ఏపీ: ఐటీకి ప్రోత్సాహం.. ఉద్యోగాలకు ఊతం | AP IT Policy Guidelines Issued By The IT Department | Sakshi
Sakshi News home page

ఏపీ: ఐటీకి ప్రోత్సాహం.. ఉద్యోగాలకు ఊతం

Jul 17 2021 9:20 AM | Updated on Jul 17 2021 9:20 AM

AP IT Policy Guidelines Issued By The IT Department - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19తో ఐటీ రంగంలో మారుతున్న పరిణామాలను అందిపుచ్చుకుంటూ ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు పెద్ద పీట వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఐటీ పాలసీ 20 21–24ను విడుదల చేసింది. ఇంటి నుంచే పనిచేసే విధానం (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) పెరుగుతున్న నేప థ్యంలో సొంతంగా ఐటీ ప్రాజెక్టులు చేసుకునే గిగ్‌ వర్కర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఐటీ పాలసీలో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏ ర్పాటు చేసే ఐటీ కంపెనీలకు ప్రత్యేక రాయితీలను ప్రవేశపెట్టారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఐటీ పాలసీ విధివిధానాలను రాష్ట్ర ఐటీ శాఖ ము ఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి శుక్రవారం విడుదల చే శారు. పాలసీలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్రంలో ఐటీ క్యాంపస్‌లు, ఐటీ పార్కులు నిర్మించే సంస్థలకు ఉద్యోగ కల్పన ఆధారంగా  పారదర్శకంగా భూములు కేటాయించే విధంగా పాలసీలో విధివిధానాలు రూపొందించారు. 
రాష్ట్రంలో ఏదైనా సంస్థ ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేయాలంటే ఆ సంస్థ కనీసం 10,000 మంది ఉద్యోగులను కలిగి ఉండటంతో పాటు వరుసగా మూడేళ్లపాటు రూ.500 కోట్లకు పైగా వ్యాపారాన్ని చేస్తూ ఉండాలి. అదే విదేశీ కంపెనీ అయితే ఫార్చ్యున్‌ 1,000 కంపెనీ అయ్యి ఉండాలి.
ఐటీ పార్కుల్లో కనీసం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అభివృద్ధి చేసే సంస్థలకే అనుమతిస్తారు. అలాగే ఐటీ పార్కులు నిర్మించే సంస్థలు గత మూడేళ్లుగా రూ.25 కోట్లకు పైగా వ్యాపారాన్ని చేస్తూ ఉండాలి. భూమి కేటాయించిన ఆరేళ్లలోపు ప్రతి ఎకరానికి కనీసం 500 ఉద్యోగాలు కల్పించాలి. 
కనీసం 10 ఎకరాలు కేటాయించి ఉంటే.. వారు అభివృద్ధి చేసిన భూమిలో 30 శాతం ఇతర అవసరాల  వినియోగానికి అనుమతిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చి, మూడేళ్ల పాటు అంటే 2024 మార్చి 31 వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుంది.
ఐటీ రంగంలో మహిళలు, వెనుకబడిన సామాజిక వర్గాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ఐటీ పాలసీలో ప్రత్యేక రాయితీలను ప్రకటించారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీలు కల్పించే ప్రతి స్థానిక ఉద్యోగికి వార్షిక ఆదాయంలో 15 శాతం రాయితీగా అందిస్తారు. 
ఉన్నత స్థాయి ఉద్యోగం కల్పిస్తే గరిష్టంగా రూ.1,50,000.. మధ్య స్థాయి ఉద్యోగానికి రూ.1,12,500.. ప్రవేశ స్థాయి ఉద్యోగానికి రూ.75,000 వరకు చెల్లిస్తారు. మిగతా ఐటీ కంపెనీలకు ఈ రాయితీ 10 శాతంగా ఉంది.
మిగిలిన ఐటీ కంపెనీల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం కల్పిస్తే గరిష్టంగా రూ.1,00,000.. మధ్య స్థాయి ఉద్యోగానికి రూ.75,000.. ప్రవేశ స్థాయి ఉద్యోగానికి రూ.50,000 వరకు చెల్లిస్తారు. ఈ రాయితీని మూడు విడతలుగా చెల్లిస్తారు. దీంతో పాటు పారిశ్రామిక విద్యుత్‌ రాయితీ, ప్రతి ఉద్యోగికి రవాణా సబ్సిడీగా నెలకు రూ.500 చొప్పున రెండేళ్ల పాటు ఇస్తారు. 
ఈ విధంగా ఒక సంస్థకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. స్థానిక ఉద్యోగికి అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం ఉద్యోగికి రూ.10,000 ఒకేసారి చెల్లిస్తారు. స్టార్టప్‌ కంపెనీలను అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తారు. ఒక కంపెనీ క్వాలిటీ సర్టిఫికేషన్‌ తీసుకోవడానికి చేసే వ్యయంలో 50 శాతం చొప్పున గరిష్టంగా రూ.5 లక్షల వరకు రాయితీ అందిస్తారు.

‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’కు ప్రత్యేక రాయితీలు
కోవిడ్‌ తర్వాత పెరుగుతున్న ఇంటి వద్ద నుంచే పనిచేసే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) విధానం, ఇంటి దగ్గర నుంచే సొంతంగా ప్రాజెక్టులు చేపట్టే (గిగ్‌ ఎకనామీ) అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పాలసీలో ప్రత్యేక రాయితీలు ప్రవేశపెట్టారు. 
రాష్ట్రంలో నుంచి పని చేసే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగులు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చుకోవడానికి రూ.20,000 అందిస్తారు. సొంతంగా ఐటీ కాంట్రాక్టులు తీసుకొని పనిచేసే గిగ్‌ వర్కర్లు కొనుగోలు చేసే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వ్యయంలో 50 శాతం లేదా గరిష్టంగా రూ.20,000 రాయితీ అందిస్తారు. గిగ్‌ వర్క్రర్‌ కనీస వార్షిక వ్యాపార పరిమాణం రూ.3,00,000 దాటితేనే ఈ రాయితీ లభిస్తుంది.
వ్యయాన్ని భారీగా తగ్గించే విధంగా ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో పని చేసుకునే విధంగా మూడు ప్రాంతాల్లో స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ కాన్సెప్ట్‌ సిటీలను అభివృద్ధి చేయడంతో పాటు విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. 
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం పెరుగుతుండటంతో ఈ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా పంచాయతీల్లో డిజిటల్‌ లైబ్రరీలు, కోవర్కింగ్‌ ప్లేస్‌లను అభివృద్ధి చేయనున్నారు.  
రాష్ట్రంలో ఉన్న స్థానిక ఐటీ కంపెనీలకు ఊతమిచ్చే విధంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక కంపెనీల నుంచే ఐటీ కొనుగోళ్లు చేయాలన్న నిబంధన ప్రవేశపెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement