అనంతపురం అర్బన్: తమ సమస్యలు పరిష్కరించండి అంటూ సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్ ఆనంద్‌తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్‌కుమార్, డీఆర్‌ఓ మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, రమేష్‌రెడ్డి, కిరణ్మయి ప్రజల నుంచి వివిధ సమస్యలపై 471 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 276, ఇతర సమస్యలపై 195 అర్జీలు ఉన్నాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీని ఏ దశలో నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.


