అనంతపురం: మదనపల్లిలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన గ్లోబల్ ఉద్యానవన హబ్ రిలయన్స్‌కు లబ్ధి చేకూర్చే ఎత్తుగడ అని ఉరవకొండ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, పార్టీ పీఏసీ సభ్యులు వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యాన హబ్ పేరుతో ప్రాజెక్టును గంపగుత్తగా రిలయన్స్‌కు కట్టబెట్టి సొమ్ము చేసుకోవడానికే ఈ హడావుడన్నారు. మదనపల్లిలో వంద ఎకరాల్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ను ఏర్పాటు చేసి, దాని నిర్వహణను రిలయన్స్‌కు అప్పగిస్తున్నారని తెలిపారు. ఈ సంస్థలో సాంకేతిక సలహాలు, డిజిటల్ అగ్రికల్చర్ పేరుతో దోపిడీకి తెరతీశారని, ఇందులో పేద రైతుల పిల్లలు చదువుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు.
55 టీఎంసీలు ఎక్కడి నుంచి తెస్తారు?
గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టు నిధుల్లో 90 శాతం నిధులు మౌలిక సదుపాయాలు, గ్రేడింగ్, ప్రాసెసింగ్, బ్రాండింగ్ పేరుతో మధ్యవర్తులు, ప్రైవేట్ సంస్థలకే చేరతాయని, ఉద్యాన సాగుకు కేవలం 10 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తారన్నారు. రాయలసీమ సాగునీటి పరిస్థితి దారుణంగా ఉంటే, అదనంగా 55 టీఎంసీల నీరు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న 20.77 లక్షల ఎకరాల ఉద్యాన సాగుకే నీళ్లు లేక పండ్ల తోటలు ఎండిపోతుంటే సీఎం చంద్రబాబు రైతులను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు రాకపోగా, ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 40,000 కోట్ల అప్పు ఇప్పిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేదిక మీదే చెప్పడం విచారకరమన్నారు.
కరువు తీవ్రత పట్టదా?
రాష్ట్రాన్ని తీవ్రమైన కరువు తాకినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, రైతులు, కూలీలు వలసలు పోతున్నారని విశ్వ ఆవేదన వ్యక్తం చేశారు. శనగ విత్తనానికి వందశాతం సబ్సిడీ ఇవ్వాల్సింది కేవలం 34 శాతం ఇస్తామని చెప్పి, అది కూడా ఎగనామం పెట్టారన్నారు. గ్లోబల్ హబ్ పేరుతో ప్రజాధనాన్ని పచ్చ గద్దలకు, ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం ఆపాలని, క్లస్టర్ల వారీగా రైతులు, రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాయలసీమ జోనల్ అధికార ప్రతినిధి కె.వి. రమణ, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరిమెల గోకుల్‌రెడ్డి, జిల్లా నాయకులు మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వ ధ్వజం


