ఉరవకొండ: పట్టణంలోని షిర్డిసాయి నగర్‌లో నివాసముంటున్న బ్యాంకు ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. సీఐ మహానంది వివరాలమేరకు... ఉరవకొండ ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న రవి ఆదివారం తన సొంత ఊరు నల్లమాడ వెళ్లేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లాడు. తిరిగి సోమవారం ఉరవకొండకు చేరుకొని ఇంటి తాళాలు తెరిచేందుకు వెళ్లగా అప్పటికే తాళాలు ధ్వంసం చేసి ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో భద్రపరచిన రూ.10 వేల నగదు, రెండు బంగారు ఉంగరాలు, 10 తులాల వెండి దొంగలు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీంతో వెళ్లి పరిశీలించామని సీఐ పేర్కొన్నారు.
మందుల కొనుగోలుకొచ్చి దొంగతనం
● రూ.1.8 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగ
బెళుగుప్ప: మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే ఉన్న సంకల్ప్ ఫర్టిలైజర్ రిటైల్ దుకాణంలో సోమవారం పట్టపగలే దొంగలు హల్‌చల్ చేశారు. సంకల్ప్ ఏరియా మేనేజర్ నరసింహులు, స్టోర్ మేనేజర్ నాగరాజు వివరాలమేరకు... ఓ గుర్తుతెలియని వ్యక్తి తనకు మందులు కావాలని వచ్చి మేనేజర్, క్యాషియర్ కదలికలపై నిఘా ఉంచాడు. తమ బంధువులు కొనుగోలుకు వస్తున్నారని స్టోర్‌లో గంటపైగానే తిష్టవేశాడు. ఇదే సమయంలో క్యాషియర్ భోజనానికి వెళ్లగా.. స్టోర్ మేనేజర్ బాత్‌రూంకు వెళ్లాడు. దీంతో నకిలీ తాళంతో క్యాష్ కౌంటర్ తాళాలు తెరచిన దుండగుడు సుమారు రూ.1.8 లక్షల నగదును అపహరించుకెళ్లాడు. ఈ ఘటన మండల కేంద్రంలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు రహదారుల్లోని సీసీ కెమెరాలు, స్టోర్ కంప్యూటర్‌లో నిక్షిప్తమైన వివరాలపై ఆరా తీస్తూ విచారణ చేపట్టారు. అయితే పట్టపగలే చోరీ ఘటనపై పలు అనుమానాలకు తావిస్తోంది.
అంతర్ కళాశాలల
క్రీడా పోటీలు ప్రారంభం
కదిరి అర్బన్: స్థానిక ఎస్టీఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం అంతర్ కళాశాలల టోర్నమెంట్ (గ్రూప్ ఏ మెన్) ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, ఎస్కేయూ వైస్ ఛాన్స్‌లర్ జ్యోతికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో రాణించడం ఎంతో అవసరమన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, పట్టుదల నాయకత్వ లక్షణాలు వస్తాయన్నారు. ఈ టోర్నమెంట్‌లో హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, బాల్‌బాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా సలీంబాషా, పీడీ నరసింహాచారితో పాటు పలువురు అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.


