తిరగని బస్సులు.. తప్పని తిప్పలు | - | Sakshi
Sakshi News home page

తిరగని బస్సులు.. తప్పని తిప్పలు

Oct 6 2026 1:30 AM | Updated on Oct 6 2026 1:30 AM

ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో గ్రామీణులకు అవస్థలు తప్పడం లేదు. ముఖ్యంగా విద్యార్థులు బడికి వెళ్లాలంటే ప్రాణాలకు తెగించి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ఫుట్‌బోర్డులు, బస్సుల టాప్‌ మీద ప్రమాదకరరీతిలో వారి పాఠశాలలకు చేరుకుంటున్నారు. బస్సులు లేక చాలా మంది విద్యార్థులు నడుచుకుంటూనే వెళ్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి.

బొమ్మనహాళ్‌: బొమ్మనహాళ్‌, కణేకల్లు మండలాల్లో కళాశాల, ఉన్నత పాఠశాలల వేళకు సరిగా బస్సులు రాక గ్రామీణ విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కళ్యాణదుర్గం, కణేకల్లు క్రాస్‌, బొమ్మనహాళ్‌ మీదుగా బళ్లారి తిరిగే బస్సులను తరచూ రద్దు చేయడం వల్ల ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు గంటల తరబడి వేచి ఉంటున్నారు. సాయంత్రం స్టేజ్‌ వద్ద బస్సు దిగి మూడు, నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాలంటే చీకట్లో రాత్రి 7.30 గంటలకు ఇళ్లకు చేరుకోవాల్సి వస్తోంది. సాయంత్రం వేళల్లో ఉంతకల్లు క్రాస్‌ వద్ద కొన్ని బస్సులు ఆపకపోవడం, ఆలస్యంగా రావడం వల్ల గ్రామీణ విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆటో, ట్రాక్టర్లలో వెళ్లాల్సి వస్తోంది.

బొమ్మనహాళ్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు మండలంలోని ఉద్దేహాళ్‌, శ్రీధరఘట్ట, తిమ్మలాపురం, కొలగానహళ్లి, ఉప్పరహాళ్‌, సింగానహళ్లి, ఎల్‌బీ నగర్‌, గోనేహాళ్‌, లింగదహాళ్‌, బండూరు తదితర గ్రామాల నుంచి 300 మంది విద్యార్థ్ధులు వస్తుంటారు. కళాశాలకు వెళ్లేందుకు విద్యార్ధులు బస్సు పాసులు కట్టారు, కానీ కళ్యాణదుర్గం, రాయదుర్గం డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు ఒక్కటి కూడా ఆపడం లేదు. బళ్లారి నుంచి కళ్యాణదుర్గం, రాయదుర్గంకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికులు నిండుగా ఉన్నారంటూ కళాశాల వద్ద ఉంతకల్లు క్రాస్‌లో బస్సులు ఆపకుండా వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని ఇటీవల రోడ్డుపై ఆందోళన చేసినా, ఎమ్మెల్యే, అధికారులకు ఫిర్యాదు చేసినా తమబాధలు పట్టించుకునే వారే లేరని విద్యార్థులు వాపోతున్నారు.

● దర్గాహొన్నూరు నుంచి కణేకల్లుకు వెళ్లే బస్సు ఉదయం 7 గంటలకే బయలుదేరి కణేకల్లు చేరడంతో బస్సు తప్పిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు.

● గోవిందవాడ, బొల్లనగుడ్డం, దర్గాహొన్నూరు గ్రామాల నుంచి కూడా ఉరవకొండ కళాశాలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు.

● నేమకల్లు, గోవిందవాడ, బొల్లనగుడ్డం, కొలగానహళ్లి, కొత్తూరు, ఏళంజి గ్రామాలకు చెందిన విద్యార్ధులు బస్సు లేక పదో తరగతికే విద్యను మానేస్తున్నారు.

● గొడిశలపల్లి, ఏళంజి, కొలగానహాళ్లి, ఉంతకల్లు, హులికేర, రచ్చమర్రి, ఆదిగానపల్లి, హరేసముద్రం గ్రామాలకు వెళ్లే బస్సులను రద్దు చేయడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.

అరకొర బస్సులతో

నరకంగా ప్రయాణం

బడికెళ్లడానికి ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్న విద్యార్థులు

పట్టించుకోని పాలకులు

విద్యార్ధుల ఇబ్బందులు

పాసులిచ్చినా వృథానే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement