ఏయూ రంగస్థలానికి పూర్వవైభవం | Sakshi
Sakshi News home page

ఏయూ రంగస్థలానికి పూర్వవైభవం

Published Fri, Nov 24 2023 5:29 AM

AU stage was modernized and brought into use - Sakshi

విశాఖ (ఏయూ క్యాంపస్‌): ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ తన పేరును సార్థకం చేసుకుంటూ చిత్రకళలు, నాటక రంగం, సంగీతం, నృత్యం నుంచి నేటి సినీ సంగీతం వరకు ఎందరో ఉద్దండులను సమాజానికి అందించే బృహత్తర బాధ్యతను నిర్విరామంగా నిర్వహిస్తోంది. దశాబ్దాల క్రితం కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఆరుబయలు రంగస్థలం దాదాపు రెండున్నర దశాబ్దాలుగా నిరాదరణకు గురైంది. ప్రస్తుత వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి చొరవ తీసుకుని దీనిని పూర్తిస్థాయిలో ఆధునికీకరించి వినియోగంలోకి తెచ్చారు.  

1940లో పునాదిరాయి 
ఎస్కిన్‌ స్క్వేర్‌ పేరిట 1940లో అప్పటి మద్రాసు గవర్నర్‌ రూథర్‌ఫర్డ్‌ ప్రారంభించబడిన ఏయూ కళాప్రాంగణం ఘనమైన చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. ఇక్కడ ప్రదర్శించిన నాటకాలను వీక్షించేందుకు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు వంటి తెలుగు సినిమా అగ్ర కథానాయకులు వచ్చే­వారు. చాట్ల శ్రీరాములు, అబ్బూరి గోపాలకృష్ణ, దేవదాస్‌ కనకాల, సాక్షి రంగారావు, వంకాయల సత్యనారాయణ, మిశ్రో వంటి నాటక ప్రయోక్తలు, సినీ రంగ ప్రముఖులు ఈ వేదిక నుంచే గొప్ప కళాకారులుగా ఎదిగారు. అక్కినేని కథానాయకుడిగా 1961లో విడుదలైన కులగోత్రాలు చిత్రంలో సన్నివేశాలను ఇదే వేదికపై చిత్రీకరించారు.  

ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో.. 
ఇంతటి చారిత్రక ప్రాశస్త్యం కలిగి నాటక కళకు అంతులేని కీర్తిని సంపాదించిన కళావేదిక తరువాతి కా­లంలో తగిన ప్రోత్సాహం లేక మరుగునపడి శిథిలావస్థకు చేరింది. హుద్‌హుద్‌ తుపాను కారణంగా మ­రింత దెబ్బతింది. దాదాపు రెండున్నర దశాబ్దాలు­గా ఇది నిరుపయోగంగా మారింది. సీఎం వైఎస్‌ జగన్‌ఆర్ట్స్‌ కోర్సుల్లో అన్ని విభాగాలకు పూర్వవైభవం తీసుకురావాలని.. సంగీతం, నాటక రంగం, నృత్యం, చిత్రకళా విభాగాలను పూర్తిస్థాయి­లో అభివృద్ధి చేసి ప్రోత్సహించాలని సూచించా­రు. దీంతో ఈ రంగస్థలాన్ని పూర్తి స్థాయిలో విని­యోగంలోకి తీసుకువచ్చారు.

ఈ విషయంలో ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారు. రాష్ట్ర ప్రభు­త్వం నాడు–నేడు పథకంలో అందించిన నిధులతో యాంపి థియేటర్‌కు ఊపిరినిచ్చారు. నెక్కంటి సీ ఫుడ్స్‌ సంస్థ అందించిన నిధులతో బెంచీ­లు, ఫ్లోరింగ్‌ పనులు పూర్తిచేశారు. కోరమాండల్‌ పెయిం­ట్స్‌ సామాజిక బాధ్యతగా అందించిన నిధులతో ప్రాంగణానికి వర్ణాలద్ది కళావేదికను కళాత్మకంగా తీర్చిదిద్దారు.

రెండంతస్తుల బ్యాక్‌ స్టేజీతో రెండు గ్రీన్‌ రూమ్‌­లు, రంగస్థలంపై వర్షం, గాలివాన, నీలి ఆకాశం, సముద్రతీరం వంటి సన్నివేశాలను ప్రదర్శించడానికి వీలుగా సైక్లోరమా వ్యవస్థను తీర్చి­­దిద్దారు. రంగస్థల చారిత్రక, కళాప్రాశస్త్యాలు దెబ్బ­తినకుండా నేటి తరానికి ఉపయుక్తంగా సర్వ­హంగులతో సిద్ధం చేశారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, అక్కినేని సుశీల శుక్రవారం జరిగే కార్యక్రమంలో దీనిని ప్రారంభిస్తారు.

అరుదైన ఘట్టం 
దేశంలో మరే విశ్వవిద్యాలయానికి లేని అరుదైన సందర్భం ఈ వేదికపై ఆవిష్కృతమైంది. ముగ్గురు భారతరత్నలు ఇదే వేది­కను పంచుకున్నారు. నోబెల్‌ బహుమతి గ్రహీత, భారతరత్న సీవీ రామన్‌ ముఖ్య అతిథిగా ప్రసంగించగా.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఏయూ ఉపకులపతి హోదాలో సభకు అధ్యక్షత వహించారు. దేశం గర్వించే ఇంజినీర్‌ సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రేక్షకుడిగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఇంతటి అరుదైన, అపూర్వ ఘటన దేశంలోని  ఏ విశ్వవిద్యాలయ చరిత్రలోనూ జరగలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement