శిరీష సాహసం గర్వకారణం 

Bandla Shirisha's Grandfather Wishes Her A Happy Return From Space - Sakshi

సాక్షి, తెనాలి: ‘తాతా...డోంట్‌ ఫియర్‌...సక్సెస్‌ఫుల్‌గా తిరిగొస్తాను’ ..అని చెప్పిన మనుమరాలు అంతరిక్ష యానం పూర్తిచేసుకొని విజయవంతంగా తిరిగి రావటం ఎన లేని సంతోషాన్ని కలిగిస్తోందని రోదసీ యాత్ర చేసిన తొలి తెలుగమ్మాయిగా రికార్డు సృష్టించిన బండ్ల శిరీష తాతయ్య రాపర్ల వెంకట నరసయ్య అన్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌పోర్టు నుంచి సాగిన అంతరిక్షయాత్ర ప్రత్యక్ష ప్రసారాన్ని తోటి బంధువులతో కలిసి వీక్షించిన దగ్గర్నుంచీ, వెంకటనరసయ్య దంపతుల ఆనందానికి హద్దే లేకుండాపోయింది. మరుసటి రోజంతానూ బంధువులు, మిత్రులు, సన్నిహితుల అభినందనలు అందుకుంటూనే ఉన్నారు. సాయంత్రం తనను కలిసిన విలేకరులతో ఆ ఆనందాన్ని పంచుకున్నారు.

ఈనెల ఆరో తేదీన మనుమరాలు శిరీష తనతో ఫోనులో మాట్లాడి, తమకు ధైర్యం చెప్పిన మాటల్ని గుర్తుచేసుకున్నారు. నాలుగేళ్లవరకు తన దగ్గర పెరిగిన శిరీష 1992లో అమ్మానాన్నతో కలిసి అమెరికా వెళ్లిందన్నారు. తిరిగి తొమ్మిదేళ్ల వయసులో 1997లో తెనాలి వచ్చినపుడు పైలట్‌ కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయటమే కాదు...‘నేను పైలెట్‌నై మిమ్మల్నిద్దర్నీ అమెరికా తీసుకెళతాను తాతయ్యా’ అని చెప్పిందన్నారు. కంటిచూపు కారణంగా అవకాశం మిస్సయినా, తగిన చదువులు చదివి, ప్రైవేటు రంగంలో అవకాశాలను  అందిపుచ్చుకుని ఈ స్థాయికి చేరుకుందన్నారు.

2016లో తమ 50వ వివాహ వార్షికోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిందనీ, మళ్లీ 2019లో వచ్చినపుడు తనకు కాబోయే భర్తను శిరీష పరిచయం చేసినట్టు వివరించారు. అంతరిక్ష యాత్ర ముగిశాక తన కుమార్తె, అల్లుడుతో మాట్లాడానని చెప్పారు. శిరీషతో మాట్లాడేందుకు వీలుపడలేదన్నారు. ఏదేమైనా స్త్రీలు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరనీ తన మనుమరాలు సాహసయాత్రతో చాటటం గర్వకారణంగా ఉందన్నారు. తన లక్ష్యాన్ని సాకారం చేసుకున్న తీరు, సాధించిన వైనం యువతకు స్ఫూర్తి కాగలదన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top