రాయదుర్గంటౌన్: తాగునీటి సమస్యపై కాలనీ వాసులు మున్సిపల్ అధికారులను నిలదీశారు. పట్టణంలోని 17వ వార్డు గొగ్గిరొట్టి ఏరియాలో 10 రోజుల నుంచి తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం వార్డులో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి, డీఈ సురేష్‌ను మహిళలు చుట్టుముట్టారు. ఐదు రోజులకొకసారి అదీ అర్ధరాత్రిపూట గంట సేపు నీరు వదులుతుండటంతో ఎవ్వరూ పట్టుకోలేకపోతున్నామన్నారు. ఎప్పుడు వదులుతారో సమాచారం కూడా ఇవ్వకపోతే నిద్రమానుకుని ఎదురుచూడాలా అని మండిపడ్డారు. పది రోజులుగా నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. లైన్‌మన్ నీరు సరిగా వదలడం లేదని ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందిస్తూ తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.


