యల్లనూరు: పిడుగుపాటుకు గురై విద్యుత్ ఆపరేటర్ మృతి చెందాడు. తాడిపత్రికి చెందిన చరణ్ (35) పుట్లూరు మండలం కోమటికుంట్లలో అవుట్ సోర్సింగ్ కింద షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని తన బంధువు దేవానంద్‌తో కలిసి తాడిపత్రికి బైక్‌పై బయల్దేరారు. ఉన్నఫళంగా గాలీవాన మొదలవడంతో గాండ్లపాడు గ్రామ శివారులో ఆగి.. ఓ చెట్టు కిందకు చేరుకున్నారు. అయితే అదే సమయంలో వారున్న చెట్టుపై పిడుగుపడింది. దీని ప్రభావంతో చరణ్ జేబులోని సెల్‌ఫోన్ పేలింది. షాక్‌కు గురై స్పృహ కోల్పోయాడు. కొన్ని అడుగుల దూరంలో ఉన్న దేవానంద్ ఉలిక్కిపడ్డాడు. వెంటనే 108కు ఫోన్ చేసి సమాచారమందించాడు. వారు వచ్చి చరణ్‌ను తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చరణ్‌కు భార్య ఉంది.


