ఉసురు తీసిన ఆధిపత్య పోరు! | - | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన ఆధిపత్య పోరు!

Nov 27 2026 2:02 AM | Updated on Nov 27 2026 2:02 AM

నాయకుల రాజకీయ పంతాలు.. ఆధిపత్య పోరు.. చివరకు నలుగురి ప్రాణాలను బలిగొన్నాయి? ఓ నిశ్చితార్థ వేడుకలో ప్రతిపక్ష నేతల హాజరును జీర్ణించుకోలేక అధికార పార్టీ నేతలు చేసిన గొడవ.. తదుపరి పెళ్లి వేదిక స్వగ్రామం నుంచి సుదూర ప్రాంతం మార్పునకు దారి తీసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా బంధుమిత్రులు దూరప్రాంతానికి రాకపోకలు సాగించాల్సి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలను కబళించింది. రాజకీయ ఆధిపత్య పోరే ఈ విషాదానికి పరోక్ష కారణమైందంటూ చర్చ జరుగుతోంది.

తాడిపత్రి రూరల్‌ : యాడికి మండలం రాయలచెరువు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడటం బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. తాడిపత్రి మండలం కావేటిసముద్రం గ్రామానికి చెందిన సంజీవరెడ్డికి వ్యవసాయంతో పాటు కడపస్లాబ్‌ (బండల పాలిష్‌) యూనిట్‌ ఉంది. ఈయన సోదరుడు శ్రీరామిరెడ్డి తెలంగాణలోని తాండూరులో స్థిరపడ్డారు. అక్కడ రాజకీయంగా ప్రముఖ పాత్ర పోషిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉంటున్నారు. సంజీవరెడ్డిది పూర్వం నుంచి రాజకీయ కుటుంబం. ఆయనకు తాడిపత్రి ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీలోని ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయి. మూడు నెలల క్రితం కుమారుడు అరవింద్‌ వివాహ నిశ్చితార్థం కోసం తాడిపత్రిలోని ఓ ఫంక్షన్‌ హాలులో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆనందంగా సాగాల్సిన వేడుక టీడీపీ నాయకుల తీరుతో ఘర్షణ వాతావరణంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటన సంజీవరెడ్డిని బాగా కలచివేసింది. వివాహం ఇక్కడే జరిపించినా.. ఒకరిని పిలిచి.. మరొకరిని పిలవకపోయినా మరోసారి వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని భయపడి వివాహ వేదికను హైదరాబాద్‌కు మార్చారు. అత్యంత అప్తులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో బుధవారం రాత్రి కుమారుడి వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి హాజరై బంధువులు, సన్నిహితులు క్రూజర్‌ వాహనంలో కావేటిసముద్రం గ్రామానికి తిరుగు పయనమయ్యారు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో యాడికి మండలం రాయలచెరువు హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వద్ద రోడ్డుపై నిలబడి ఉన్న లారీ చలిమంచులో కనిపించకపోవడంతో క్రూజర్‌ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎడమ వైపున కూర్చున్న తాడిపత్రికి చెందిన సుమలత (50), మల్లికార్జునగుప్తా(53) దంపతులతోపాటు పెళ్లికొడుకు బంధువులు కావేటిసముద్రానికి చెందిన వీరాంజినేయరెడ్డి (50), హనుమంతరెడ్డి (48) దుర్మరణం చెందారు. ఇదే ప్రమాదంలో పవన్‌కుమార్‌రెడ్డి, శ్రీదేవి, హైమావతి, రామాంజనేయులురెడ్డి, మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో హనుమంతరెడ్డికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. వీరాంజనేయరెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

మిన్నంటిన ఆర్తనాదాలు

రోడ్డు ప్రమాదం అనంతరం నలుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, రాజకీయ నాయకులు, వారిమద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. విగతజీవులుగా పడి ఉన్న వారిని చూసి బంధువులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లిపోయింది.

అనాథలైన పిల్లలు

తాడిపత్రిలోని నందలపాడులో నివాసం ఉంటున్న మల్లికార్జున గుప్తా 40 ఏళ్లుగా సంజీవరెడ్డి కుటుంబానికి అత్యంత విశ్వాసంగా ఉంటున్నారు. సంజీవరెడ్డి తండ్రి కావేటిసముద్రం పుల్లారెడ్డికి చెందిన బండలపాలిష్‌ యూనిట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి కాలం నుంచి కుమారుడు సంజీవరెడ్డి వరకు ఆ కుటుంబానికి ఎంతో నమ్మకమైన వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో యజమాని కుమారుని వివాహానికి భార్య సుమలతతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గుప్తా దంపతులకు పెళ్లీడుకొచ్చిన, బీటెక్‌ చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రుల హఠాన్మరణంతో ఇద్దరమ్మాయిలు అనాథలుగా మారిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.

అధికార పార్టీ నేతల తీరుతో పెళ్లి వేదిక మార్పు

సుదూర ప్రాంతం నుంచి రాకపోకలు సాగించే క్రమంలో రోడ్డు ప్రమాదం

నలుగురు బంధుమిత్రుల మరణంతో తాడిపత్రి ప్రాంతంలో తీవ్ర విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement