ప్రతి చిన్నారికీ ఆధార్‌ నమోదు తప్పనిసరి

Aadhaar registration is mandatory for every child - Sakshi

అధికారులకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశం

సాక్షి, అమరావతి: పుట్టిన ప్రతి చిన్నారికీ ఆధార్‌ నమోదు తప్పనిసరిగా చేయాలని, ఆస్పత్రిలో తల్లి డిశ్చార్జ్‌ అయ్యేలోగా ఇవన్నీ పూర్తి కావాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో జనన, మరణాల రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుమారు 24 విభాగాల అధికారులు పాల్గొన్నారు. గర్భిణి ఆస్పత్రిలో చేరి ప్రసవం పూర్తయ్యాక మూడు రోజుల్లో శిశువుకు ఆధార్‌ ఎన్‌రోల్‌ చేయాలని, అప్పటికి వేలిముద్రలు, కంటిపాప ముద్రల్లో స్పష్టత ఉండదు కాబట్టి.. ఐదేళ్లు పూర్తయ్యేలోగా వారిని తిరిగి రప్పించి వేలిముద్రలు, ఐరిస్‌ తీసుకుని ఆధార్‌ ఎన్‌రోల్‌ చేయాలని ఆదేశించారు.

శిశువుల జననాలతో పాటు, మరణాలనూ నమోదు చేయాలని, మృతికి గల కారణాలను పేర్కొనాలని సూచించారు. ఐదేళ్లు నిండేలోగా చిన్నారులకు శాశ్వత ఆధార్‌ కార్డు అందేలా చూడాలన్నారు. ఆస్పత్రుల్లో చిన్నారులు పుట్టగానే వారికి బర్త్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలని, డిశ్చార్జ్‌ అయ్యేలోగానే ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నారుల జనన ధ్రువీకరణ పత్రాలకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top