AP: కుమార్తెకు తండ్రి ఆస్తిలో సమానహక్కు | AP High Court clarified daughters Rights as sons in ancestral father property | Sakshi
Sakshi News home page

AP: కుమార్తెకు తండ్రి ఆస్తిలో సమానహక్కు

May 13 2026 7:46 AM | Updated on May 13 2026 8:39 AM

AP High Court clarified daughters Rights as sons in ancestral father property

 హిందూ వారసత్వ సవరణ చట్టం నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం తీర్పు  

1988 నాటి ఆస్తి వివాదంలో కుమార్తెకు సగం వాటాను ఇచ్చిన హైకోర్టు  

సాక్షి, అమరావతి: హిందూ వారసత్వ సవరణ చట్టం–2005 ప్రకారం కుమార్తె పుట్టుకతోనే కుమారుడితో సమానంగా ఆస్తి హక్కు కలిగి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కుమార్తె ఈ సమాన వాటా పొందేందుకు 2005లో సవరణ చట్టం అమల్లోకి వచ్చేనాటికి తండ్రి జీవించి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆస్తిలో సమాన హక్కు పొందేందుకు సవరణ చట్టం వచ్చిన 2005 సెప్టెంబర్ 9 నాటికి కుమార్తె జీవించి ఉంటే సరిపోతుందని చెప్పింది. 

విభజన దావా (పార్టిషన్ సూట్‌)లో ప్రాథమిక తీర్పు (ప్రిలిమినరీ డిక్రీ) ద్వారా వాటాల నిర్ణయం జరిగి, తుది తీర్పు (ఫైనల్‌ డిక్రీ) పెండింగ్‌ ఉంటే, ఆ తరువాతి కాలంలో చట్టపరమైన, వాస్తవిక మార్పులు జరిగితే కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని తెలిపింది. ‘విభజన దావాలో ఆస్తి వాటాలను నిర్ణయించిన తర్వాత, తుది తీర్పు రాకముందే కుటుంబంలో మార్పులు సంభవిస్తే వాటాలు మారతాయి. ఒక వాటాదారు మరణిస్తే, వారి వాటా మిగిలిన వారసులకు చెందుతుంది. దీనివల్ల ఇతరుల వాటా శాతం పెరుగుతుంది. కొత్తగా వారసుడు జన్మిస్తే, అతడికి/ఆమెకు కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ఇతరుల వాటా తగ్గుతుంది.

 ఇటువంటి సందర్భాల్లో మారిన వాటాలను ఖరారు చేస్తూ కోర్టు మరో ప్రాథమిక తీర్పు ఇవ్వవచ్చు’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. 2005 చట్ట సవరణ నేపథ్యంలో తుది తీర్పు వెలువడకముందటి ప్రాథమిక తీర్పును సవరించి కుమార్తెలకు సమానవాటా ఇవ్వవచ్చని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా వీరమ్మ అనే మహిళకు తండ్రి మారెప్ప నుంచి సంక్రమించే ఆస్తి వాటాను హైకోర్టు సవరించింది. 2003లో వీరమ్మకు తండ్రి ఆస్తిలో 1/6 వాటా రాగా, 2005 సవరణ చట్టం నేపథ్యంలో మారెప్ప కుమారుడితో సమానంగా వీరమ్మ వాటాను సగానికి పెంచింది. సవరించిన వాటాను పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా తుది తీర్పు వెలువరించాలని కింది కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ, జస్టిస్‌ మెడమల్లి బాలాజీ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.  

ఆస్తిలో వాటా కోసం న్యాయ పోరాటం  
కర్నూలు జిల్లాకు చెందిన వి.మారెప్పకు భార్య నాగమ్మ, కుమార్తె వీరమ్మ, కుమారుడు బుసప్ప ఉన్నారు. మారెప్ప ఆస్తిలో వాటా కోసం వీరమ్మ 1988లో కోర్టులో దావా వేశారు. ఆ తరువాత ఈ వివాదం హైకోర్టుకు చేరింది. విచారణ జరిపిన హైకోర్టు..  మారెప్ప ఆస్తిలో భార్య నాగమ్మ, కుమార్తె వీరమ్మ, బుసప్పకు వాటానిస్తూ 2003లో తీర్పు ఇచ్చింది.  2005లో హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కుమార్తెకు సైతం సమాన హక్కు కల్పించడంతో  వీరమ్మకు ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు ధర్మాస          నం.. ఆమెకు తండ్రి ఆస్తిలో సగం ఆస్తిని వాటాగా ఇస్తూ తీర్పు వెలువరించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement