గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ కానుకల ద్వారా రూ. 80,70,750 ఆదాయం వచ్చిందని ఈఓ మేడేపల్లి విజయరాజు తెలిపారు. మంగళ వారం హుండీ కానుకలు లెక్కించారు. 68 రోజులకు గాను రూ.80,70,750 నగదుతో పాటు 6.5 గ్రాముల బంగారు, 750 గ్రాముల వెండిని భక్తులు స్వామివారికి సమర్పించినట్లు తెలియజేశారు. లెక్కింపు కార్యక్రమంలో గ్రామ ప్రజలు, బళ్లారి వీరభద్ర సేవా సమితి సభ్యులు, గుంతకల్లు హనుమాన్ సేవా సమితి సభ్యులు, కర్నూలు బాలాజీ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అధికారులు, ఇతర సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
‘ఉపాధి’లో అక్రమాలు● సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోన్‌పే స్క్రీన్‌షాట్లు
బుక్కరాయసముద్రం: ఉపాధి హామీలో అక్రమాలు జరిగాయంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. అక్రమాలకు ఇవిగో ఆధారమంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఫోన్‌పే స్క్రీన్‌షాట్లు కలకలం రేపుతున్నాయి. అందులోని వివరాలిలా ఉన్నాయి. మండలంలో 19 గ్రామపంచాయతీలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ పనులన్నీ టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. గ్రామాల్లో పనులు చేయకుండానే చేసినట్లు ఫొటోలు అప్‌లోడ్ చేసి బిల్లులు డ్రా చేసుకుంటున్నారని, ఇందుకు గాను కొంతమొత్తం మండల స్థాయి అధికారికి ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే అధికారికి ఫోన్‌పే ద్వారా పంపిన స్క్రీన్ షాట్లను మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అక్రమార్కులు తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకే ఇలా స్క్రీన్‌షాట్లు పెట్టారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దుష్ప్రచారం చేస్తున్నారు
ఫోన్ పే స్క్రీన్‌షాట్లను సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై ఉపాధి హామీ ఏపీఓ సుజాత స్పందించారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు తనపై కక్ష కట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆఫీస్‌కు సంబంధించిన లావాదీవీలను ఉపాధి పథకంలో అక్రమాలు జరిగాయని చెప్పడం దారుణమన్నారు.
వ్యవసాయ శాఖలో
సర్వర్ సతాయింపు
● విత్తన పప్పుశనగ, ఈ–క్రాప్, ఈ–కేవైసీకి రైతులకు ఇబ్బంది
అనంతపురం అగ్రికల్చర్: సర్వర్ సతాయిస్తుండటంతో వ్యవసాయశాఖ యాప్‌లు సక్రమంగా పనిచేయడం లేదు. తరచూ సాంకేతిక సమస్య తలెత్తుండటంతో అటు ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరకు అర్థరాత్రి సమయాల్లో యాప్ ఓపెన్ చేస్తున్నా మొండికేస్తున్నట్లు వాపోతున్నారు. ఉన్నతాధికారులు విధిస్తున్న టార్గెట్లు చేయలేక ఆర్‌ఎస్‌కే సిబ్బంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదే సందర్భంలో రైతులు కూడా గంటల కొద్దీ వేచిచూసి పనికాక విసిగిపోతున్నారు. ఖరీఫ్ ఈ–క్రాప్, ఈ–కేవైసీ, పీఎం కిసాన్‌కు ఈ–కేవైసీ, ఫార్మర్ రిజిస్ట్రీ లాంటి వాటితో పాటు తాజాగా రబీ రైతులు విత్తన పప్పుశనగ రిజిస్ట్రేషన్ల కోసం అవస్థలు పడుతున్నారు. గత 15 రోజులుగా సర్వర్ మొరాయిస్తుండటం, గత రెండు రోజులుగా విత్తన రిజిస్ట్రేషన్లు మొదలు కావడంతో సమస్య మరింత తీవ్రమైనట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. తాడిపత్రి, పుట్లూరు, ఉరవకొండ, వజ్రకరూరు, బెళుగుప్ప, యల్లనూరు, కణేకల్లు తదితర ప్రాంతాల్లో విత్తనం కోసం రైతులు వస్తున్నా రిజిస్ట్రేషన్లు కావడం లేదని తెలుస్తోంది. రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందంటూ ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


