అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో తొలి విడత కింద గురువారం అనంతపురం, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 13 మండలాల్లో 210 గ్రామ పంచాయతీ సర్పంచ్, 1,836 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అధికారం కోసం ‘పచ్చ’ పార్టీ మరోమారు బరితెగించింది. ప్రశాంతంగా సాగాల్సిన ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడింది. పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చి వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దౌర్జన్యం చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని అనంతపురం రూరల్, రుద్రంపేట, రాజీవ్‌కాలనీ పంచాయతీల్లో అధికార పార్టీ అడుగడుగునా రగడకు దిగింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు అక్రమాలకు పాల్పడ్డారంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అనంతపురం రూరల్ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో నకిలీ ఓటరు కార్డులతో ఓట్లు వేసేందుకు కొందరు ప్రయత్నించగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు గుర్తించారు. దీంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి గొడవకు దిగారు. పోలింగ్ చివరి క్షణాల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
● రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాల పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు దగ్గరుండి సైక్లింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దౌర్జన్యానికి దిగారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాల్సిన చోట రాజకీయ బలప్రదర్శనకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
● రాజీవ్‌కాలనీలోనూ టీడీపీ శ్రేణులు హడావుడి చేశారు. పంచాయతీకి సంబంధం లేని నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడ తిష్టవేసి గొడవలకు ఆజ్యం పోశారు. టీడీపీకి చెందిన ఓ మహిళ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడిపై చేయి చేసుకోవడం అలజడి సృష్టించింది. పైగా పోలీసులతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు ఇబ్బందులు కల్గించారు. స్థానిక ఎన్నికల్లో స్థానికుల నిర్ణయమే కీలకం కావాల్సి ఉండగా, బయటి నాయకుల జోక్యంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రసన్నాయపల్లిలో హైటెన్షన్
రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లిలో ముందురోజే 200 బ్యాలెట్ పత్రాలు మాయమయ్యాయి. టీడీపీ వారే ఈ పని చేసినట్లు స్వతంత్ర అభ్యర్థి మహానందిరెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు ఉదయం నుంచే ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి మహానందిరెడ్డి, టీడీపీ బలపరిచిన అభ్యర్థి పంచగల శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దొంగ ఓట్లను అడ్డుకుంటే దాడులా?
అనంతపురం రూరల్ మండలం కురుగుంటలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకుని వెనక్కు పంపారు. కట్టకిందపల్లిలోనూ దొంగ ఓట్లను అడ్డుకునే క్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు భోనగిరి చంద్రశేఖర్‌రెడ్డిపై దాడి జరిగింది.
ఏజెంట్లపై ఉక్కుపాదం
రాప్తాడు మండలం బుక్కచెర్లలో మరో వివాదం తెరపైకి వచ్చింది. పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్న వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైఎస్సార్‌సీపీ నేతలపై లాఠీచార్జ్
ఆత్మకూరు మండలం బి.యాలేరులో ఉద్రికత్త చోటు చేసుకుంది. ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసుకోవడానికి ప్రయత్నించగా వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే అక్రమాలను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపైనే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో మాజీ ఎంపీటీసీ చిన్నాతో పాటు మరికొంత మందికి గాయాలయ్యాయి.
4 సార్లు రీకౌంటింగ్..
కంబదూరు మండలం తిమ్మాపురంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి గౌని రేణుక 23 ఓట్లతో గెలుపొందారు. అయితే టీడీపీ నాయకులు పట్టుబట్టి నాలుగుసార్లు రీకౌంటింగ్ చేయించారు. అంతే ఓట్లతో రేణుక గెలిచారు. కానీ అధికారులు డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు గంటపాటు ఆందోళనకు దిగారు. దీంతో చేసేదిలేక డిక్లరేషన్ ఇచ్చారు.
● బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర, పడమటికోడిపల్లి, సంతే కొండాపురం , కన్నేపల్లి పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలిచినప్పటికీ డిక్లరేషన్ ఇవ్వలేదు. పైగా కౌంటింగ్ కేంద్రాల్లో కరెంట్ సరఫరా నిలిపేసి టీడీపీ గూండాలు దౌర్జన్యాలకు దిగారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు , అభ్యర్థులపై కట్టెలతో దాడి చేశారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వీరంగం
పోలీసులపై ఒత్తిళ్లు.. ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై దౌర్జన్యాలు
దొంగ ఓట్ల కలకలం.. అడ్డుకున్న వారిపై దాడులు


