ఖజానాపై ‘ప్రత్యేక విమానం’ మోత! | AP CM Chandrababu Naidu has spent about Rs 109. 04 Crores on helicopter | Sakshi
Sakshi News home page

ఖజానాపై ‘ప్రత్యేక విమానం’ మోత!

Apr 7 2026 5:58 AM | Updated on Apr 7 2026 5:58 AM

 AP CM Chandrababu Naidu has spent about Rs 109. 04 Crores on helicopter

రెండేళ్లలో చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దె రూ.109.04 కోట్లు

పవన్, లోకేశ్‌ కూడా ప్రత్యేక ఫ్లైట్లలోనే ప్రయాణాలు.. 

వాటి అద్దెల లెక్కలు వెల్లడించని ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదని, ఆదాయంలో 98 శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే సరిపోతోందని, సంక్షేమ పథకాల అమలుకు అప్పులు చేయాల్సి వస్తోందని ఒకవైపు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుగుతున్న విలాసవంతమైన ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. చంద్రబాబు ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే ప్రయాణిస్తున్నారు. జిల్లాల పర్యటనలకు, ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల టూర్లకు, చివరికి ప్రతి శనివారం హైదరాబాద్‌లోని సొంత ఇంటికి వెళ్లొచ్చేందుకు కూడా ప్రత్యేక హెలికాప్టర్, విమానాలనే వినియోగిస్తున్నారు.

దీంతో రెండేళ్లలోనే సీఎం చంద్రబాబు (వీవీఐపీ) ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.109.04 కోట్లు ఖర్చు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.54.41 కోట్లు, 2025–26 ఆరి్థక సంవత్సరంలో రూ.54.63 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేసింది. అదేవిధంగా 2026–27 ఆర్థిక సంవత్సరంలోనూ చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు అద్దె చెల్లింపు కోసం బడ్జెట్‌లో రూ.54.63 కోట్లను కేటాయించారు. సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లాలన్నా తాడేపల్లిలోని కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఇక వారాంతంలో చంద్రబాబు పక్క రాష్ట్ర హైదరాబాద్‌లో ఉన్న తన సొంత ఇంటికి సైతం ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు. దీంతో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల భారం ప్రభుత్వ ఖజానాపై భారీగా పడుతోంది.

పవన్, లోకేశ్‌ ప్రత్యేక విమానాల ఖర్చు ఎంతో?
ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ కూడా ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లనే వినియోగిస్తున్నారు. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పర్యటనలకు, తరచూ హైదరాబాద్‌కు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. అయినా పవన్‌కళ్యాణ్, లోకేశ్‌ తిరుగుతున్న ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల ఖర్చు గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. వీరిద్దరి ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దెకు ఎంత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement