బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని కేజీబీవీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. పదో తరగతి విద్యార్థినులు అమృతవర్షిణి, మరొక విద్యార్థిని మధ్య దుస్తుల విషయంలో గొడవపడ్డారు. మాటామాటా పెరిగి అమృత వర్షిణి ఆవేశంగా బాత్‌రూమ్‌లోనికి వెళ్లి ఫినాయిల్ తాగింది. తోటి విద్యార్థుల ద్వారా సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన అమృతవర్షిణిని 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అమ్మాయి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎంఈఓ నవీద, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, జీసీడీఓ కవిత ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినిని పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు.
14, 15 తేదీల్లో
పెన్షన్, జీపీఎఫ్ అదాలత్
అనంతపురం అర్బన్: రాష్ట్ర ప్రధాన అకౌంటెంట్ జనరల్ (అకౌంట్స్ అండ్ ఎన్‌టైటిల్‌మెంట్) కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆ శాఖ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ తెలిపారు. అనంత పురం, శ్రీసత్యసాయి జిల్లాలకు సంబంధించి అదాలత్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెన్షన్, జీపీఎఫ్, ఉద్యోగ విరమణ సేవలు, తదితర వాటికి సంబంధించి తక్షణ మార్గదర్శకత్వం, ఫిర్యాదుల పరిష్కారం, మద్దతును అందించడం, పెన్షన్, జీపీఎఫ్ సేవల అందజేతను సరళతరం చేయడం, ఈ పౌర– కేంద్రీకృత కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో మెరుగైన సమన్వయం, డిజిటల్ గవర్నెన్స్ కార్యక్రమాల ద్వారా ఉద్యోగ విరమణ ప్రయోజనాలను సకాలంలో ప్రాసెసింగ్‌ను కూడా అదాలత్ ప్రోత్సహిస్తుందన్నారు. కార్యాలయ సీనియర్ అధికారులు, పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, డీడీఓలు, పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీల (పీఎస్‌ఏ)తో నేరుగా మాట్లాడి పెన్షన్, జీపీఎఫ్‌కు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ముంబై – చైన్నె బీచ్ మధ్య ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
గుంతకల్లు: దసరా, దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి ముంబై–చైన్నెబీచ్ మధ్య ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపనున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. ముంబై జంక్షన్ నుంచి ప్రతి బుధవారం అర్ధరాత్రి 12.35 గంటలకు స్పెషల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు (01015) బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30 గంటలకు చైన్నె బీచ్‌కు చేరుతుందని పేర్కొన్నారు. ఈ రైలు ఈ నెల 14 నుంచి నవంబర్ 18 వతేదీ వరకు దాదాపు 6 సర్వీసులు మాత్రమే నడుపుతున్నట్లు వెల్లడించారు. 15వ తేదీ (గురువారం) తెల్లవారుజూమున 4.00 గంటలకు చైన్నె బీచ్ స్టేషన్ నుంచి స్పెషల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (01016) బయలుదేరి ముంబై జంక్షన్‌కు శుక్రవారం తెల్లవారుజూమున 4.05 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ రైళ్లు దాదర్, థానే, కళ్యాణ్, లోనవాల, పుణే, దౌండ్, కుర్దువాడి, షోలాపూర్, కలబురిగి, వాడి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, అరక్కోణం, పెరంబూర్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు.


