వైఎస్సార్ కడప జిల్లా లింగాలలో పక్వానికి వచ్చిన అరటి పంటను తోటలోనే వదిలేసిన వైనం
ధర కాస్త పెరిగితే తన గొప్పతనం.. దిగజారితే ఆదుకోకుండా పరార్
రైతుల నుంచి కొనేందుకు ముందుకు రాని వ్యాపారులు
పక్వానికి వచ్చిన గెలలను తోటల్లోనే వదిలేస్తున్న అన్నదాతలు
అరటి సాగుదారులు గతేడాది మాదిరిగానే తీవ్ర నష్టాలపాలై విలవిల
ప్రస్తుతం టన్ను నాలుగైదువేలకు మించి పలకని దుస్థితి
వైఎస్ జగన్ హయాంలో విదేశాలకు 3 లక్షల టన్నులకు పైగా ఎగుమతి
తాడిపత్రి నుంచి ముంబైకి కిసాన్ రైళ్లు నడిపి అరటి సాగుదారులకు ప్రోత్సాహం
2023–24లో రికార్డు స్థాయిలో టన్ను అరటి ఏకంగా రూ.32 వేలకు పైగా ధర
అరటి సాగు, దిగుబడులు, ఎగుమతుల్లో ఏపీ ప్రగతికి గుర్తింపుగా పలు అవార్డులు
‘అరటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. రాయలసీమ అరటిని ముంబై, కోల్‌కత్తా లాంటి జాతీయ మార్కెట్లకు తరలించేందుకు లాజిస్టిక్స్ ప్లాన్ సమర్ధంగా అమలు చేశాం. రైల్వే వ్యాగన్ల ద్వారా రవాణా చేయడంవల్ల రైతులకు గరిష్ట ధరలు లభిస్తున్నాయి. అన్నదాతకు గిట్టుబాటు ధర దక్కేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం..’ – సీఎం చంద్రబాబు
‘హ్యాపీ ఫార్మర్ – హ్యాపీ ఏపీ..’ గత ప్రభుత్వ పాలనలో నష్టపోయిన అరటి రైతులకు మన కూటమి ప్రభుత్వంలో మంచి రోజులు వచ్చాయి. మార్కెట్ పరిస్థితులను గాడిలో పెట్టడం వల్ల క్వింటాల్‌కు రికార్డు స్థాయిలో ధరలు లభిస్తున్నాయి. రైతు ముఖంలో చిరునవ్వు చూడటమే మా ధ్యేయం. గతేడాది నష్టాల నుంచి అన్నదాతలను బయటపడేశాం..’ – మంత్రి నారా లోకేశ్
సాక్షి, అమరావతి: ధరలు కొద్దిగా పెరిగితే చాలు.. ‘మా చొరవతోనే రైతుకు భారీ ధరలు‘ అంటూ ప్రకటనలతో ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం అరటి ధరలు మరోసారి పాతాళానికి దిగజారిపోతున్నా చేష్టలుడిగి చూస్తున్నారు. ధరలు పెరిగినప్పుడు అంతా తమ గొప్పతనం అంటూ ఊదరగొడుతూ.. రేట్లు పతనమైతే ప్రకృతి వైపరీత్యం.. అంటూ వారిని గాలికొదిలేస్తుండడం గమనార్హం.
కోతకొచ్చాక కొనేవారు లేక..
రాష్ట్రంలో 2.77 లక్షల ఎకరాల్లో అరటి సాగవుతోంది. వైఎస్సార్ కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోనే లక్ష ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ఇక్కడ జీ–9 వెరైటీ సాగవుతుంది. ఇదంతా పూర్తిగా ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ. గతంలో ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు కాగా పెరిగిన ఎరువులు, పురుగు మందులు ధరలు, కూలీ, రవాణా ఖర్చులతో ప్రస్తుతం రూ.1.20 లక్షల నుంచి రూ.1.80 లక్షలు వరకు వ్యయం అవుతోందని అరటి రైతులు చెబుతున్నారు.
దాదాపు 70 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వస్తుండగా 53 శాతం రాయలసీమ జిల్లాల నుంచే వస్తోంది. అనంతపురం, నంద్యాల జిల్లాలలో టిష్యూ కల్చర్ ద్వారా నాటిన మొదటి పంట దిగుబడులు డిసెంబర్ నుంచి మార్చి వరకు వస్తుండగా, వైఎస్సార్ కడపలో జనవరి నుంచి మే వరకు దిగుబడులు వస్తాయి. రెండో పంటగా పిలకల ద్వారా సాగైన అరటి జూలై నుంచి డిసెంబర్ వరకు వస్తుంది.
2023–24లో టన్ను రూ.30 వేలకు పైగా పలికిన అరటి గతేడాది రూ.వెయ్యికి దిగజారడంతో అరటి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. ప్రస్తుతం టన్ను నాలుగైదు వేలకు మించి పలకని దుస్థితి నెలకొంది. ధర లేక, కొనేవారు లేక పంటను కొంతమంది రైతులు మేకలు, పశువుల మేతకు వదిలేస్తుంటే.. మరికొందరు తోటల్లోనే వదిలేస్తున్నారు. ఇంకొందరైతే కూలీ ఖర్చులు కూడా దక్కడం లేదన్న ఆవేదనతో తోటలను దున్నేస్తున్నారు.

ధరల స్థిరీకరణ నిధి ఊసే లేదు..
