మా మంచి వలంటీర్‌

Appreciation For Volunteer Services In Ananthapur - Sakshi

సేవలకు మెచ్చి సన్మానం

గుమ్మఘట్ట: పనిచేస్తే ఫలితం తప్పక దక్కుతుందనేందుకు అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం సిరిగేదొడ్డిలో సోమవారం జరిగిన సంఘటన నిదర్శనంగా ఉంది. నిరంతరం తమ అవసరాలు గమనిస్తూ తమకు సేవ చేస్తున్న వలంటీరును 50 ఇళ్ల ప్రజలు కలిసి సత్కరించారు. సిరిగేదొడ్డి గ్రామ సచివాలయ పరిధిలో భూతయ్యదొడ్డి క్లస్టర్‌–7 విభాగంలో నాయకుల రాజేష్‌ గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్నారు. తన పరిధిలోని 50 కుటుంబాలకు సేవలందించడమే లక్ష్యంగా పనిచేశారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూశారు. రోజూ ఇంటింటికీ తిరుగుతూ వారి కష్టసుఖాలు తెలుసుకునేవారు.

ఎవరికి ఏ సమస్య ఉన్నా తనదిగా భావించి పరిష్కారానికి చొరవ చూపేవారు. ఫలితంగా రాజేష్‌ను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుడిగా భావించారు. రాజేష్‌ వలంటీర్‌గా ఉద్యోగంలో చేరి సోమవారం నాటికి సంవత్సరం పూర్తికాగా ఆయన పరిధిలోని 50 కుటుంబాల వారు పార్టీలకు అతీతంగా సచివాలయం వద్దకు వచ్చి ఘనంగా సత్కరించారు. వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు, తోటి వలంటీర్లు అభినందనలు తెలిపి ప్రశంసించారు. ప్రతి వలంటీర్‌ రాజేష్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీడీవో శివరామ్‌ప్రసాద్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో సిరిగేదొడ్డి, భూతయ్యదొడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top