సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విధానంపై ఏకాభిప్రాయం

Andhra Pradesh Government meeting with representatives of film industry Perni Nani - Sakshi

సినీ పరిశ్రమ ప్రతినిధులతో ప్రభుత్వ సమావేశం.. చిత్రసీమ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి: సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయంపై సినీ పరిశ్రమ ఏకాభిప్రాయం వ్యక్తం చేసిందని సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. సోమవారం సచివాలయం నాలుగో బ్లాకులో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం–2002 నుంచి అమలుకు నోచుకోలేదన్నారు. తమ ప్రభుత్వం దీనిపై వివిధ కమిటీలను నియమించి విస్తృతంగా అధ్యయనం చేస్తోందని వివరించారు. ఇందులో భాగంగానే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ప్రతినిధులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టేక్‌ హోల్డర్లతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నట్టు చెప్పారు.

ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయంపై అందరూ ఏకాభ్రిపాయం వ్యక్తం చేయడంతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారన్నారు. వారి విజ్ఞప్తులను పరిశీలించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి సమావేశంలో వివరించామని, వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సినిమాపై తమ ఇష్టాన్ని ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్ణయించిన టికెట్‌ ధరల ప్రకారం ప్రజలకు వినోదం అందిస్తామన్నారు. చాలా వరకు థియేటర్లలో ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయిస్తున్నారని, త్వరలో అన్ని థియేటర్లలో ఈ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. ఏపీ సినిమా చిత్రీకరణకు అవసరమైన మౌలిక వసతుల కల్పన విషయంలో ప్రతినిధుల బృందం ప్రభుత్వానికి చేసిన సూచనలను పరిశీలిస్తామన్నారు. 

చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవం
చిత్రరంగ సమస్యలను పరిష్కరించాలని మెగాస్టార్‌ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విన్నవించిన విషయమై విలేకరులు ప్రశ్నించగా.. చిరంజీవి అంటే సీఎం జగన్‌ ఎంతో గౌరవం ఉందని, ఆయనను సోదరభావంతో చూస్తారని చెప్పారు. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు విజయచందర్, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ టి.విజయకుమార్‌రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ సీఈవో వాసుదేవరెడ్డి, ఏపీ తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌కు చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సంఘాల ప్రతినిధులు సి.కల్యాణ్, దిల్‌ రాజు, జి.ఆదిశేషగిరిరావు, వంశీ, డీఎన్వీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు చిత్ర సీమ సంతోషంగా ఉంది: సి.కల్యాణ్‌
సమావేశం అనంతరం నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ భరోసాతో తెలుగు చిత్రసీమ చాలా సంతోషంగా ఉందన్నారు. టికెట్‌ రేట్ల సవరణ, వంద శాతం ఆక్యుపెన్సీ, రోజుకు నాలుగు షోలు, విద్యుత్‌ బిల్లులు తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. సినీ పరిశ్రమలో పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని తామే కోరినట్టు చెప్పారు. 

థియేటర్‌ వ్యవస్థను ఆదుకోవాలని కోరాం..
మరో నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ.. ‘2006లో ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం ఐచ్చికంగా ఉండేది. ఇప్పుడు తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. పారదర్శకత కోసం గవర్నమెంట్‌ పోర్టల్‌ ఉండాలి. ఒకప్పుడు 1,800 థియేటర్లు ఉంటే ఇప్పుడు 1,200కు తగ్గిపోయాయి. వాటిలో ఐదారొందల థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. వాటిని విద్యుత్‌ టారిఫ్‌ సమస్య వేధిస్తోంది. జీతాలు, డీజిల్‌ రేట్లు పెరిగాయి. ఈ మేరకు రేట్లు సవరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా సానుకూల స్పందన లభించింది’ అన్నారు. నిర్మాత డీఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ సినీ పరిశమ్ర సమస్యలపై ప్రభుత్వ సానుకూల స్పందన తెలుగు చిత్రసీమకు ఊరటనిచ్చిందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top