● ఆందోళనలో 4 నియోజకవర్గాల రైతాంగం
కూడేరు: ఈసారి పీఏబీఆర్ డ్యాం నుంచి ధర్మవరం కుడి కాలువకు నీటి విడుదల లేనట్టేనని తెలుస్తోంది. ప్రస్తుతం పీఏబీఆర్‌కు ఇన్‌ఫ్లో ఏమీలేకపోగా తాగునీటి ప్రాజెక్టులకు, నీటి ఆవిరి, లీకేజీ రూపంలో రోజుకు సుమారు 110 క్యూసెక్కుల వరకు అవుట్ ఫ్లో ఉంది. గురువారం నాటికి డ్యాంలో 4.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న తీవ్ర వర్షాభావం దృష్ట్యా భవిష్యత్‌లో తాగునీటి సరఫరాకు కొరత లేకుండా ఉండేందుకు ముందు చూపుతో అధికారులు డ్యాంలో నీటిని నిల్వవుంచే అవకాశముంది. దీంతో ధర్మవరం కుడి కాలువకు నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారనుంది. 112 కిలోమీటర్లు పొడవు ఉన్న కుడి కాలువ కింద ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల పరిధిలోని 49 చెరువులున్నాయి. కుడి కాలువ ద్వారా చెరువులు నింపితే వ్యవసాయ బోర్లలో నీరు పెరిగి రైతులు పంటలు సాగు చేసుకోవడానికి అవకాశముంటుంది. కనీసం నెల రోజులైన కుడి కాలువకు నీరివ్వాలని నాలుగు నియోజకవర్గాల పరిధిలోని రైతులు కోరుతున్నారు.
‘మిరప’కు దొంగల బెడద
● కోనాపురం, హనిమరెడ్డిపల్లి గ్రామాల్లో దొంగల దాడి
బెళుగుప్ప: మండల పరిధిలోని గ్రామాల్లో సాగు చేసిన బ్యాడిగ రకం మిరప తోటలకు దొంగల బెడద పట్టుకుంది. రెండు వారాల్లోనే కోనాపురం గ్రామ రైతులు బయన్న, ఎర్రెమ్మ, యుగంధర్‌లు సాగు చేసిన మిరప తోటలో రాత్రిళ్లు దొంగలు పడి మిరపను దోచుకెళ్లారు. రెవెన్యూ పొలం కళ్యాణదుర్గం పరిధిలోకి రావడంతో ఘటనపై కళ్యాణదుర్గం పోలీసులకు సైతం బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి మండల పరిధిలోని హనిమరెడ్డిపల్లికి చెందిన రైతు బ్రహ్మయ్య దొంగల బెడదతో రాత్రిపూట మిరప తోటలోనే నిద్రిస్తున్నాడు. మిరప దొంగలు తోటలోకి మరోవైపు నుంచి ప్రవేశించి పంటను దొంగలించారు. రాత్రిళ్లు తోటలో హడావుడికి నిద్రలేచిన రైతు బ్రహ్మయ్య కేకలు వేయడంతో దొంగలు ఆటోలో పారిపోగా, ఓ వృద్ధుడుని గ్రామస్తులతో కలిసి పట్టుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని రైతులు పోలీసులను కోరుతున్నారు.
గౌరమ్మ జాతరకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
● బైకును ఢీకొన్న కారు
● ముగ్గురికి తీవ్ర గాయాలు
విడపనకల్లు: కారు బైకును ఢీ కొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. రామకృష్ణ తన భార్య అరుణ, కుమార్తె పద్మతో కలిసి వి.కొత్తకోట నుంచి విడపనకల్లులో జరుగుతున్న గౌరమ్మ జాతరకు వెళ్తున్నారు. విడపనకల్లు నుంచి బోయ సోము కారులో వి.కొత్తకోటకు వెళ్తుండగా మార్గమధ్యంలోకి రాగానే బైక్‌ను ముందు నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో బోయ రామకృష్ణకు కాలు విరిగి తీవ్రంగా గాయపడగా మూడేళ్ల కుమార్తె పద్మ తలకు బలమైన గాయమైంది. అలానే రామకృష్ణ భార్య అరుణకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి తీసుకెళ్లారు.


