‘అధికార’ దాష్టీకాలపై ఓటెత్తిన జనం | - | Sakshi
Sakshi News home page

‘అధికార’ దాష్టీకాలపై ఓటెత్తిన జనం

Nov 27 2026 2:02 AM | Updated on Nov 27 2026 2:02 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: అధికారం అండగా ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎన్ని కుయుక్తులు పన్నినా.. ఓటరు తీర్పును మాత్రం అడ్డుకోలేకపోయారు. అధికార కూటమి నేతల ఒత్తిళ్లు, బెదిరింపులు, కౌంటింగ్‌ సమయంలో ఆటంకాలు, పదేపదే రీకౌంటింగ్‌లతో అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేసినా గ్రామీణ ప్రజలు మాత్రం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకే జై కొట్టారు. జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార కూటమికి గట్టి షాక్‌ ఇచ్చాయి. మరో రెండేళ్లకు పైగా అధికారం ఉన్నప్పటికీ ప్రతిపక్ష అభ్యర్థుల వైపు గ్రామీణ ఓటర్లు మొగ్గుచూపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

81.24 శాతం పోలింగ్‌

13 మండలాల పరిధిలో ఏకగ్రీవాలు మినహా 210 సర్పంచ్‌ స్థానాలు, 1,836 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 5,58,847 మంది ఓటర్లకు గాను 4,53,989 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81.24 శాతం పోలింగ్‌ నమోదైంది. కళ్యాణదుర్గంలో అత్యధికంగా 88.19 శాతం, ఆత్మకూరులో 86.32 శాతం, శెట్టూరులో 86.33 శాతం, బ్రహ్మసముద్రంలో 85.55 శాతం, డి.హీరేహాల్‌లో 85.18 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఓటు వేశారు.

కౌంటింగ్‌లోనూ అడ్డంకుల పర్వం

నామినేషన్ల అడ్డగింతలు, నామినేషన్‌ పత్రాల చించివేతలు, స్క్రూటినీలో తొలగింపులు, పోలింగ్‌ రోజు అక్రమాలు.. ఇలా పలు దశల్లో ప్రతిపక్ష అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక కౌంటింగ్‌ సమయంలోనూ అదే పరిస్థితి కొనసాగింది. స్పష్టమైన మెజార్టీ సాధించిన అభ్యర్థులకు సైతం డిక్లరేషన్‌ ఇవ్వకుండా రీకౌంటింగ్‌ల పేరుతో వేధించారు.

వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల హవా

అనంతపురం రూరల్‌ మండలంలో 13 చోట్ల వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. కురుగుంటలో మాధవరెడ్డి 300కు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచినా డిక్లరేషన్‌ ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేశారు. రెండుసార్లు రీకౌంటింగ్‌ నిర్వహించినా ఆయనకే స్పష్టమైన ఆధిక్యం రావడం గమనార్హం. కందుకూరులో వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం మద్దతుతో పోటీ చేసిన చిరుతల నాగమణి 414 ఓట్ల మెజార్టీ సాధించారు. అయితే కౌంటింగ్‌ను పలుమార్లు నిలిపివేయడంతో రాత్రి 11 గంటల వరకు ఫలితం వెల్లడికాలేదు. రాప్తాడు మండలంలో ఆరు చోట్ల, ఆత్మకూరు మండలంలో ఆరు చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయ ఢంకా మోగించారు. మరికొన్ని స్థానాల ఫలితాలు అర్ధరాత్రి వరకు పెండింగ్‌లో ఉండటం కౌంటింగ్‌ ప్రక్రియపై అనుమానాలకు తావిచ్చింది. కళ్యాణదుర్గం మండలంలో రెండు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలుపొందగా, మరో ఆరు స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. కుందుర్పిలో రెండు చోట్ల విజయం సాధించడంతో పాటు మరో నాలుగు స్థానాల్లో ఆధిక్యం కనిపించింది. శెట్టూరులో రెండు స్థానాల్లో గెలిచి, మరో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కంబదూరులో మూడు చోట్ల విజయం సాధించి, మరో నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచారు. అయినప్పటికీ పలు చోట్ల డిక్లరేషన్ల విషయంలో జాప్యం చేశారు.

● బొమ్మనహాల్‌లో ఆరు చోట్ల, డి.హీరేహాల్‌లో నాలుగు చోట్ల, కనేకల్లులో నాలుగు చోట్ల, రాయదుర్గంలో తొమ్మిది చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. రాయదుర్గం మండలం బొందనహాల్‌లో 325 ఓట్ల మెజార్టీ ఉన్నప్పటికీ రీకౌంటింగ్‌ పేరుతో ఇబ్బందులు సృష్టించారు. గుమ్మఘట్టలో మూడు చోట్ల, బ్రహ్మసముద్రంలో రెండు చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గెలుపొందారు.

రాప్తాడు మండలం చిన్మయ నగర్‌లో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న జనం

అనంతపురం రూరల్‌ కట్టకిందపల్లిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల సంబరాలు

అధికారంలో ఉన్నా ప్రజల మనసు గెలవలేకపోయారు!

ఎన్నికల ప్రక్రియలో అధికార బలాన్ని ఉపయోగించారన్న విమర్శలు, కౌంటింగ్‌ వివాదాలు ఒకవైపు ఉండగా.. మరోవైపు గ్రామీణ ఓటర్లు ఇచ్చిన తీర్పు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ కూటమికి అధికారం చేతిలో ఉన్నా ప్రజల మద్దతు సంపాదించలేకపోతే ఫలితం ఎలా ఉంటుందో ఈ ఎన్నికలు మరోసారి చాటిచెప్పాయి. అడ్డంకులు ఎన్ని ఎదురైనా తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటేసిన గ్రామీణ ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు.

అడ్డంకులు.. బెదిరింపులు.. రీకౌంటింగ్‌తో వేధింపులు..

అయినా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకే గ్రామీణ ప్రజల పట్టం

13 మండలాల్లో కూటమికి గట్టి షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement