అన్ని ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టండి

విజయదశమి రోజున రాష్ట్రమంతా వికేంద్రీకరణకు ప్రార్థించాలి
మంత్రి వేణు, మాజీమంత్రి కన్నబాబు పిలుపు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): వికేంద్రీకరణను ఆకాంక్షిస్తూ రాష్ట్రంలో ప్రతిఒక్కరూ విజయదశమి రోజున కుల, మతాలకు అతీతంగా అన్ని ఆలయాల్లోను ప్రార్థించి కొబ్బరికాయలు కొట్టాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ఇంతకంటే మంచి రోజు మరొకటి రాదన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు.
చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు
ఏ రోజూ ప్రజల కోసం ఆలోచించని చంద్రబాబుకు సద్బుద్ధి వచ్చేటట్లు, వికేంద్రీకరణకు మద్దతిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కొబ్బరికాయలు కొట్టాలన్నారు. అమరావతి నుంచి అరసవిల్లి వరకు రైతుల ముసుగులో బూటకపు పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు బృందానికి ఆ దేవుడే సరైన బుద్ధి చెబుతారని వారన్నారు.
పాదయాత్రతో అరసవిల్లి వెళ్లే వారు సూర్యభగవానుడ్ని ఏమని కోరుకుంటారని.. అమరావతి మాత్రమే బాగుండాలని కోరుకుంటారా.. లేక, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారా.. అని వేణు, కన్నబాబు ప్రశ్నించారు. అందుకే పాదయాత్ర చేస్తూ అరసవల్లి వెళ్లే వారు ఏమి కోరుకున్నా సూర్యభగవానుడు మాత్రం మెజార్టీ ప్రజల అభీష్టమైన వికేంద్రీకరణకే ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు.