● నిందితుడికి టీడీపీ నేతల వత్తాసు
● బాధితురాలికి బెదిరింపులు..
● జిల్లా ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు
అనంతపురం సెంట్రల్: టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తోన్న రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఎస్సీ యువతిని పెళ్లి చేసుకుంటానని స్టోర్ డీలర్ కుమారుడు నమ్మించాడు. ఆపై అబార్షన్ చేయించి మొహం చాటేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో టీడీపీ ముఖ్య నేతలు రంగప్రవేశం చేసి నిందితునికే వత్తాసు పలికేలా దుప్పటి పంచాయితీ చేస్తున్నారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు..డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న ఎస్సీ యువతి(21)ని రెండేళ్లుగా అనంతపురం రూరల్ మండలం కురుగుంటకు చెందిన మనోజ్ వేధిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం గ్రామంలోని వారి స్టోర్ వద్దకు రావాలని మనోజ్ చెప్పడంతో యువతి అక్కడికి వెళ్లింది. అక్కడ చనువుగా ఉండేలా ఆమెతో మనోజ్ ప్రవర్తించాడు. ఆపై ఫొటోలను తీసుకుని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అనంతరం తరచుగా స్టోర్ వద్దకు ఆమెను పిలిపించుకుని శారీరకంగా వాడుకున్నాడు. దీంతో యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని మనోజ్‌కు ఆమె చెప్పడంతో అడ్డం తిరిగాడు. తనకు సంబంధం లేదని, ఇది ఎవరికై నా చెబితే మొత్తం వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. చివరకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. జరిగినదంతా యువతి తన తల్లిదండ్రులకు చెప్పగా వెంటనే వారు యువకుడి ఇంటికి వెళ్లి నిలదీశారు. అయితే..యువకుడి తల్లిదండ్రులు వీరిని అసభ్యంగా దూషించడంతో బాధితులు అనంతపురం రూరల్ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. అక్కడ టీడీపీ నేతలు రంగప్రవేశం చేసి దుప్పటి పంచాయితీ చేస్తున్నారు. వెంటనే గ్రామం వదిలిపోవాలని, లేకుంటే తలెత్తుకోకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. మరొకరితో తామే వివాహం చేయిస్తామని మభ్యపెట్టారు. దానికి యువతి ససేమిరా అంటూ న్యాయం కోసం ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై అనంతపురం రూరల్ సీఐ శ్రీకాంత్‌యాదవ్‌ను వివరణ కోరగా..ఇటీవల యువతి, ఆమె తల్లి పోలీసు స్టేషన్‌కు వచ్చారని, అయితే ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బొమ్మనహాళ్‌లో భారీ వర్షం
● కూలిన విద్యుత్ స్తంభాలు, పంట పొలాల్లోకి చేరిన నీరు
బొమ్మనహాళ్: మండలంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు ఉరుములు, మెరుపులతో వర్షం పడటంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. మండలంలోని బొల్లనగుడ్డం, కల్లుహోళ, తారకాపురం తదితర గ్రామాల్లో మిరప, మొక్కజొన్న, జొన్న పంట పొలాల్లోకి నీరు చేరింది. కల్లుదేవనహాళ్లి, బొమ్మనహాళ్ రహదారిపై వర్షం ధాటికి చెట్లు నేలకొరిగాయి. కల్లుదేవనహళ్లి గ్రామ సమీపంలో చెట్టు విరిగి 11 కేవీ విద్యుత్ వైర్లపై పడటంతో విద్యుత్ స్తంభం నెలకొరిగింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది సంఘటనా స్ధలానికి చేరుకొని మరమ్మతు చర్యలు చేపట్టారు.


