AP Budget 2021: విపత్తులో వెన్నుదన్ను!

AP Agriculture Budget 2021: Rs 31256 Crore Allocated To Different Schemes - Sakshi

బడ్జెట్‌ కేటాయింపుల్లో సాగుకు ప్రాధాన్యం

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.31,256.36 కోట్లు 

శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు

23 నెలల్లోనే రైతులకు రూ.68 వేల కోట్ల మేర సాయం 

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్లు, కర్ఫ్యూలున్నా దేశ మనుగడ కోసం నిరంతరం శ్రమించే అన్నదాతల సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యమివ్వడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విధానమని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై పెట్టే పెట్టుబడినే ఆకలి, పేదరికంపై పోరాటానికి ఆయుధాలుగా భావిస్తూ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ శాఖలకు మొత్తం రూ.31,256.36 కోట్ల కేటాయింపులతో 2021–22 వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు గురువారం శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా రెండో ఏడాది కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా రైతు సంక్షేమం, వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత ఏడాది కంటే అధికంగా నిధులు కేటాయించింది. నిత్యం స్వేదం చిందిస్తూ సేద్యం చేసే 

రైతుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించామని మంత్రి కన్నబాబు తెలిపారు. మంత్రి కన్నబాబు ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ..
గత సర్కారు మిగిల్చిన బకాయిలూ చెల్లించాం..
అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు రూ.68 వేల కోట్ల మేర సహాయం అందించింది. టీడీపీ సర్కారు మిగిల్చిన బకాయిలు రూ.2,771 కోట్లు కూడా చెల్లించింది. 
► విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని సేవలు అందించేలా గ్రామీణ ప్రాంతాల్లో 10,544, పట్టణ కేంద్రాల్లో కొత్తగా 234 కేంద్రాలతో కలిపి మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వివిధ ఉత్పత్తులను నిల్వ చేసి ఆర్బీకేలకు అందించేందుకు 154 హబ్‌లను అందుబాటులోకి తెచ్చాం. ఒక్కోటి రూ.21.80 లక్షల చొప్పున మొత్తం 10,417 ఆర్బీకే భవనాల నిర్మాణం కొనసాగుతోంది. 
వైఎస్సార్‌ పొలం బడుల ద్వారా రైతు సాధికారిత సాధిస్తున్నాం. 10,246 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు నెలకొల్పాం. 
 వైఎస్సార్‌ రైతు భరోసా కింద 2020–21లో 51.95 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.6,928 కోట్లు జమ చేశాం. 2021–22 తొలి విడత సాయంగా 52.38 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.3,928.88 కోట్లు ఇచ్చాం. ఇంతవరకు మొత్తం రూ.17,029.88 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. 
 విత్తనాల కోసం వ్యయ ప్రయాసలు, సుదూర ప్రయాణాలు, క్యూ లైన్లు, పోలీసుల పహారా లాంటి వాటికి ముగింపు పలికాం. రైతులకు కల్తీలేని నాణ్యమైన విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాం. తొలిసారి టెండర్లు లేకుండా రైతుల నుంచే నేరుగా విత్తనాలు సేకరించి, శుద్ధి చేసి నాణ్యంగా మార్చి తిరిగి అన్నదాతలకే అందజేశాం. 
రైతులపై రూపాయి భారం లేకుండా...
 దేశంలో రైతులపై ఒక్క రూపాయి కూడా బీమా ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.
 వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం కింద ఏటా రూ.లక్ష లోపు పంట రుణం తీసుకున్న వారికి వడ్డీ రాయితీని ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. తద్వారా 82 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు ప్రయోజనం పొందుతున్నారు. 
 రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు కలిసి కూర్చొని పంటల ప్రణాళిక రూపొందించేలా వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేసి క్రియాశీలం చేశాం.
రైతులకు వారి పొలాల్లోనే శిక్షణ ఇచ్చేందుకు వైఎస్సార్‌ పొలంబడి పథకాన్ని సమర్థంగా అమలు చేస్తున్నాం. మత్స్య సాగుబడి, పశు విజ్ఞాన బడి, తోటబడి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. 2020–21లో నిర్వహించిన 18,840 పొలం బడులలో 5.65 లక్షల మంది రైతులు శిక్షణ పొందారు.
ఈ ఏడాది కొత్తగా సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని తెస్తున్నాం. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం, భూ సారాన్ని పరిరక్షించడం, సేంద్రీయ పద్ధతులు పాటించటాన్ని ప్రోత్సహిస్తాం. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా ‘ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ మేనేజ్డ్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ (ఏపీసీఎన్‌ఎఫ్‌) అమలు చేస్తున్నాం. 
 విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను తనిఖీ చేసిన తరువాతే వినియోగించేలా వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలను వచ్చే ఖరీఫ్‌కి అందుబాటులోకి తెస్తాం. 
 ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం చెల్లించే విధానాన్ని దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి సమర్థంగా అమలు చేస్తున్నాం. ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేసి ఏటా రూ.2 వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి జగన్‌ కచ్చితంగా అమలు చేస్తున్నారు. 2020 ఖరీఫ్‌లో జూన్‌ నుంచి అక్టోబరు వరకు పంటలు నష్టపోయిన 3.80 లక్షల మంది రైతులకు రూ.285.51 కోట్లు పరిహారం జమ చేశాం. 2020 నవంబర్‌లో నివర్‌ తుపాను వల్ల నష్టపోయిన 8.34 లక్షల మంది రైతులకు రూ.645.99 కోట్లు వెంటనే డిసెంబర్‌లోనే చెల్లించడం  ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. 
► ఆత్మహత్యలకు పాల్పడ్డ అన్నదాతల కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణమే రూ.7 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నాం. టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 462 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందచేశాం.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. గత ఏడాది లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. 2019 నుంచి 2021 మే వరకు రూ.31,782 కోట్లతో 157 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు  చేశాం. 
సీఎం యాప్‌ ద్వారా ధరల నమోదు..
సీఎం యాప్‌ ద్వారా ప్రతి గ్రామంలో ఏ పంట ఎంత ధరలు ఉన్నాయో నమోదు చేస్తున్నాం. రైతులకు చెల్లింపుల్లో పారదర్శకతక కోసం ఇ–సంతకం విధానాన్ని ప్రవేశపెట్టాం. గోనె సంచులపై క్యూఆర్‌ ట్యాగులతో అనుసంధానించాం. 
దేశవ్యాప్తంగా వ్యాపారులతో మన గ్రామస్థాయి మార్కెట్లను అనుసంధానించేందుకు ‘ఇ–ఫార్మ్‌ మార్కెటింగ్‌’ వేదికను అందుబాటులోకి తెచ్చాం. 
మహిళా సాధికారికత కోసం మార్కెటింగ్‌ కమిటీల్లో  మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. 
​​​​​​​► ప్రతి గ్రామంలో మార్కెటింగ్‌ మౌలిక వసతుల కల్పన కోసం రూ.14 వేల కోట్లతో ఫామ్‌ గేట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యవస్థను నెలకొల్పుతున్నాం. 
​​​​​​​►వ్యవసాయ ఉత్పత్తులను పొలాల్లోనే కొనుగోలు చేసేందుకు పంట కోత ముందు, తరువాత అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,718.11 కోట్లతో బహుళార్ద సాధక సదుపాయాల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.
