కర్నూలు, విజయవాడకు సీబీఐ కోర్టులు తరలించండి

తక్షణమే చర్యలు చేపట్టండి
విశాఖ, విజయవాడ, కర్నూలు పీడీజేలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని రెండో అదనపు సీబీఐ కోర్టును కర్నూలుకు, మూడో అదనపు సీబీఐ కోర్టును విజయవాడకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు హైకోర్టు చర్యలు చేపట్టింది. ఆ కోర్టులను తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విశాఖపట్నం, కృష్ణా, కర్నూలు జిల్లాల ప్రిన్సిపల్ జిల్లా జడ్జిల (పీడీజే)ను హైకోర్టు ఆదేశించింది.
2020లో రాష్ట్ర ప్రభుత్వం ఆ కోర్టుల న్యాయ పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన జీవోలకు అనుగుణంగా సీబీఐ కేసులను ఆయా కోర్టులకు బదిలీ చేయాలని విశాఖపట్నం పీడీజే హైకోర్టును అభ్యర్థించారు. దీంతో కర్నూలు, విజయవాడకు అదనపు సీబీఐ కోర్టులను తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని మూడు జిల్లాల పీడీజేలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్) ఆలపాటి గిరిధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.