ప్రభుత్వం ఆదర్శ యజమానిగా ఉండాలి
పలువురి సర్వీసుల క్రమబద్ధీకరణకు హైకోర్టు ఆదేశం.. ఏపీఏటీ తీర్పు కొట్టివేత
సాక్షి, అమరావతి: శాశ్వత ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయకుండా దశాబ్దాల తరబడి తక్కువ వేతనంతో ఉద్యోగుల సేవలను వాడుకోవడం ‘శ్రమ దోపిడీ’ అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అవసరమైన, నిరంతరాయమైన పనుల కోసం ‘తాత్కాలికం’ పేరుతో ఉద్యోగులను నిరవధికంగా వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఎప్పుడూ ఆదర్శ యజమానిగా ఉండాలే తప్ప, పౌరులను శ్రమ దోపిడీ చేసేలా వ్యవహరించడానికి వీల్లేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన, సరైన ఎంపిక విధానం ద్వారా భర్తీ చేయకుండా, విద్యావంతులను, అన్నీ అర్హతలున్న వారిని ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన తక్కువ వేతనాలకు నియమించుకుంటోందని హైకోర్టు ఆక్షేపించింది.
ఇలా ఔట్‌సోర్స్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించుకున్న ఉద్యోగులను దశాబ్దాల పాటు ఉపయోగించుకుంటోందని తెలిపింది. ఇలా దశాబ్దాలుగా పనిచేస్తూ వస్తున్న ఉద్యోగులు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరితే, మీ నియామకాలు సక్రమంగా జరగలేదనో, మంజూరైన పోస్టులకు అనుగుణంగా నియామకాలు జరగలేదనో ప్రభుత్వం చెప్పడం పరిపాటిగా మారిందని హైకోర్టు పేర్కొంది. దశాబ్దాల తరబడి వారి నుంచి సేవలు పొందిన తరువాత ప్రభుత్వం సాంకేతిక కారణాలను సాకుగా చూపి వారి హక్కులను నిరాకరించడానికి వీల్లేదంది. ఈ మేరకు ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సుబేందు శమంతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. పిటిషనర్ల సర్వీసును రెండు నెలల్లో క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సర్వీసుల క్రమబద్ధీకరించాలకు పిటిషన్లు...
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లో టైపిస్టులు, ట్రేసర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్‌మెన్లు, గార్డెనర్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్లుగా దశాబ్దాలుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కె.శ్రీనివాస్ మరో 36 మంది 2018లో ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ను ఆశ్రయించారు. అలాగే తమ సర్వీసులను కూడా క్రమబద్దీకరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తెలుగు గంగ ప్రాజెక్టులో పనిచేస్తున్న కె.నారాయణరెడ్డి, టీఎస్.ఖాజామైనుద్దీన్ కూడా ఏపీఏటీలో పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్, సర్వీసుల క్రమబద్ధీకరణకు పిటిషనర్లు అర్హులు కారంటూ 2018లో వారి పిటిషన్లు కొట్టేసింది. ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ వీరంతా 2018లో హైకోర్టులో వేర్వేరుగా మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం తుది విచారణ జరిపి తీర్పునిచ్చింది. పిటిషనర్లు 1987, 1989లో నామినల్ మస్టర్ రోల్ (ఎన్‌ఎంఆర్) పద్ధతిన విధుల్లో చేరారు. 1993 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేయలేదనే ఒకే ఒక్క కారణంతో వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించలేదు.


