గ్రామ కంఠాల్లోని ఆస్తులకు మహర్దశ

Andhra Pradesh Panchayat Raj Act Amendment: Grama Kantam Land, Asset Certificate - Sakshi

ఆస్తి సర్టిఫికెట్ల జారీకి ఏపీ ప్రభుత్వ నిర్ణయం

ఇప్పటిదాకా ఇవి ఎంత విలువైనవైనా అవి అక్కరకురాని ఆస్తి కిందే లెక్క

ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా 90లక్షల ఇళ్లు, 30లక్షల స్థలాలు ఉన్నట్లు అంచనా

సర్కారు తాజా నిర్ణయంతో వీటి క్రయవిక్రయాలు ఇక సులభం

రుణాల కోసం బ్యాంకుల్లోనూ తనఖా పెట్టుకోవచ్చు

చట్ట సవరణ తర్వాత ఆ ఆస్తులన్నింటికీ యాజమాన్య హక్కులు జారీ

రెవెన్యూ, గ్రామ పంచాయతీల్లో వీటికి ప్రత్యేక రిజిస్టర్లు

ప్రభుత్వ చర్యలతో మార్కెట్‌లో వాటి విలువకూ రెక్కలు 

బ్యాంకులో లోను తీసుకుని ఓ చిన్న సూపర్‌ మార్కెట్‌ ప్రారంభించాలని కలలుకంటున్న రామకోటేశ్వరరావు కల త్వరలో నేరవేరబోతోంది. బ్యాంకు లోను కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా తనఖా ఏం పెడతావ్‌ అంటూ బ్యాంకు వాళ్లు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పలేక ఎప్పటికప్పుడు తన ఆశను చంపుకుంటూ వచ్చాడు. ఊళ్లో నాలుగు సెంట్ల స్థలంలో తల్లిదండ్రులు ఎప్పుడో కట్టిన దాదాపు రూ.20 లక్షలు విలువ చేసే ఇల్లు తప్ప అతనికి మరే ఆస్తిపాస్తుల్లేవు. ఆ ఇంటిని చూసి లోను ఇవ్వమని అడిగితే దస్తావేజులు తెమ్మమనేవారు. ఊళ్లో గ్రామకంఠం కింద ఉండే ఇళ్లకు ఎలాంటి దస్తావేజులు ఉండవని తెలిసి రామ కోటేశ్వరరావు ఆ ప్రయత్నాలు విరమించుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఇలాంటి ఆస్తులకూ ఆస్తి సర్టిఫికెటును మంజూరు చేయబోతుందని తెలిసి రామకోటేశ్వరరావు ఆనందానికి అవధుల్లేవు.  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి దస్తావేజుల్లేని ఆస్తుల యజమానులకు ఇది గొప్ప ఊరట. వీరి కష్టాలకు తెరదించుతూ గ్రామకంఠాల పరిధిలోని ఆస్తులకు కొత్తగా యాజమాన్య హక్కు (ఆస్తి సర్టిఫికెట్లు)ను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు చేసేందుకు ఇటీవల సమావేశమైన కేబినెట్‌ ఆమోదం కూడా తెలిపింది. దీంతో ఇన్నాళ్లూ అవకాశం లేకుండాపోయిన క్రయవిక్రయాలను ఇప్పుడు అధికారికంగా ఎంతో ధీమాగా చేసుకోవచ్చు. పూర్వం ఎప్పుడో గ్రామ కంఠాలుగా వర్గీకరణ చేసిన ప్రాంతంలో ఇళ్లు, ఇతర ఖాళీ స్థలాలున్న వారికి ఇప్పటివరకు వాటిని ఉపయోగించుకోవడమే కానీ,  మరే విధంగా అవి అక్కరకు రాని ఆస్తిగా తయారయ్యాయి. దీంతో అవి రూ.లక్షల విలువ చేసినా అవసరమైనప్పుడు వాటి ద్వారా ఒక్క రూపాయి కూడా రుణం పొందే అవకాశంలేదు. వాటిని అమ్మినా, కొన్నా అవన్నీ అనధికారికంగా జరిగే లావాదేవీలే. 


90 లక్షల ఇళ్లు.. 30 లక్షల స్థలాలు

రాష్ట్రంలో 17,950 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిల్లో గ్రామ కంఠాల పరిధిలో ఇళ్లు, స్థలాలున్న వారికి రెవెన్యూ శాఖ యజమాన్య హక్కు ఇచ్చే విధానంలేదు. వీటికి సంబంధించి రెవెన్యూ లేదా పంచాయతీల వద్ద ఎలాంటి ప్రత్యేక రిజిస్టర్లు లేవు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి గ్రామ కంఠాల పరిధిలో 90 లక్షల ఇళ్లు, మరో 30 లక్షల సంఖ్యలో ఇతర ఖాళీ స్థలాలు ఉంటాయని పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల అంచనా. వీటన్నింటి విలువను లెక్కిస్తే రూ.10 లక్షల కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. 


చట్ట సవరణ తర్వాత ప్రతి ఆస్తికీ సర్టిఫికెట్‌

ఈ నేపథ్యంలో.. గ్రామ కంఠం పరిధిలో ప్రతి ఇల్లు, ఖాళీ స్థలానికి వేర్వేరుగా సంబంధిత యజమానులకు ఆస్తి సర్టిఫికెట్ల జారీకి వీలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ చట్టానికి సవరణలు చేస్తోంది. అసెంబ్లీలో ఈ చట్ట సవరణకు ఆమోదం లభించాకే ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ప్రతి ఆస్తిని యజమాని పేరుతో రెవెన్యూ, గ్రామ పంచాయతీ రికార్డులలో నమోదు చేస్తారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష పథకంలో గ్రామ కంఠంలో ఉండే ఆస్తులకూ డ్రోన్ల సహాయంతో సర్వే నిర్వహిస్తారు. ఒక్కొక్క దానికి ప్రత్యేక నెంబరును కేటాయించి ఆ మేరకు యజమానికి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఆస్తి సర్టిఫికెట్‌ను జారీచేస్తారు. కాగా, రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్టుగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఈ సర్వే ప్రక్రియ పూర్తవగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున 51 గ్రామాలలో సర్వే కొనసాగుతోంది. 


ఇళ్ల విలువ పెరిగే అవకాశం

ఇదిలా ఉంటే.. ఆస్తి సర్టిఫికెట్‌ జారీతో యజమానికి పూర్తి ఆర్థిక భరోసా లభించినట్లవుతుంది. ఆ ఆస్తిని తాకట్టు పెట్టి బ్యాంకు లోన్లు పొందే వీలుంటుంది. క్రయవిక్రయాలు లేదా ఆస్తి పంపకాలు సులభంగా జరుపుకోవచ్చు. ఇదే సమయంలో ఆ ఆస్తులకు ప్రస్తుతమున్న ధర కంటే భారీగా రేటు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top