సిఫార్సు వేరు.. ఆర్డర్‌ వేరు

ACB JD Ravikumar Comments On ESI Scam - Sakshi

అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఆర్డర్‌ ఇచ్చారు 

పితాని కుమారుడి కోసం గాలింపు కొనసాగుతోంది 

ఈఎస్‌ఐ కేసులో త్వరలోనే చార్జిషీటు: ఏసీబీ జేడీ రవికుమార్‌

సాక్షి, అమరావతి: ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు ఇవ్వడం వేరు, కచ్చితంగా చేయాలని ఆర్డర్‌ లెటరు ఇవ్వడం వేరు.. అని అవినీతి నిరోధక శాఖ సంయుక్త సంచాలకులు రవికుమార్‌ వెల్లడించారు. ఈఎస్‌ఐ స్కాములో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఫలానా కంపెనీకే ఇవ్వాలని ఆర్డర్‌ ఇచ్చారని, దీంతో మంత్రి, ఆయనతోపాటు ఆ సర్వీసు ప్రొవైడరూ ఇద్దరూ నిందితులేనన్నారు. టెలీహెల్త్‌ సర్వీసెస్‌కు సంబంధించి అచ్చెన్నాయుడు మొత్తం మూడు లేఖలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని ఏసీబీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఏమన్నారంటే... 

► మొత్తం రూ.975 కోట్ల కొనుగోళ్లలో రూ.150 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు నిర్ధారించాం. 
► రూ.లక్ష విలువ దాటితే ఈ–ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లాలి. కానీ, నామినేషన్‌ కింద ఇచ్చారు.
► కడప ప్రాంతీయ కార్యాలయం జాయింట్‌ డైరెక్టర్‌ జనార్దన్‌ ఇందులో కీలకపాత్ర పోషించారు. 
► అధిక ధరలతో బడ్జెట్‌కు మించి కొనుగోళ్లు జరిపారు. కొన్ని మందులు 140% ఎక్కువ రేటుకు కొన్నారు.
► డ్రగ్స్‌కు రూ.293.51 కోట్లు కొనుగోలు అవకాశం ఉండగా, రూ.698.36 కోట్లకు కొన్నారు.
► డిస్పెన్సరీల నుంచి ఇండెంట్‌లు లేకుండానే కొన్నారు. ఆ మందులు కూడా ఆస్పత్రులకు చేరలేదు.
► అమరావతి, తిరుమల వంటి మెడికల్‌ ఏజెన్సీలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చి ఆ తర్వాత మాయమయ్యాయి.
► ఈ కేసులో 12మందిని అరెస్టు చేశాం. మరో 8 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. మరో 5 మంది నిందితులను గుర్తించాం.  వారికోసం ఏసీబీ బృందాలు గాలింపు చేస్తున్నాయి. వీరిలో మాజీ మంత్రి పితాని కుమారుడు వెంకటసురేష్‌ కూడా ఉన్నారు.
► ఈ కేసుపై త్వరలోనే చార్జిషీట్‌ వెయ్యబోతున్నాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top