
కూటమి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తుల సేవ మరిచి, వ్యాపారుల సేవలో మునిగిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... అద్దె చెల్లించకుండా రూ.2 కోట్ల బకాయిలు పడ్డ సన్నిధానం క్యాంటీన్ ను ముఖ్యమంత్రి కార్యాయల ఆదేశాలతో ఆగమేఘాల మీద తిరిగి ఓపెన్ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.
సాక్షి, తిరుపతి: తిరుమలలో వ్యాపారుల సేవలో పాలకమండలి తరిస్తోంది. టీటీడీని చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాపారమయంగా మార్చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. నిబంధనలకు విరుద్దంగా 201 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే.. టీటీడీ కంటి తుడుపు చర్యలు తీసుకుందని అన్నారాయన.
● అద్దె బకాయిలు - అయినా అడ్డగోలు ఉత్తర్వులు
నిబంధనల ప్రకారం అద్దె చెల్లించక పోవడంతో టీటీడీ రెవెన్యూ అధికారులు సన్నిధానం క్యాంటీన్ ను 21-12-2024న మూసివేశారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని 30-12-2024 నాడు సన్నిధానం క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించడంతో పాటు రెగ్యులరైజేషన్ చేయాలని ఉత్తర్యులు జారీ చేసింది. వాస్తవానికి టీటీడీ ఇచ్చిన నోటీసులు ప్రకారం సన్నిధానం క్యాంటీన్ నిర్వాహకులు 26-05-2025 నాటికి రూ.2,85,7,106 నగదు చెల్లించాలి. అందులో నిర్వాహకులు నాలుగు దఫాలుగా కేవలం రూ.1,00,24,400 మాత్రమే చెల్లించారు. అయినా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో టీటీడీ వారికి తలుపులు బార్లా తెరిచి సేవ చేసింది.
మరోవైపు క్యాంటీన్ నిర్వాహకులు 201 చదరపు మీటర్ల స్ధలాన్ని నిబంధనలకు విరుద్దంగా ఆక్రమించారు. దీనిపై అధికారులు తనిఖీ చేసి నివేదిక కూడా ఇచ్చారు. మరోవైపు 16-09-2024 నాడు టీటీడీ ఎగ్జిక్యూటవ్ ఇంజనీర్ కూడా వీళ్ల ఆక్రమణపై లేఖ రాస్తూ... క్యాంటీన్ నిర్వాహకులు ఆక్రమించిన స్ధలంలో కట్టడాలు చేపట్టిన మాట వాస్తవమే, మేం తనిఖీలు చేసినప్పుడు నిర్మాణం ఆపి మరలా ప్రారంభించారు అని కూడా రిపోర్ట్ ఇచ్చారు. టీటీడీ లైసెన్స్ నిబంధనలు ప్రకారం రెంట్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఆఖరు నెల రెంట్ కట్టకపోతే క్యాంటీన్ మూసివేయాలి. ఈ నిబంధన టీటీడీ ప్రొసీడింగ్స్ లో ఉన్న సన్నిధానం క్యాంటీన్ పట్ల టీటీడీకి ఎందుకింత ప్రేమ ?
● ప్రభుత్వ పెద్దల ఒత్తిడి- తప్పుడు నివేదిక..
నిబంధనలు పాటించని క్యాంటీన్‌ను మూసివేసి రెంట్ బకాయిలు ఉన్నారని తెలిసినా మరలా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు. ఒకవైపు దేవస్థానం భూమి ఆక్రమణలు చేయడమే కాకుండా ఆ స్ధలంలో 15 పెద్ద చెట్లను కూడా తొలగించారు. సన్నిధానం క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాగానే అటవీశాఖ అధికారులు కూడా అక్కడ కేవలం నాలుగు అకేషియా చెట్లను మాత్రమే తొలగించారని తప్పుడు నివేదిక ఇచ్చారు.

నిజానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేఖ రాగానే జనవరిలోనే క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించగా.. టీటీడీ అధికారులు మాత్రం ఏప్రిల్ 1, 2025న రీఓపెన్ చేసినట్లు రాసుకున్నారు. ఆ మూడు నెలల కరెంటు బిల్లులు తనిఖీ చేస్తే వాస్తవాలు కచ్చితంగా బయటపడతాయి. మరోవైపు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, సన్నిధానం క్యాంటీన్ నిర్వాహకులకు కేవలం నెలకు రూ.50వేలు ఫీజు నిర్ణయించింది. అంటే టీటీడీ స్థలాలను ఎవరైనా ఆక్రమించుకుంటే... ఇలా ఫైన్లు వేసి వదిలేస్తే తిరుమలలో ఇంచు స్థలం కూడా మిగలదు.
ఒక వ్యాపార సంస్థ 201 చదరపు మీటర్ల స్థలం ఆక్రమిస్తే... దాన్ని రెగ్యులరైజ్ చేయమని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం. అక్కడితో ఆగకుండా... టీటీడీ పాలకమండలి చైర్మన్ బీ ఆర్ నాయుడు దాదాపు రూ.2 కోట్ల అద్దె కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు క్యాంటీన్ జనవరి నుంచి నడిచినా కూడా రన్ చేయలేదని చూపిస్తూ... 3 నెలల అద్దెను మినహాయించడం దారుణం. భక్తులకు సేవ చేయాల్సిన చైర్మన్, టీటీడీ బోర్డు ఇలా క్యాంటీన్ నిర్వాహకుల సేవలో మునిగిపోవడం దుర్మార్గం. దీనిపై కచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి.. ఇలాంటి అక్రమాలపై కచ్చితంగా పోరాటం చేస్తామని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.