అరటి ధర ఒకటి రెండు రూపాయలు పెరిగినప్పుడు.. విదేశాలకు పంపిస్తున్నాం.. రైతులను రాజులుగా చేస్తున్నాం.. అంటూ ట్వీట్లు వేసే ముఖ్యమంత్రి, మంత్రుల బృందం ధరలు పతనమై రైతులు రోడ్డున పడితే ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి గాలికిఎగిరిపోయింది. అరటి సహా మొక్కజొన్న, జొన్న, సజ్జలు ధరలు పతనమైనా మార్కెట్‌లో జోక్యం చేసుకుని పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి వ్యాపారుల మధ్య పోటీ పెంచాలన్న ఆలోచన ప్రభుత్వం చేయడం లేదు.
కనీసం మద్దతు ధరకు కొనుగోలు చేసి మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలు, అంగన్‌వాడీలకు సరఫరాచేస్తే రైతులు కొంత మేర గట్టెక్కుతారనే స్పృహ లేకుండా పోయింది. ప్రభుత్వ పెద్దలు ట్వీట్‌లు, స్టేట్‌మెంట్లతో కాలక్షేపం చేయకుండా తక్షణమే మార్కెట్‌లో జోక్యం చేసుకొని టన్ను కనీసం రూ.15 వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వైఎస్ జగన్ హయాంలో అరటికి మహర్దశ
వైఎస్ జగన్ హయాంలో దేశంలోఎక్కడా లేని విధంగా అరటికి ప్రత్యేకంగా మద్దతు ధర ప్రకటించడమే కాదు.. ఏటా పంట మార్కెట్‌కు వచ్చే ముందే ధరలను పర్యవేక్షిస్తూ ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్‌లో జోక్యం చేసుకొని రైతులకు అండగా నిలిచారు. ఇలా దాదాపు 12వేల టన్నులకు పైగా అరటిని కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విదేశాలకు ఎగుమతి కోసం తాడిపత్రి నుంచి ముంబైకి ఏటా కిసాన్ రైళ్లు నడిపి ఎగుమతులను ప్రోత్సహించారు.
2014–19మధ్య చంద్రబాబు హయాంలో 23 వేల టన్నుల అరటి ఎగుమతులు జరిగితే.. వైఎస్ జగన్ హయాంలో 2019–24 మధ్య ఏకంగా 3 లక్షల టన్నులకు పైగా సౌదీ అరేబియా, కువైట్, కతార్, బహ్రెయిన్, యూఏఈ, యూరోపియన్ దేశాలతో పాటు అమెరికాకు సైతం ఎగుమతి కావడం గమనార్హం. 2018–19లో టన్ను రూ.5 వేలకు మించని ధర 2023–24లో రికార్డు స్థాయిలో ఏకంగా రూ.32 వేలకు పైగా పలికింది.
వైఎస్సార్ సీపీ హయాంలో అరటి సాగు, దిగుబడులు, ఎగుమతుల్లో ఏపీ సాధించిన ప్రగతిని గుర్తిస్తూ బనానా ఎక్స్‌పోర్టు ప్రమోషన్ అవార్డు–2020, ద బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డ్స్– 2022 లాంటి పలు పురస్కారాలు రాష్ట్రానికి లభించడం అరటి రైతుల పట్ల వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రభుత్వం స్పందించడం లేదు..
ఐదెకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టా. గతేడాది వడగండ్ల వాన, ఈదురు గాలులతో పంట తుడిచి పెట్టుకుపోయింది. ఈ ఏడాది పంట కోతకొచ్చినా కొనేవారు లేరు. స్థానిక మార్కెట్‌లో టన్ను రూ.5 వేలకు మించి పలకడం లేదు. అయినకాడికి తెగనమ్ముకుందామనుకున్నా కొనేవారు లేరు. ప్రభుత్వం స్పందించడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – బాబా హుస్సేన్, అరటి రైతు, మురారి చింతల, వైఎస్సార్ జిల్లా
పతనమైనా పట్టించుకోరేమి?
అరటి ధరలు పెరిగినప్పుడు మావల్లే అని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ధరలు పతనమైతే కన్నెత్తి చూడడం లేదు. ధరలు పతనమైనా పట్టించుకోరేమి? 4 ఎకరాల్లో అరటి వేశా. ప్రస్తుతం పంట పక్వానికి వచ్చింది. వ్యాపారుల చుట్టూ రోజూ ప్రదక్షిణ చేస్తున్నా కొనే నాధుడు కరువయ్యాడు. ప్రభుత్వం ఆదుకోకపోతే వరుసగా రెండో ఏడాది కూడా అరటి రైతులకు నష్టాలు తప్పవు. – భాస్కరరెడ్డి, అంకేవానిపల్లె, వైఎస్సార్ జిల్లా
పైసా పరిహారం రాలేదు..
అరటి రైతులు రెండేళ్లుగా తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. గతేడాది గాలివాన, వర్షాలకు పంట తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం నుంచి పైసా పరిహారం రాలేదు. మరొక వైపు ధరలు పతనమైనా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ఏడాది పంట కోత దశలో ఉన్నప్పుడు ధరలు దిగజారిపోయాయి . చిన్నపాటి గాలి వాన వస్తే పక్వానికి వచ్చిన పంట తుడిచిపెట్టుకుపోతుంది. గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. –నాగార్జునరెడ్డి, లింగాల, వైఎస్సార్ జిల్లా


