వ్యాక్సిన్: బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఆశా వర్కర్‌ మృతి

ASHA Worker Die After Covid Vaccination In Guntur - Sakshi

వ్యాక్సిన్‌ వికటించి చికిత్స పొందుతున్న ఆశా కార్యకర్త మృతి 

సాక్షి, నగరంపాలెం (గుంటూరు): కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం అస్వస్థతకు గురై.. బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఆశా కార్యకర్త ఆదివారం వేకువజామున మృతి చెందింది. గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఈ విషయం వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన బొక్కా విజయలక్ష్మి (42) ఆశా కార్యకర్తగా పీహెచ్‌సీలో పరిధిలో విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు భర్త సాంబశివరావు, కుమారులు సాయికుమార్, శరత్‌కుమార్‌ ఉన్నారు. ఈ నెల 20న విజయలక్ష్మి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకుంది. అనంతరం తలనొప్పి, వాంతులు, మూర్ఛ వంటి లక్షణాలతో స్పృహ కోల్పోయింది. చదవండి: (వికటించిన వ్యాక్సిన్‌.. ఆశ కార్యకర్త బ్రెయిన్‌ డెడ్‌!)

ఆమెను మెరుగైన వైద్యసేవల కోసం ఈ నెల 22న గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా.. ఆస్పత్రిలోని బ్రెయిన్‌ స్ట్రోక్‌ విభాగంలో ఉంచి వైద్యసేవలు అందించారు. ఆమె బ్రెయిన్‌ స్టెమ్‌ స్ట్రోక్‌కు గురికాగా, శనివారం రాత్రి బ్రెయిన్‌ డెడ్‌ అయి.. ఆదివారం వేకువజామున మృతి చెందింది. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ ప్రశాంతి, డీఎంహెచ్‌వో జె.యాస్మిన్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఎన్‌.ప్రభావతి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆశ కార్యకర్త విజయలక్ష్మి మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఎంతో సమర్థంగా విధులు నిర్వర్తించారని తెలిపారు. మృతురాలి కుటుంబం అర్హతను పరిశీలించి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు, ఆమె కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నష్ట పరిహారం కింద రూ.50 లక్షలు చెల్లించే విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. చదవండి: (వరంగల్‌: టీకా తీసుకున్న హెల్త్‌కేర్‌ వర్కర్‌ మృతి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top