకూలంగా మారిపోయినట్లు తెలిసింది. మిగిలిన 15 మంది వ్యతిరేకంగా ఉండడంతో వారిపై తీవ్ర స్థాయిలో అధికార బలం ప్రయోగిస్తున్నట్లు తెలిసింది. ఎలాగైనా వారిని లొంగదీసుకునేందుకు భారీ లాబీయింగ్, ప్రలోభాలు, బెదిరింపుల పర్వం సాగుతోంది. 

రాజధాని వ్యవహారాలు పర్యవేక్షించే ఒక మంత్రి శుక్రవారం ముక్కామల అప్పారావు ఇంటికెళ్లి ఆయనతో మంతనాలు జరిపారు. ఎలాగైనా సరే వ్యతిరేకంగా ఉన్న వారిని బుజ్జగించి ముఖ్య నేతకు కాలేజీని బహుమానంగా ఇవ్వాలని బినామీ పారిశ్రామికవేత్త తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 5వ తేదీన జరిగే జనరల్‌ బాడీ సమావేశంలో డైరెక్టర్లను ఎన్నుకునేందుకు సభ్యులుగా ఉన్న 30 మందికి  నోటీసులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఈనెల 30వ తేదీలోపు డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. 

నెలాఖరులోపు బోర్డు ఏర్పాటు కానుండడంతో డైరెక్టర్లుగా తమకు అనుకూలమైన వారు ఉండేలా చూడడం, ఆ తర్వాత వెంటనే కాలేజీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలేజీ స్థలం విలువైనది కావడంతోపాటు దాని పేరు మీద రూ.250 కోట్ల వరకూ కార్పస్‌ ఉండడంతో వెంటనే ఆ సొమ్మును నొక్కేయవచ్చని ముఖ్య నేత భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని అత్యంత విలువైన వేలాది ఎకరాల భూములను ముఖ్య నేత తన బినామీల ద్వారా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ సైన్సెస్‌పై కన్నేసినట్లు స్పష్టమవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement