అనంతపురం/ పామిడి: గుంతకల్లు నియోజకవర్గంలో ముసుగులు ధరించి దాడులు చేసే కొత్త సంస్కృతికి తెర తీశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఓటమి భయంతోనే అధికార పార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం రాత్రి పామిడిలో ముసుగు ధరించిన వ్యక్తుల చేతిలో దాడికి గురై అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు మారెపరెడ్డి గారి మహేశ్వర్‌రెడ్డిని సోమవారం ఎమ్మెల్సీ శివరామి రెడ్డి, గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డితో కలిసి అనంత పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. దాడి ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రెడ్‌బుక్‌ను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులపై భౌతికదాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. వారి వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చుక్కలూరు దిలీప్‌రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి, మాజీ ఎంపీపీ కె.నారాయణరెడ్డి, పట్టణ, రూరల్ కన్వీనర్లు నాగూరు ఈశ్వర్‌రెడ్డి, రమావత్ రామకృష్ణనాయక్ తదితరులు ఉన్నారు.
నిందితులను అరెస్టు చేయండి..
పామిడిలో వైఎస్సార్‌సీపీ నేత మహేశ్వరరెడ్డిపై దాడిచేసిన నిందితులను అరెస్టు చేయాలని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వారు వైఎస్సార్‌సీపీ నాయకులతో పామిడి పోలీస్‌స్టేషన్‌లో సీఐ శివశంకర్‌నాయక్‌ను కలిశారు. ఇటీవల కాలంలో రౌడీమూకలు, మందుబాబుల వీరంగంతో ప్రజాశాంతికి తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ నాయకుడు మహేశ్వర్‌రెడ్డిపై దాడి, గతంలో పి.కొండాపురం నాయకుడు విభూది కాశీమ్‌పై జరిగిన దాడి రౌడీరాజ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. అరాచకాలను కట్టడి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎప్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చుక్కలూరు దిలీప్‌రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి, మాజీ ఎంపీపీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం


