
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో సూపరింటెండెంట్‌తో పులివెందుల డీఎస్పీ, సీఐ
వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాల కేసులో హైకోర్టు షాక్
థర్డ్ డిగ్రీ వేధింపులపై వైఎస్సార్‌సీపీ నేతలకు మళ్లీ టెస్టులు నిర్వహించాలని ఆదేశం
పులివెందుల: వైఎస్సార్ జిల్లా కడపలో ఇటీవల జరిగిన మహానాడు సందర్భంగా టీడీపీ నాయకులు పులివెందుల రింగ్ రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహాల చుట్టూ టీడీపీ పచ్చ తోరణాలు, జెండాలు కట్టిన విషయంపై తలెత్తిన వివాదంలో వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమంగా బనాయించిన కేసుల విషయంలో పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురైంది. వివరాలివీ..
అప్పట్లో వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ జెండాలు, తోరణాలు కట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు వాటిని తొలగించాలని కోరుతూ పులివెందుల మున్సిపల్ కమిషనర్‌తోపాటు, డీఎస్పీకి వినతిపత్రాలు సమర్పించారు. వీరు స్పందించకపోవడంతో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు వాటిని తొలగించారు. దీన్ని సాకుగా చూపి హోంమంత్రి ద్వారా పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవి ఆదేశాలతో ఓ టీడీపీ నాయకుడితో వారిపై ఫిర్యాదు చేయించారు. దీంతో.. టీడీపీ నేతపై దాడిచేసినట్లు వైఎస్సార్‌సీపీ వారిపై అక్రమంగా హత్యాయత్నం కేసు బనాయించారు.
పోలీసులు వారిని అరెస్టు చేయడంతోపాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో.. పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వైఎస్సార్‌సీపీ నాయకులు జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌కు తెలిపారు. వారికి మెడికల్ టెస్టులు నిర్వహించాలని మేజిస్ట్రేట్ ఆదేశించగా.. వారిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పోలీసులతోపాటు టీడీపీ నాయకులు డాక్టర్లపై ఒత్తిడి తెచ్చి దెబ్బలులేనట్లుగా రిపోర్టులు ఇప్పించారు. దీనిపై నిందితులు మళ్లీ హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీవ్రంగా స్పందించి వారికి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ టెస్టులు నిర్వహించాలని, నివేదిక తమకు సమర్పించాలని ఆదేశించింది.
పులివెందుల పోలీసుల ఓవరాక్షన్..
ఇక ఈ మెడికల్ టెస్టుల్లో తమకు వ్యతిరేకంగా నివేదిక వస్తుందనే అనుమానంతో పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, అర్బన్ సీఐ చాంద్ బాషా, రూరల్ సీఐ వెంకటరమణ కర్నూలులో మకాంవేసి అధికార పార్టీ నేతల ద్వారా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అంతేకాక.. కర్నూలు డీఎస్పీ కూడా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని రిపోర్టులను తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పైగా.. కర్నూలు సూపరింటెండెంట్‌తో పాటు వీరంతా కలిసి ఉన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
ఈ వీడియోలో మీడియా కంటపడకుండా సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తన ముఖం చాటేయడం కనిపించింది. వీటి ఆధారంగా పిటిషనర్లు మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక.. తమకు తగిలిన గాయాలను ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్ ద్వారా గాయాలున్నట్లు తేలిన నివేదికను కోర్టుకు సమర్పించారు. దీంతో.. హైకోర్టు ఈ వారంలోగా వారికి తిరుపతి స్విమ్స్ కేంద్రంగా మళ్లీ మెడికల్ టెస్టులు నిర్వహించాలని పులివెందుల అర్బన్ సీఐ చాంద్ బాషాను ఈనెల 1న ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను గురువారం ఆయనకు అందజేశారు.