ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర విఘాతం | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర విఘాతం

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

● తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలి

అనంతపురం : భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర విఘాతమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ అన్నారు. ఓటు చోరీపై కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగాను, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం అనంతపురంలో ఆందోళనలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో టవర్‌క్లాక్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల వ్యవస్థే అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించిందనే ఫిర్యాదులు ఎదుర్కొంటే... వాటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. అనంతరం సప్తగిరి సర్కిల్‌లో మానవహారం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్‌, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, సీపీఎం జిల్లా నాయకులు నాగేంద్రకుమార్‌, రామిరెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు దాదాగాంధీ, యూజేఏసీ కన్వీనర్‌ సి.జాఫర్‌, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్‌ కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, బాబాషా, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొఘల్‌ సైఫుల్లా బేగ్‌, మాజీ మేయర్‌ వసీం, ఎస్‌ఈసీ సభ్యులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ గౌడ్‌, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్‌ వాసంతి, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement