
డిగ్రీ ప్రవేశాలపై ‘ద్వంద్వ’ వైఖరి
డ్యూయల్ మేజర్ అంటూ హడావుడి చేసి ఇప్పుడు సింగిల్ మేజర్ వైపే మొగ్గు
‘విధాన’ నిర్ణయాలు తీసుకోవడంలో సర్కారు వైఫల్యం
నెలల తరబడి సాగదీతతో అడ్మిషన్లకు తీవ్ర జాప్యం
సింగిల్ మేజర్ అమలుకూ స్పష్టత కరువు
మంత్రి ఆదేశాలు జారీ చేసి రెండురోజులైనా వీడని గందరగోళం
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు నిర్వహణ సందేహమే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ విద్యా విధానంపై ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోంది. ప్రైవేటు కళాశాలల నుంచి ముడుపుల కోసం ఉన్నత విద్యా మండలి, విశ్వవిద్యాలయాల అకడమిక్ నిర్ణయాల్లో పదేపదే జోక్యం చేసుకుంటూ విద్యా సంవత్సరాన్ని మరింత జాప్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సింగిల్ మేజర్’ను తప్పుపట్టిన కూటమి ప్రభుత్వం దాన్ని మార్పు చేయాలని భావించింది. అందుకే ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేసి డ్యూయల్ మేజర్‌ను ప్రతిపాదించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు నెలలు తరబడి సాగదీసిన ప్రభుత్వం తాజాగా ‘సింగిల్ మేజర్’ వైపు మొగ్గు చూపుతోంది.
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల కిందట నిర్వహించిన సమీక్షలో సింగిల్ మేజర్‌లో స్వల్ప మార్పులు చేసి పాత డిగ్రీ విధానాన్నే కొనసాగించాలని ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం (ఉన్నత విద్యాశాఖ)నుంచి ఉన్నత విద్యా మండలికి రాత పూర్వకంగా ఎటువంటి ఆదేశాలూ రాలేదు. గతంలో ప్రతిపాదించిన డబుల్ మేజర్ నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండానే మళ్లీ మీ ప్రతిపాదనలు పంపించండి అంటూ, ఏ ప్రతిపాదనలు పంపించాలో చెప్పకుండా ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి నోట్ ఇవ్వడంపై గందరగోళం నెలకొంది.
ఉన్నత విద్యా మండలి నుంచి ప్రతి అంశం లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి చేరుతుంటే.. ప్రభుత్వం నుంచి మాత్రం నోటి మాటలు తప్ప.. రాతపూర్వక ఆదేశాలు రాకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తీరు కొనసాగితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం డిగ్రీ ప్రవేశాలు, తరగతుల నిర్వహణ అసాధ్యమని విద్యావేత్తలు భావిస్తున్నారు.
కోర్సుల కన్వర్షన్‌కు ఆలస్యం..
డిగ్రీ విద్యా విధానంలో ప్రభుత్వం మార్పులు చేస్తే కళాశాలలు కొత్తగా కోర్సుల కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే డ్యూయల్ మేజర్ నోటిఫికేషన్ రావడంతో కన్వర్షన్‌కు దరఖాస్తు చేసి రుసుములు చెల్లించాయి. ఇప్పుడు మళ్లీ సింగిల్ మేజర్ విధానాన్ని ప్రతిపాదిస్తే జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం.. ప్రకారం అనుమతులు పొందాలి. ఇలా రాష్ట్రంలో 1,250కిపైగా కళాశాలల వివరాలను పరిశీలించి అనుమతులు ఇవ్వాలి.
ఈ ప్రక్రియ పూర్తికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రక్రియను వేగవంతం చేయాల్సిన ప్రభుత్వం మరింత గందరగోళం సృష్టించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడు యూనివర్సిటీల నుంచి కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే ప్రక్రియా ప్రారంభంకాలేదు. పైగా కొత్త విధానంలో కోర్సులు, క్రెడిట్ ఫ్రేమ్ వర్క్స్, సిలబస్ రూపకల్పనలోనూ జాప్యమయ్యే ఆస్కారం ఉంది.
ఆఫ్‌లైన్..ఆన్‌లైన్‌లో ఎలా సాధ్యం?
గత ప్రభుత్వం పారదర్శకంగా డిగ్రీ ప్రవేశాల నిర్వహణకు తీసుకొచ్చిన ఆన్‌లైన్ అడ్మిషన్లు(కన్వీనర్ కోటా) వ్యవస్థకు కూటమి ప్రభుత్వం తిలోదకాలు ఇస్తోంది. ఈ ఏడాది ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోనూ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇక్కడ విద్యార్థి తాను చేరాలనుకున్న కళాశాలలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కళాశాలలూ తాము చేర్చుకోవాలనుకున్న విద్యార్థి వివరాలను ఆఫ్‌లైన్ ద్వారా తీసుకుని ఆ తర్వాత ఆన్‌లైన్ చేయొచ్చట.
ఇక్కడ కళాశాల నమోదు చేసిన విద్యార్థుల కంటే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న విద్యార్థులు మెరిట్ ప్రకారం సీట్లు సాధించినప్పుడు కళాశాలలను నమ్ముకుని వచ్చిన విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారనుంది. కన్వీనర్ కోటాకు మాత్రమే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తుండగా తాము తీసుకొచ్చిన విద్యారి్థకి సీటు దక్కకుంటే కళాశాలలు ఏవిధంగా స్పందిస్తాయనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ తరహా ప్రవేశాలు లేవు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పోర్టల్ రూపొందించాల్సి ఉంది. ఇందుకు కూడా సమయం పట్టనుంది.
‘ప్రైవేటు’ ముడుపుల కోసమే ఈ సాగదీత..!
సింగిల్ మేజర్ విధానానికే ముఖ్యంగా పెద్ద ప్రైవేటు కళాశాలలు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. వీలైనన్ని ఎక్కువ మేజర్ ప్రోగ్రామ్స్‌ను చేర్చుకునే వెసులుబాటు ఉండటంతో విద్యార్థులను ఆకట్టుకునేందుకు అవకాశం ఏర్పడింది. తద్వారా ప్రైవేటు కళాశాలలు డిగ్రీ విద్యలో రాణిస్తున్నాయి. ఇక్కడే ప్రభుత్వ పెద్దల కన్ను ప్రైవేటు కళాశాలలపై పడింది. వాటిని ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని తద్వారా ముడుపులు మూటగట్టుకోవాలని పథకం రచించారు. ఈ క్రమంలోనే సింగిల్ మేజర్‌ను మార్పు చేస్తామని, ఉన్నత విద్యా మండలి ద్వారా కమిటీ వేయించారు.
ఆ తర్వాత డ్యూయల్ మేజర్‌ను తెరపైకి తెచ్చారు. అంతే, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం సాఫీగా నడుస్తున్న సింగిల్ మేజర్‌లో మార్పులొస్తే ఇబ్బందులు తప్పవని భావించిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు రాయబారాలు నడిపాయి. గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల యజమాని ద్వారా ప్రభుత్వ పెద్దలతో బేరసారాలు సాగించాయి. ఈ క్రమంలోనే మూటలు అందడంతో డ్యూయల్ మేజర్ విధాన ప్రతిపాదనను పక్కన పడేసి సింగిల్ మేజర్‌నే కొనసాగిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఉన్నత విద్యా మండలిని చాకచక్యంగా వాడుకోవడం గమనార్హం!.