అనంతపురం క్రైం: మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా చేపట్టాలని సీడీఎంఏ పి.సంపత్‌కుమార్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అనంతపురం రీజియన్ పరిధిలోని మున్సిపల్ కమిషనర్లతో సోమవారం ప్రైవేట్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఎన్నికల సన్నద్ధత, నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల నియమావళి, బ్యాలెట్ పద్ధతిపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో మేయర్‌ను ప్రజలు నేరుగా ఎన్నుకునే విధానం అమల్లోకి వచ్చిందని, దీనిపై అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగనున్నందున బ్యాలెట్ బాక్సులు, పేపర్లు, ఎన్నికల సామగ్రి భద్రత, స్ట్రాంగ్‌రూమ్‌లు, పోలింగ్ కేంద్రాల నిర్వహణ తదితర వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా పొరపాటు లేదా సమస్యను గుర్తించిన వెంటనే స్పందించి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన, అభ్యర్థుల అర్హతలు, ప్రతిపాదకుల వివరాలు, డిపాజిట్లు, అఫిడవిట్లు, రిజర్వేషన్లకు సంబంధించిన ధ్రువపత్రాలు తదితర అంశాల్లో చిన్న పొరపాటుకూ అవకాశం ఇవ్వొద్దని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో తప్పిదాలు జరిగితే వాటి ప్రభావం పరిపాలనా అంశాలతో పాటు 15వ, 16వ ఆర్థిక సంఘ నిధులు, తదుపరి ఆర్థిక కార్యకలాపాలపైనా పడే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో తిరుపతి కమిషనర్ జయకృష్ణ, అదనపు డైరెక్టర్లు రవీంద్రబాబు, విశ్వనాథ్, కర్నూలు కమిషనర్ చల్లా ఓబులేసుతో పాటు 42 మంది కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సీడీఎంఏ సంపత్‌కుమార్