​​​​​​​►డీసీసీబీల్లో హెచ్‌ఆర్‌ పాలసీని తెచ్చి పీఏసీఎస్‌లను కంప్యూటరీకరిస్తున్నాం. 
​​​​​​​►సమీకృత సహకార అభివృద్ధి పథకం రెండో దశ కింద చిత్తూరు, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో రూ.609.39 కోట్లతో పనులు మంజూరు చేశాం. మొదటి ఏడాది 67 గిడ్డంగుల నిర్మాణంతోపాటు 44 పాత గిడ్డంగుల మరమ్మతులు, కార్యాలయాల నిర్మాణ పనులు చేపడతాం. 
​​​​​​​►ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌ ఏర్పాటు కోసం రూ.2,850 కోట్లతో ప్రణాళికను ఆమోదించాం. 
​​​​​​​►రూ.460 కోట్లతో 2020–25లో రాష్ట్రంలో 10,035 సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలను నెలకొల్పేలా ప్రణాళిక రూపొందించాం. 
​​​​​​​► ఉద్యానవన పంటల విస్తరణ పథకంలో భాగంగా ఈ ఏడాది అదనంగా లక్ష ఎకరాల్లో నూతన పంటల క్లస్టర్లను అభివృద్ధి చేస్తాం. 
​​​​​​​►బైవోల్టైన్‌ సెరీ కల్చర్‌ను ప్రోత్సహించేందుకు బైలోల్టైన్‌ పట్టు గూళ్ల ఉత్పత్తిపై కిలోకు రూ.50 ప్రోత్సాహకం అందిస్తున్నాం. బైవోల్టైన్‌ ముడి పదార్థం నుంచి సిల్క్‌ రీలర్స్‌ ఉత్పత్తికి కిలోకు రూ.130 చొప్పున ప్రోత్సాహకం ఇస్తున్నాం. 
​​​​​​​►పశువులకు గ్రాసం అందించేందుకు దేశంలో మన రాష్ట్రమే తొలిసారిగా రూ.250 కోట్లతో పశుగ్రాస పథకాన్ని ప్రవేశపెట్టింది. 
​​​​​​​►రూ.40.86 కోట్లతో పులివెందులలో ముర్రాజాతి గేదెల పునరుత్పత్తి కేంద్రాన్ని ఐదేళ్లలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం. 
​​​​​​​►పాల సేకరణ, విక్రయంలో ప్రపంచంలోనే సహకార రంగంలో పెద్దదైన అమూల్‌ డెయిరీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని నూతన అధ్యాయానికి తెరతీశాం. ఈ పథకం అమలవుతున్న గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో పాడి రైతులకు అదనంగా రూ.5 నుంచి రూ.17 వరకు లబ్ధి చేకూరుతోంది. 
​​​​​​​►చేపలు, రొయ్యల దాణా, నాణ్యత పరీక్షలు, సేవలు అందించేందుకు రాష్ట్రంలో 9 తీరప్రాంత  జిల్లాల్లో 35 సమీకృత ఆక్వా ల్యాబ్స్‌ ఏర్పాటుకు రూ.50.30 కోట్లు కేటాయించాం. 
​​​​​​​► ఆక్వా కల్చర్‌ రంగంపై పర్యవేక్షణ, నియంత్రణ, సుస్థిర అభివృద్ధి కోసం ఏపీ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని స్థాపించాం. 
​​​​​​​►పశ్చిమ గోదావరి జిల్లాల్లో షిషరీష్‌ విశ్వవిద్యాలయం నెలకొల్పేందుకు చర్యలు చేపట్టాం. 
n తీరప్రాంతాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు మొదటి దశలో నిజాంపట్నం(గుంటూరు), మచిలీపట్నం(కృష్ణా)లలో ఫిషింగ్‌ హార్బర్ల ఆధునీకరణ, ఉప్పాడ (తూర్పు గోదావరి), జువ్వలదిన్నె (నెల్లూరు)లలో కొత్త ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు చేపట్టాం. రెండో దశలో బుడగట్లపాలెం(శ్రీకాకుళం), పూడిమడక(విశాఖపట్నం ), బియ్యపు తిప్ప(పశ్చిమ గోదావరి), కొత్తపట్నం (ప్రకాశం)లో హార్బర్ల నిర్మాణం చేపడతాం. 
​​​​​​​►వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ కోసం ఫీడర్ల బలోపేతానికి రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 
​​​​​​​►వైఎస్సార్‌ జలకళ పథకం కింద నాలుగేళ్లలో రూ.2,340 కోట్లతో 2 లక్షల బోర్లు ఉచితంగా వేస్తాం. చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగించేందుకు రూ.1,700 కోట్లతో మోటార్లను కూడా ఉచితంగా అందిస్తాం. దీంతో ఐదు లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చి 3 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు.
​​​​​​​  

చదవండి: AP Budget 2021: విద్యా రంగానికి రూ.24,624 కోట్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top