అనంతపురం న్యూ టౌన్: జిల్లాలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చునని.. ఎప్పుడొచ్చినా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ విజయలక్ష్మి ఎంపీడీఓలను ఆదేశించారు. జెడ్పీ మీటింగ్ హాలులో శనివారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సీఈఓ మాట్లాడుతూ తాము సరఫరా చేసే ఎన్నికల సామగ్రిని ఆయా మండల కేంద్రాలలో జాగ్రత్తగా నిల్వచేసి ఉంచాలన్నారు. బ్యాలెట్ బాక్స్‌ల నవీనీకరణ చేయించి ఉంచాలని, ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో తాము ఇదివరకే సిఫారసు చేసిన విధంగా బ్యాలెట్ బాక్స్‌లను తెప్పించుకోవాల్సిన బాధ్యత ఎంపీడీఓలదేనని గుర్తు చేశారు. ఎంపీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల ప్రక్రియను ఆయా ఆర్డీఓల సమన్వయంతో పూర్తిచేసి తమకు పంపాలన్నారు. కలెక్టర్ ఆమోదంతో రిజర్వేషన్ల వివరాలను వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధికారులు, అనంతపురం, కళ్యాణదుర్గం డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు (డీడీఓ), జిల్లా పరిషత్ అధికారులు పాల్గొన్నారు.
‘స్థానిక’ రిజర్వేషన్లపై జీఓ జారీ
అనంతపురం న్యూ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికలకు మరో అడ్డంకి తొలగింది. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లపై ప్రభుత్వం శనివారం రాత్రి అత్యంత కీలకమైన జీఓ 17ను విడుదల చేసింది. ఏ స్థానిక సంస్థలో అయినా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు కలిపి 50 శాతం దాటకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది సుప్రీంకోర్టు మూడు అంశాల పరీక్ష నిబంధన ప్రకారం తప్పనిసరి. జనాభా లెక్కల్లో వెనుకబడిన తరగతుల జనాభా లెక్కలు లేనందున, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. విశ్రాంత అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతత్వంలోని ప్రత్యేక కమిషన్ ఈ లెక్కలను సిఫార్సు చేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఈ ఉత్తర్వును జారీ చేశారు. ఈ ఉత్తర్వు ఆధారంగా పంచాయతీరాజ్, పురపాలక శాఖలు ప్రతి జిల్లా, మండలం, మున్సిపాలిటీ వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటన విడుదల చేయనున్నాయి.
పారదర్శకత పాటించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను ప్రభుత్వ నిబంధనలు, ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) టి.నాగరాజనాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలకు రిజర్వేషన్ల ఖరారుపై దిశానిర్దేశం చేశారు.
రేపటి నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని షాదీఖానాలో సోమవారం నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు సీఐడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం లేపాక్షి, రొద్దం, మంగళవారం బొమ్మనహాళ్, కంబదూరు, బుధవారం కూడేరు, ఓబుళదేవర చెరువు, గురువారం సోమందేపల్లి, శుక్రవారం డి.హీరేహాళ్, శనివారం బ్రహ్మసముద్రం మండలాల్లోని అగ్రిగోల్డ్ బాధితుల బాండ్లను పరిశీలించనున్నట్లు వెల్లడించారు.


