సాక్షి టెక్కలి విలేకరికి సీఐ, ఎస్‌ఐ బెదిరింపులు
సాక్షి టాస్క్ ఫోర్స్: సాక్షి పత్రికలో ప్రచురితమైన ఒక వార్తకు సంబంధించి స్టేషన్‌కు వచ్చి సమాధానం చెప్పాలంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి సాక్షి విలేకరిని సీఐ, ఎస్‌ఐ బెదిరించారు. ఎస్‌ఐ మరో అడుగు ముందుకేసి మరీ దురుసుగా మాట్లాడారు. తొలుత సాక్షి టెక్కలి విలేకరికి ఫోన్ చేసిన కోటబోమ్మాళి ఎస్‌ఐ వి.సత్యనారాయణ.. ఒకసారి స్టేషన్‌కు రా.. నీతో మాట్లాడాలి అన్నారు.
దేనికి సార్ అని విలేకరి అడగగా.. ‘తినేముందు రుచి చూడటమెందుకు.. ఎలాగో తింటావుగా..’ అన్నారు. దీంతో విలేకరి టెక్కలి రూరల్ సీఐ శ్రీనివాసరావుకు ఫోన్ చేయగా.. ‘ఈ రోజు యాక్సిడెంట్ ఐటమ్ ఎవరు రాశారు. మామూళ్ల మత్తులో పోలీసులు అనే విధంగా ఐటెమ్ రాశారు. మీకేమైనా ఎవిడెన్స్ ఉన్నాయా. కలెక్టర్ గారు కోటి రూపాయలు తీసుకున్నారని ఆరోపిస్తే మీరు రాసేస్తారా. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా. మీరు ఆన్సర్ చేస్తారా. మారి్నంగ్ స్టేషన్‌కు రండి..’ అంటూ హుకుం జారీచేశారు.
అసలు జరిగిందేమిటి?
కోటబోమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు గ్రామం సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిలో కోటబోమ్మాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డుపై లారీలు పార్కింగ్ చేయడం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై ‘సాక్షి’లో పలుమార్లు కథనాలు వచి్చనా హైవే పెట్రోలింగ్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అంశంపై సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపైనే అక్కడ ఎస్‌ఐ, సీఐ ఇలా ఫోన్‌చేసి స్టేషన్‌కు వచ్చి సమాధానం చెప్పాలంటూ హుకుం జారీచేశారు. ఇందులో ఎస్‌ఐ సత్యనారాయణ విలేకరితోనే అంత దురుసుగా మాట్లాడుతుంటే ఇక సామాన్యుడి పట్ల ఎలా వ్యవహరిస్తారో అనే సందేహం కలుగుతోంది.


