
విజయనగరం: రామతీర్థంలో విజయసాయిరెడ్డి వాహనంపై దాడి కేసులో అరెస్ట్ అయిన ఏడుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు. నిందితులకు బెయిల్ లభిస్తే సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి వారికి బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కోర్టును కోరారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా కొందరిని విచారించాల్సి ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
కాగా, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రామతీర్ధం సందర్శన సందర్భంగా టీడీపీ, బీజేపీ శ్రేణులు ఆయన వాహనంపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేసిన ఘటనలో నెలిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితుల్లో ఒకరైన టీడీపీ నేత కళా వెంకటరావును అరెస్ట్ చేసి ఆతర్వాత విడుదల చేశారు. ఇదే కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా కళా వెంకటరావు ఉన్నారు.