
ప్రస్తుతం ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ కడిమిశెట్టి సుశీల, వార్డు సభ్యులు
పిఠాపురం: స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే చాలు.. గ్రామాలు ఒకటే సందడిగా ఉంటాయి. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం ఏపీ మల్లవరం (ఆలవెల్లి పాత మల్లవరం) గ్రామంలో మాత్రం ఏ హడావుడీ ఉండదు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఆ గ్రామస్తులందరూ ఒకచోట సమావేశమవుతారు. వచ్చిన రిజర్వేషన్‌కు అనుకూలంగా ఒక వ్యక్తి పేరు సూచిస్తారు. అందరి ఆమోదంతో ఎన్నిక లేకుండా ఊరంతా ఏకగ్రీవంగా ఆ వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకుంటారు. ఆ పంచాయతీలో సర్పంచ్‌లు మారుతుంటారు. వారి పేర్లు మారతాయి. కానీ ఇంటిపేరు మాత్రం ఒకటే ఉంటుంది. అదే ‘కడిమిశెట్టి’. ఆ గ్రామంలో ఎవరిని కదిపినా కడిమిశెట్టి వారి ఇంటి పేరు మార్మోగుతుంది. గడచిన 11 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పది దఫాలు ఇక్కడ ఏకగ్రీవమే. ఒక్కసారి మాత్రమే ఎన్నిక జరిగింది.
ఏపీ మల్లవరం గ్రామం
పది దఫాల్లోనూ కడిమిశెట్టి వారి కుటుంబసభ్యులు ఐదుసార్లు సర్పంచ్‌లుగా.. అదీ ఏకగ్రీవం కావడం విశేషం. మిగిలిన ఎన్నికల్లో రిజర్వేషన్ల వలన ఇతరులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు తప్ప అవకాశం ఉంటే చాలు కడిమిశెట్టి వారికే పట్టం కడతామంటున్నారు ఆ గ్రామస్తులు. ఈ దఫా ఎన్నికల్లోనూ అక్కడ సర్పంచ్‌తోపాటు 10 మంది వార్డు సభ్యులను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామం 1965లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. తొలి సర్పంచ్‌గా గ్రామపెద్ద అయిన కడిమిశెట్టి అప్పారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం కడిమిశెట్టి బుల్లిరాజు, కడిమిశెట్టి పెదరాము, కడిమిశెట్టి వెంకటసత్యనారాయణస్వామి సర్పంచ్‌లయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో కడిమిశెట్టి సుశీలను సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆలవెల్లి ఎస్టేట్.. 3 పంచాయతీలు
గొల్లప్రోలు మండలంలో 1964కు ముందు ఆలవెల్లి ఎస్టేట్ ఒకే గ్రామంగా ఉండేది. ఈ గ్రామాన్ని ఏపీ మల్లవరం (ఆలవెల్లి పాత మల్లవరం), ఏకే మల్లవరం (ఆలవెల్లి కొత్త మల్లవరం), ఏ విజయనగరం (ఆలవెల్లి విజయనగరం) అనే మూడు గ్రామాలుగా విభజించారు. 1965 నుంచి ఈ మూడు గ్రామాలు పంచాయతీలుగా ఆవిర్భవించాయి.