వేలానికి 5 వేల టన్నుల ఎర్ర చందనం 

5 thousand tons of red sandalwood for auction - Sakshi

ఫిబ్రవరిలో 300 టన్నులు వేలం.. రూ.175 కోట్ల ఆదాయం 

ఈసారి వేలంలో ఎక్కువ కంపెనీలు పాల్గొనేలా కసరత్తు 

ఇందుకోసం చైనాలో పర్యటించిన ఉన్నతాధికారులు 

వేలానికి ప్రణాళిక సిద్ధం 

సీఎం ఆమోదం లభిస్తే ఈ నెలాఖరు లేదా జూన్‌లో వేలం 

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం 5 వేల మెట్రిక్‌ టన్నుల ఎర్ర చందనం దుంగల్ని వేలం వేయనుంది. ఇటీవలే 300 టన్నులు వేలం వేసిన రాష్ట్ర ప్రభుత్వం రూ. 175 కోట్ల ఆదాయం పొందింది. ఇప్పుడు మరో 5 వేల టన్నులు వేలానికి సిద్ధం చేసింది. అక్రమ రవాణాదారుల నుంచి స్వాదీనం చేసుకున్న ఈ ఎర్ర చందనం నిల్వలను కేంద్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయనుంది.

స్మగ్లర్ల నుంచి స్వాదీనం చేసుకున్న ఎర్ర చందనం ఏ రాష్ట్రంలో ఎంత మేర ఉన్నాయో గుర్తించి దాన్నిబట్టి వేలం కోటాను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నిర్దేశిస్తుంది. అలా మన రాష్ట్రంలో ఉన్న 8 వేల మెట్రిక్‌ టన్నుల దుంగల వేలానికి పదేళ్ల క్రితం అనుమతి ఇ చ్చింది. అప్పటి నుంచి విడతలవారీగా వేలం వేస్తున్నారు. చివరగా 2021 సంవత్సరంలో అప్పటికి మిగిలిపోయిన 318 మెట్రిక్‌ టన్నుల దుంగల్ని ఆన్‌లైన్‌లో వేలం వేశారు.

ఆ తర్వాత పట్టుబడిన మరో 5,400 మెట్రిక్‌ టన్నుల దుంగలను తిరుపతిలోని అటవీ శాఖ సెంట్రల్‌ గోడౌన్‌లో భద్రపరిచారు. వీటి వేలానికి అనుమతి ఇవ్వాలని చాలా రోజులుగా రాష్ట్రం కోరుతోంది. గత డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా 13,301 మెట్రిక్‌ టన్నుల ఎర్ర చందనం వేలానికి కేంద్రం అనుమతి ఇ చ్చింది. అందులో ఏపీ నుంచే 5,376 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి. దీంతో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 300 టన్నులు ఆన్‌లైన్‌లో విక్రయించారు.

మిగిలిన నిల్వల్ని వెంటనే వేలం వేయాలని భావించినప్పటికీ, ఎర్ర చందనం మార్కెట్‌ అంతా చైనాదే కావడం, అక్కడ కరోనా తీవ్రంగా ఉండటంతో ముందడుగు పడలేదు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు కుదుటపడటంతో వేలానికి అధికారులు చర్యలు చేపట్టారు. 

చైనాలో అధ్యయనం చేసిన ఉన్నతాధికారులు 
ఈసారి వేలంలో చైనా కంపెనీలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చేయడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్, అటవీ దళాల అధిపతి, పీసీసీఎఫ్‌ మధుసూదన్‌రెడ్డి ఇతర అధికారుల బృందం ఇటీవలే చైనాలో పర్యటించింది.

అక్కడ ఎర్ర చందనానికి ఉన్న మార్కెట్, వ్యాపారులు, కంపెనీలు ఏం కోరుకుంటున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటే ఎక్కువ కంపెనీలు వేలంలో పాల్గొంటాయో అధ్యయనం చేసి ఈ బృందం ఒక ప్రణాళిక రూపొందించింది. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించి ఆయన ఆమోదం తర్వాత ఈ నెలాఖరు లేదా జూన్‌ మొదటి వారంలో వేలం ప్రక్రియ మొదలు పెట్టాలని భావిస్తున్నారు.

ఎంఎస్‌టీసీ ద్వారా దశలవారీగా అంతర్జాతీయ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. వేలం పూర్తయితే ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుందని పీసీసీఎఫ్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top