ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం

Avanthi Srinivasa Rao Comments On Githam University Land Scam - Sakshi

విద్యాసంస్థలుంటే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోవచ్చా!

గీతం వర్సిటీలో ఒక్క పేద విద్యార్థినైనా ఉచితంగా చదివించారా!

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

సాక్షి, విశాఖపట్నం:  భూ ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. విశాఖలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గీతం యూనివర్సిటీ, టీడీపీ నేతలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఎటువంటి కక్షలు లేవన్నారు. విద్యాసంస్థలు ఉన్నవారు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నా ప్రభుత్వం వాటి జోలికి వెళ్లకూడదని టీడీపీకి చెందిన మాజీ మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తమకూ విద్యాసంస్థలు ఉన్నాయని.. అంతమాత్రాన తాము ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్నామా అని మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, తెల్లవారుజామున వచ్చి కూల్చివేశారని గీతం యాజమాన్యానికి చెందిన వ్యక్తులు, టీడీపీ నేతలు మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. గీతం యాజమాన్యానికి సంబంధించిన సర్వేయర్లు,  ప్రభుత్వం తరఫున రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు ఉమ్మడిగా, పూర్తిగా సర్వే చేసి గీతం కాలేజీ కాంపౌండ్‌ వాల్‌ పరిధిలో 22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు నోటిఫై చేశారన్నారు.

గీతం ఆధీనంలో మరో 18 ఎకరాలు కాంపౌండ్‌కు ఆనుకుని ఉందని, మొత్తం 40 ఎకరాల భూమి ఆక్రమించారని వివరించారు. 5 నెలల క్రితమే వారి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అవకాశముందనే విషయం వారికి తెలుసన్నారు. దీనిపై గీతం యాజమాన్యానికి పూర్తి  సమాచారం ఉందన్నారు. నోటీసులు కూడా ఇవ్వలేదని టీడీపీ నేతలు అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆక్రమించిన స్థలాన్ని తమకు కేటాయించాలని 2014లో గీతం యాజమాన్యం అప్పటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుందని, చంద్రబాబుకు భరత్‌పై, గీతం సంస్థలపై ప్రేమ ఉంటే గడచిన ఐదేళ్లలోనే రెగ్యులరైజ్‌ చేయాలి కదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడమే తప్పు. తప్పును సరిదిద్దుకోవడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనడం, ముందస్తు నోటీసు ఇవ్వలేదు అనడం సరికాదు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారెవరైనా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి అప్పగించాలి’ అన్నారు. 

ప్రభుత్వ భూముల పరిరక్షణకే.. 
ప్రభుత్వ విప్‌ ముత్యాలనాయుడు
కె.కోటపాడు: విశాఖలో గీతం యూనివర్సిటీ ఆక్రమణలో 40 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నట్టు ఆర్‌డీవో నివేదికలోనే వెల్లడైందని.. అందుకే ప్రభుత్వ యంత్రాంగం ఆక్రమణల తొలగింపునకు పూనుకుందని ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు చెప్పారు. కె.కోటపాడులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇటీవల విశాఖలో మాజీ ఎంపీ సబ్బం హరి అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు తొలగించినప్పుడు.. తొలుత అధికారులను ఆక్షేపించిన హరి మరుసటి రోజున తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు విలేకరుల సమావేశంలో పేర్కొన్న విషయాన్ని బూడి ప్రస్తావించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను రెవెన్యూ చట్టానికి లోబడి తొలగిస్తున్నట్టు చెప్పారు.

వ్యాక్సిన్‌ వచ్చాకే ఎన్నికలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పదవీ కాలం ముగిసే సమయం సమీపిస్తోందనే ‘స్థానిక’ ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి అన్నారు. కరోనా కాలంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం అంత మంచిది కాదని, వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళతామని చెప్పారు. కరోనా ప్రభావం లేనప్పుడు చంద్రబాబు మాటలు విని స్థానిక ఎన్నికలను కావాలనే ఆపి.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుకు మేలు చేయడం కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ఎన్నికల కమిషనర్‌కు మంత్రి హితవు పలికారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top